ఖతార్‌లో ఆహార భద్రతకు మరింత బలోపేతం..!!

- November 15, 2026 , by Maagulf
ఖతార్‌లో ఆహార భద్రతకు మరింత బలోపేతం..!!

దోహా: దేశంలో ఆహార భద్రతను మరింత బలోపేతం చేసేందుకు ఖతార్ ప్రభుత్వం వ్యూహాత్మక ధాన్య నిల్వ సదుపాయాలను విస్తరిస్తోంది. దేశీయ ఆహార ఉత్పత్తిని పెంచడంతో పాటు, దిగుమతుల కోసం ప్రత్యామ్నాయ వనరులను అభివృద్ధి చేస్తోంది. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడినా నిత్యావసర ఆహార పదార్థాలకు కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది. ఈ చర్యల్లో భాగంగా అల్ వుకైర్‌లో హస్సాద్ ఫుడ్ (Hassad Food) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యూహాత్మక ధాన్య నిల్వ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 

ఈ కేంద్రాల్లో మొత్తం 3,15,000 టన్నుల ధాన్యాన్ని నిల్వ చేసే సామర్థ్యం ఉంది. ఇందులో గోధుమలు, పశువుల దాణా కోసం ఉపయోగించే బార్లీ నిల్వలు ఉన్నాయి. ఈ నిల్వ కేంద్రాల్లో మొత్తం 25 భూగర్భ ధాన్య నిల్వ యూనిట్లు ఉండగా, వాటిలో 10 గోధుమల కోసం, 15 బార్లీ కోసం కేటాయించారు. గోధుమల నిల్వ సామర్థ్యం 1,25,000 టన్నులు కాగా, బార్లీ నిల్వ సామర్థ్యం సుమారు 1,90,000 టన్నులుగా ఉంది.

స్ట్రాటజిక్ గ్రెయిన్ స్టోరేజ్ ఫెసిలిటీస్‌లో ప్రాజెక్ట్ సపోర్ట్ విభాగం సీనియర్ ఎగ్జిక్యూటివ్ తాహా సమీహ్ అబు అల్-జుబైన్ ఈ వివరాలు వెల్లడించారు. నిల్వల్లో ఉన్న ధాన్యం పరిమాణాన్ని ప్రతిరోజూ కచ్చితంగా పర్యవేక్షిస్తున్నామని, అవసరమైనప్పుడు తక్షణ చర్యలు తీసుకునే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. అత్యవసర పరిస్థితులు, అంతర్జాతీయ పరిణామాల కారణంగా ఆహార సరఫరాలో అంతరాయాలు ఏర్పడినప్పుడు ఈ నిల్వలు మార్కెట్ స్థిరత్వాన్ని కాపాడటానికి ఉపయోగపడతాయని వివరించారు. మారుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ధాన్యం సరఫరా చేయడానికి కూడా ఈ కేంద్రాలు వెసులుబాటు కల్పిస్తాయని పేర్కొన్నారు.

హమద్ పోర్టులో 98 శాతం పూర్తయిన ప్రాజెక్టు

మరోవైపు, ఖతార్‌లోని హమద్ పోర్టులో చేపట్టిన ఫుడ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ అండ్ వేర్‌హౌసెస్ ప్రాజెక్టు 98 శాతం పూర్తయింది. దేశంలోని అత్యంత కీలకమైన ఆహార భద్రత ప్రాజెక్టుల్లో ఇది ఒకటి. ఈ ప్రాజెక్టు 5,30,000 చదరపు మీటర్లకు పైగా (53 హెక్టార్లు) విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఇందులో మొత్తం 3,00,000 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో 51 భారీ సైలోలను ఏర్పాటు చేస్తున్నారు. బియ్యం, చక్కెర, వంట నూనెల ప్రాసెసింగ్, తయారీ, నిల్వ కోసం ప్రత్యేక సదుపాయాలను కూడా ఇందులో భాగంగా అభివృద్ధి చేస్తున్నారు. వంట నూనెల శుద్ధి, బియ్యం ప్రాసెసింగ్ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అత్యున్నత నిర్వహణ ప్రమాణాలకు అనుగుణంగా ఈ సదుపాయాలను రూపొందిస్తున్నారు.

మూడు ప్రధాన స్తంభాలతో జాతీయ ఆహార భద్రత వ్యూహం

ఖతార్ జాతీయ ఆహార భద్రత వ్యూహం 2030లో భాగంగా మొత్తం 17 కార్యక్రమాలను చేపట్టింది. వీటిని మూడు ప్రధాన విభాగాలుగా అమలు చేస్తున్నారు. మొదటి విభాగంలో దేశీయ ఆహార ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారించారు. కూరగాయలు, గొర్రెలు, మేకల వంటి జంతువుల తాజా మాంసం, చేపల ఉత్పత్తిని పెంచడంతో పాటు, తాజా పాల ఉత్పత్తులు, కోళ్ల మాంసం విషయంలో స్వయం సమృద్ధిని కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆధునిక వ్యవసాయ సాంకేతికత, స్థిరమైన సాగు పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించనున్నారు.

రెండో విభాగంలో వ్యూహాత్మక ఆహార నిల్వలను పెంచడం, వ్యవసాయానికి అవసరమైన ముడిసరుకులను నిల్వ చేయడం, అత్యవసర పరిస్థితుల్లో దేశీయ వ్యవసాయ ఉత్పత్తి నిలిచిపోకుండా చూడటంపై దృష్టి పెట్టారు. అంతర్జాతీయంగా ఎదురయ్యే ప్రమాదాలను ముందుగానే గుర్తించేందుకు కేంద్రీకృత ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను కూడా అభివృద్ధి చేయనున్నారు.

మూడో విభాగంలో అంతర్జాతీయ వాణిజ్య సామర్థ్యాన్ని పెంచడం, ఆహార దిగుమతులకు కొత్త దేశాలు, వనరులను గుర్తించడం, దేశీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. హమద్ పోర్టులో నిల్వ సామర్థ్యాలను మరింత విస్తరించి, వాణిజ్య భాగస్వామ్యాలు, వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా ప్రాంతీయ ఆహార వాణిజ్య, ప్రాసెసింగ్ కేంద్రంగా తీర్చిదిద్దాలని యోచిస్తున్నారు.

ఈ మూడు విభాగాల ద్వారా అంతర్జాతీయ మార్కెట్లలో ధరల మార్పులు, సరఫరా అంతరాయాల ప్రభావాన్ని తగ్గించడంతో పాటు, దేశీయ ఉత్పత్తిని పెంచి, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని మెరుగుపరచాలని ఖతార్ లక్ష్యంగా పెట్టుకుంది. హస్సాద్ ఫుడ్ ఆధ్వర్యంలోని ధాన్య నిల్వ కేంద్రాలు ఈ సమగ్ర వ్యూహంలో కీలక భాగంగా నిలుస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com