హైదరాబాద్‌లో 27వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలు ప్రారంభం

- November 16, 2026 , by Maagulf
హైదరాబాద్‌లో 27వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలు ప్రారంభం

25 పోలీస్ బ్యాండ్లు..1,500 మంది సిబ్బంది పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణ

హైదరాబాద్: తెలంగాణలో 27వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలు–2026 ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని సీఆర్‌పీఎఫ్ గ్రూప్ సెంటర్ (GC RRY)లో నిర్వహిస్తున్న ఈ పోటీలను తెలంగాణ డీజీపీ సీ.వి. ఆనంద్ ప్రారంభించారు. సీఆర్‌పీఎఫ్ ఈ పోటీలకు ఆతిథ్యమిస్తోంది.

ఈ ఏడాది దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు చెందిన సుమారు 1,500 మంది సిబ్బందితో కూడిన 25 బ్యాండ్లు పోటీల్లో పాల్గొంటున్నాయి. పైప్ బ్యాండ్, బ్యాగ్‌పైప్, డ్రమ్స్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు.

ఈసారి పోటీల్లో తొలిసారిగా సీఆర్‌పీఎఫ్, హిమాచల్ ప్రదేశ్ పోలీసులకు చెందిన మహిళా పోలీస్ బ్యాండ్లు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ సందర్భంగా డీజీపీ సీ.వి. ఆనంద్ మాట్లాడుతూ పోలీస్ బ్యాండ్లు పోలీసు వ్యవస్థకు ఆత్మ వంటివని పేర్కొన్నారు. శతాబ్దాల క్రితం యుద్ధభూముల్లో సంకేతాలు అందించడం, అధికారిక వేడుకల్లో సంగీతాన్ని అందించడం వంటి బాధ్యతలతో ప్రారంభమైన పోలీస్ బ్యాండ్లు, నేడు ఆకట్టుకునే మార్చ్‌పాస్ట్‌లు, క్లిష్టమైన సంగీత ప్రదర్శనల వరకు అభివృద్ధి చెందాయని వివరించారు.

పోలీస్ బ్యాండ్ల ప్రదర్శనల్లో ధైర్యసాహసాలు, త్యాగం, కర్తవ్యనిష్ఠ, క్రమశిక్షణ వంటి విలువలు ప్రతిబింబిస్తాయని తెలిపారు. గుజరాత్‌లోని కెవాడియాలో నిర్వహించిన 'ఏక్తా పరేడ్'ను ఈ సందర్భంగా గుర్తుచేస్తూ, అది సేవాభావం, ఐక్యత, ప్రతిభకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందన్నారు.

నవంబర్ 16 నుంచి 20 వరకు ఐదు రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. పోలీసు సిబ్బందిలోని సంగీత ప్రతిభను వెలికితీయడంతో పాటు వివిధ రాష్ట్రాలు, కేంద్ర బలగాల మధ్య స్నేహభావం, ఐక్యత, సమన్వయం, పరస్పర అభ్యాసాన్ని పెంపొందించేందుకు ఈ పోటీలు దోహదపడనున్నాయి.

పోటీల్లో పాల్గొనే అన్ని బృందాలకు తెలంగాణకు స్వాగతం పలికిన డీజీపీ, రాష్ట్రంలోని చారిత్రక ప్రదేశాలను సందర్శించాలని, ఆధునిక ఐటీ కారిడార్‌ను చూడాలని, ప్రసిద్ధ హైదరాబాద్ బిర్యానీని ఆస్వాదించాలని ఆహ్వానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com