యూఏఈలో క్యాంపింగ్ సీజన్ సందడి.. ఒక్కరోజు ట్రిప్‌కు Dh300..!!
- November 15, 2026
దుబాయ్: యూఏఈలో చలికాలం ప్రారంభమవుతుండటంతో క్యాంపింగ్ ప్రియులు వింటర్ సీజన్‌కు సిద్ధమవుతున్నారు. ఎడారులు, పర్వతాలు, సముద్ర తీరాల్లో రాత్రి బస చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒక్కరికి ఒక రాత్రి క్యాంపింగ్ ట్రిప్ కోసం సుమారు Dh300 ఖర్చవుతుండగా, తొలిసారి క్యాంపింగ్‌కు వెళ్లేవారు అవసరమైన ప్రాథమిక సామగ్రి కొనుగోలుకు Dh300 నుంచి Dh500 వరకు బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుందని నివాసితులు చెబుతున్నారు. టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు, వంట సామగ్రి, బార్బెక్యూ గ్రిల్స్, కట్టెలు వంటి వాటిని ముందుగానే సిద్ధం చేసుకుంటున్నారు. ఒకసారి కొనుగోలు చేసిన సామగ్రిని తిరిగి ఉపయోగించుకోవచ్చు కాబట్టి, తదుపరి ట్రిప్పుల్లో ఖర్చులు తగ్గుతాయని క్యాంపింగ్ ప్రియులు చెబుతున్నారు.
ఒక్కో ట్రిప్‌కు Dh300 ఖర్చు
రాస్ అల్ ఖైమాలో నివసించే అహ్మద్ అల్ మన్సూరీ తెలిపిన వివరాల ప్రకారం.. ఒక్కరికి ఒక రాత్రి క్యాంపింగ్‌కు సుమారు Dh300 ఖర్చవుతుంది. ఇందులో ఆహారం, పానీయాలు, మంచినీరు, వంటకు మరియు ఇతర అవసరాలకు ఉపయోగించే నీటి ఖర్చులు ఉంటాయి. అయితే కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వెళ్తే ఖర్చులను పంచుకోవడం ద్వారా వ్యయం తగ్గించుకోవచ్చని ఆయన చెప్పారు. క్యాంపింగ్ కోసం బొగ్గు సంచి Dh30 నుంచి Dh40 వరకు, ఒక పూర్తి చికెన్ సుమారు Dh25 ఉంటుంది. భోజనాన్ని బట్టి ఆహార ఖర్చు సుమారు Dh50 వరకు ఉండొచ్చు. వంట కోసం ఉపయోగించే చిన్న గ్యాస్ సిలిండర్ ధర Dh7 నుంచి Dh10 వరకు ఉంటుందని తెలిపారు.
కొందరు ఒంటరిగా ప్రశాంతంగా క్యాంపింగ్‌కు వెళ్తుంటే, మరికొందరు 30 మంది వరకు బృందాలుగా వెళ్తుంటారు. అలాంటి సందర్భాల్లో ప్రతి ఒక్కరూ తమకు అవసరమైన వస్తువులు తెచ్చుకోవడం లేదా వంట బాధ్యతలను పంచుకోవడం చేస్తుంటారు. ప్రతి వారాంతం క్యాంపింగ్‌కు వెళ్లడం కష్టమని, నెలకు ఒకటి లేదా రెండుసార్లు వెళ్లడం ఆచరణాత్మకమని మహమ్మద్ పేర్కొన్నారు.
కొత్తవారికి Dh300-Dh500 బడ్జెట్
యూఏఈలో నివసిస్తున్న బ్రెజిల్‌కు చెందిన మార్కోస్ మాట్లాడుతూ.. తొలిసారి క్యాంపింగ్‌కు వెళ్లేవారు ఖరీదైన సామగ్రి కొనాల్సిన అవసరం లేదన్నారు. ప్రాథమిక ఏర్పాట్లకు Dh300 నుంచి Dh400 సరిపోతుందని, అయితే అవసరమైన వస్తువులన్నీ సమకూర్చుకోవడానికి సుమారు Dh500 బడ్జెట్ ఉంచుకోవడం మంచిదని సూచించారు. ఆయన తెలిపిన ధరల ప్రకారం.. ఒక స్లీపింగ్ బ్యాగ్ Dh35-Dh36, సాధారణ టెంట్ సుమారు Dh70, చిన్న బార్బెక్యూ గ్రిల్ Dh20, పోర్టబుల్ క్యాంపింగ్ స్టవ్ Dh30 ఉంటుంది. రెండు వంట పాత్రల సెట్ ధర Dh10 నుంచి Dh20 వరకు ఉంటుందని వివరించారు. క్యాంపింగ్ అనుభవం, సౌకర్యాలను బట్టి ఖర్చులు మారుతాయని, అధునాతన ఏర్పాట్లు చేసుకునేవారికి మరింత ఎక్కువ బడ్జెట్ అవసరమవుతుందని చెప్పారు.
