ఒమన్‌లో 65 శాతం మందికి అధిక బరువు.. గుండె జబ్బులపై వైద్యుల ఆందోళన!!

- November 15, 2026 , by Maagulf
ఒమన్‌లో 65 శాతం మందికి అధిక బరువు.. గుండె జబ్బులపై వైద్యుల ఆందోళన!!

మస్కట్: గల్ఫ్ దేశాల్లో గుండె జబ్బుల కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. యూరప్, పాశ్చాత్య దేశాల్లో గుండె సంబంధిత వ్యాధులు తగ్గుముఖం పడుతుండగా, గల్ఫ్ ప్రాంతంలో మాత్రం పెరుగుతున్నాయని తెలిపారు. ఒమన్ జనాభాలో సుమారు 65 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారని వెల్లడించారు. మస్కట్‌లోని ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ (OCEC)లో నవంబర్ 12 నుంచి 14 వరకు జరిగిన 18వ గల్ఫ్ హార్ట్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ ముగింపు సందర్భంగా వైద్యులు ఈ వివరాలు వెల్లడించారు.

ఒమన్ హార్ట్ అసోసియేషన్ (OHA) ఛైర్మన్ డాక్టర్ కాధిమ్ జాఫర్ సులేమాన్ మాట్లాడుతూ.. గుండె జబ్బుల కేసులు పెరుగుతున్నప్పటికీ మరణాల సంఖ్య తగ్గడం మెరుగైన వైద్య చికిత్సలకు నిదర్శనమని చెప్పారు. అయితే వ్యాధుల నివారణ విషయంలో ఇంకా తగినంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సుల్తాన్ ఖాబూస్ యూనివర్సిటీ ఆసుపత్రికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఫహద్ అల్ కిండి వెల్లడించిన వివరాల ప్రకారం.. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో అడ్డంకులు ఏర్పడిన రోగులకు చికిత్సలో భాగంగా రక్తనాళాన్ని తెరిచేందుకు పట్టే సమయం గణనీయంగా తగ్గింది. 2018, 2019లో సగటున 142 నిమిషాలు పట్టగా, 2024 నాటికి ఇది సుమారు 75 నిమిషాలకు తగ్గింది.

అలాగే ఒమన్‌లో కార్డియాక్ కాథెటరైజేషన్ కేంద్రాల సంఖ్య ఏడుకు చేరింది. సుహార్, నిజ్వా, సూర్ ప్రాంతాల్లో కొత్త కేంద్రాలను ప్రారంభించడంతో ఈ సంఖ్య పెరిగింది. తదుపరి లక్ష్యం అంబులెన్స్‌లు, ఆసుపత్రులు, కాథెటరైజేషన్ కేంద్రాలను అనుసంధానిస్తూ దేశవ్యాప్తంగా సమగ్ర వైద్య నెట్‌వర్క్ ఏర్పాటు చేయడమేనని డాక్టర్ ఫహద్ అల్ కిండి తెలిపారు. గుండెపోటు లక్షణాలు కనిపిస్తే సొంత వాహనాల్లో ఆసుపత్రికి వెళ్లకుండా వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేయాలని సూచించారు.

ఒమన్‌లో తొలిసారిగా AI ఆధారిత గుండె జబ్బుల రిజిస్ట్రీ

ఒమన్‌లో AI ఆధారంగా పనిచేసే తొలి గుండె జబ్బుల రిజిస్ట్రీని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు డాక్టర్ ఖాలిద్ అల్ సైదీ వెల్లడించారు. ఈ అంశంపై ఆయన సమర్పించిన పరిశోధనా పత్రంలో గుండెపోటుకు గురైనవారికి, గుండె రక్తనాళాల్లో చికిత్స చేయించుకున్నవారికి అందిస్తున్న వైద్య సేవల్లో కొన్ని లోపాలు ఉన్నాయని వివరించారు. ముఖ్యంగా కొలెస్ట్రాల్ తగ్గించే మందులు, రక్తం గడ్డకట్టకుండా నిరోధించే మందులు, ప్లేట్‌లెట్ నిరోధక ఔషధాల వినియోగాన్ని మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు.

రాయల్ హాస్పిటల్‌లోని నేషనల్ హార్ట్ సెంటర్ ద్వారా ఈ పరిశోధనా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డుల్లోని సమాచారాన్ని AI సాయంతో విశ్లేషించి, చికిత్సలో ఉన్న లోపాలను గుర్తించడం దీని ప్రధాన లక్ష్యం. దీంతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, శాస్త్రీయ ఆధారాలతో కూడిన చికిత్సా విధానాలను ప్రోత్సహించవచ్చని వైద్యులు భావిస్తున్నారు. 

ఈ కాన్ఫరెన్స్‌కు సుమారు 700 మంది వైద్యులు, ఆరోగ్య రంగ నిపుణులు హాజరయ్యారు. గుండె జబ్బుల నివారణ, ఆధునిక చికిత్సా విధానాలు, AI వినియోగంపై చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com