వేసవి నుంచే ఏర్పాట్లు
అనుభవం ఉన్న క్యాంపింగ్ ప్రియులు చలికాలం ప్రారంభం కాకముందే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొందరు వేసవిలోనే అవసరమైన సామగ్రిని కొనుగోలు చేస్తుంటే, మరికొందరు వాతావరణం చల్లబడిన తర్వాత పాత సామగ్రిని పరిశీలించి అవసరమైనవి కొనుగోలు చేస్తున్నారు. పెద్ద బృందాలుగా వెళ్లేవారు, ఎక్కువ రోజులు బస చేసేవారు సౌకర్యాల కోసం కారవాన్లు, పోర్టబుల్ టాయిలెట్లను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. కొన్ని కారవాన్లు Dh10,000 కంటే తక్కువ ధరకు కూడా లభిస్తున్నాయని అహ్మద్ తెలిపారు. వాటిలో ఉండే సౌకర్యాలను బట్టి ధరలు మారుతాయని చెప్పారు.
కొందరు వారం రోజుల ముందే ఏర్పాట్లు చేసుకుంటే, మరికొందరు ప్రయాణానికి రెండు రోజుల ముందు సిద్ధమవుతారు. అనుభవం ఉన్నవారు అదే రోజు కూడా క్యాంపింగ్‌కు వెళ్లాలని నిర్ణయించుకుంటారని తెలిపారు. టెంట్లు, టాయిలెట్ టెంట్లు, బార్బెక్యూ గ్రిల్స్, వంట పాత్రలు వంటి వాటిని తిరిగి ఉపయోగించుకోవచ్చు. అయితే తరచూ వినియోగించడం వల్ల గ్రిల్స్, వంట నెట్స్, కట్టెలు కాల్చేందుకు ఉపయోగించే పాత్రలు వంటి వాటిని అప్పుడప్పుడు మార్చాల్సి వస్తుందని వివరించారు.
క్యాంపింగ్ ప్రాంతాన్ని ఎంచుకోవడంలో జాగ్రత్తలు
క్యాంపింగ్‌కు వెళ్లే ప్రాంతాన్ని బట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మార్కోస్ సూచించారు. బీచ్ క్యాంపింగ్‌కు వెళ్లేవారు సముద్ర పరిస్థితులు, ఆటుపోట్లను పరిశీలించాలి. ఎడారి ప్రాంతాలకు వెళ్లేవారు ఫోర్ వీల్ డ్రైవ్ వాహనాన్ని సిద్ధం చేసుకోవడంతో పాటు కీటకాల నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలి. పర్వత ప్రాంతాల్లో ఎత్తు, బలమైన గాలులు, వాహనాలు వెళ్లగలిగే మార్గాల గురించి ముందుగానే తెలుసుకోవాలి. కొన్ని ప్రాంతాలకు ఫోర్ వీల్ డ్రైవ్ వాహనాలు అవసరమవుతాయి. వాతావరణ సూచనలను పరిశీలించాలని, వర్షపు నీరు ప్రవహించే ప్రాంతాల్లో క్యాంపింగ్ చేయకూడదని సూచించారు. చలిగా ఉండే రాత్రుల కోసం వెచ్చని దుస్తులు తీసుకెళ్లడంతో పాటు, మంటలు, బార్బెక్యూ కోసం తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు.
యూఏఈలో ప్రముఖ క్యాంపింగ్ ప్రాంతాలు
యూఏఈలో క్యాంపింగ్‌కు వెళ్లేందుకు అనేక అందమైన ప్రాంతాలు ఉన్నాయని అహ్మద్ తెలిపారు. వాటిలో ఫుజైరాలోని అల్ అఖా బీచ్, ఖోర్ ఫక్కాన్ పరిసర ప్రాంతాలు, రాస్ అల్ ఖైమాలోని జెబెల్ జైస్, జెబెల్ యానాస్, షౌకా, లివా ప్రాంతాలు ప్రముఖంగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రకృతి అందాలు, చల్లని వాతావరణం, కొన్ని చోట్ల అందుబాటులో ఉన్న ప్రజా సౌకర్యాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. బీచ్‌లు, పర్వతాలు, ఎడారుల్లో తమ అభిరుచికి అనుగుణంగా క్యాంపింగ్ అనుభవాన్ని ఎంచుకునే అవకాశం యూఏఈ నివాసితులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారతీయుల కోసం కొత్త ప్రాపర్టీ యాప్..!!
- బహ్రెయిన్‌లో మోగిన ప్రమాద హెచ్చరిక సైరన్లు..!!
- యూఏఈలో క్యాంపింగ్ సీజన్ సందడి.. ఒక్కరోజు ట్రిప్‌కు Dh300..!!
- సౌదీలో అక్రమ నివాసితులపై భారీ చర్యలు..!!
- బహ్రెయిన్‌లో హై అలర్ట్.. దేశవ్యాప్తంగా భద్రతా హెచ్చరికలు జారీ..
- ఫుజైరా ఘోర రోడ్డు ప్రమాదం.. మృతుల్లో 13 ఏళ్ల భారతీయ బాలుడు..
- హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం..
- బహ్రెయిన్‌లో విదేశీ డ్రైవర్లకు షాక్..!!
- ఒమన్‌లో పర్సనల్ స్టేటస్ చట్టంలో కీలక నిబంధనలు..!!
- ద్వైపాక్షిక సహకారంపై సౌదీ–అమెరికా చర్చలు..!!







