కేరళకు చెందిన భారతీయుడిని వరించిన అదృష్టం..!!

- November 17, 2026 , by Maagulf
కేరళకు చెందిన భారతీయుడిని వరించిన అదృష్టం..!!

దుబాయ్: యూఏఈలోని బిగ్ టికెట్ లక్కీ డ్రాలో కేరళకు చెందిన భారతీయ సూపర్ మార్కెట్ ఉద్యోగికి భారీ బహుమతి లభించింది. 37 ఏళ్ల షఫీ పొక్కులంగర బప్పుహాజీ 200 గ్రాముల 24 క్యారెట్ల బంగారు బార్‌ను గెలుచుకున్నారు. తన తండ్రికి అదృష్ట సంఖ్యగా భావించే నంబర్‌తో టికెట్ కొనుగోలు చేయడం ఆయనకు కలిసివచ్చింది.

బిగ్ టికెట్ సిరీస్ 292లో ఐదుగురు విజేతల్లో షఫీ ఒకరు. గత మూడేళ్లుగా ఆయన 15 నుంచి 20 మంది స్నేహితులతో కలిసి బిగ్ టికెట్‌లో పాల్గొంటున్నారు. అయితే తాను గెలిచిన విషయాన్ని బిగ్ టికెట్ నిర్వాహకుల నుంచి కాకుండా స్నేహితుడి ఫోన్ ద్వారా తెలుసుకున్నారు. ఆ తర్వాత వెబ్‌సైట్‌లో ఫలితాలు పరిశీలించడంతో విజయం ఖరారైంది.

ఈ బంగారు బార్‌ను విక్రయించి యూఏఈలో సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని షఫీ, ఆయన స్నేహితులు భావిస్తున్నారు. ఈ విజయం తమ కలను సాకారం చేసుకునేందుకు ఉపయోగపడుతుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. నవంబర్ 16 నాటికి యూఏఈలో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు Dh460కు పైగా ఉంది. ఈ లెక్కన 200 గ్రాముల బంగారు బార్ విలువ Dh92,000కు మించి ఉండవచ్చు. అయితే విక్రయించే సమయానికి మార్కెట్ ధరను బట్టి అసలు విలువ మారే అవకాశం ఉంది.

మరో విజేత 25 ఏళ్ల అన్షాద్ వీఎం. కేరళకు చెందిన ఆయన రెండేళ్లుగా అల్ ఐన్‌లో నివసిస్తూ సేల్స్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. 25 మంది స్నేహితులతో కలిసి ప్రతి నెలా రెండు నుంచి మూడు టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. బంగారు బహుమతిని విక్రయించి వచ్చిన మొత్తాన్ని స్నేహితులందరికీ సమానంగా పంచుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. గ్రూపులో కొందరికి అప్పులు ఉండటంతో ఈ డబ్బును ఆర్థిక అవసరాలకు వినియోగించుకోనున్నారు. తన వాటాను కేరళలోని కుటుంబానికి సహాయంగా అందిస్తానని అన్షాద్ తెలిపారు.

అప్పుడప్పుడు టికెట్ కొన్నా అదృష్టం వరించింది

బంగ్లాదేశ్‌కు చెందిన 36 ఏళ్ల ఎండీ సైఫుల్ ఇస్లాం కూడా బంగారు బార్ గెలుచుకున్నారు. గత 15 ఏళ్లుగా షార్జాలో నివసిస్తున్న ఆయన సొంతంగా ప్రింటింగ్ ప్రెస్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. కుటుంబం మాత్రం బంగ్లాదేశ్‌లోనే ఉంటోంది. ఇతర విజేతల్లా గ్రూపుగా కాకుండా వ్యక్తిగతంగా మిగిలిన ఇద్దరు విజేతల్లో యూఏఈ జాతీయుడు అహ్మద్ అల్ కెత్బీ (టికెట్ నంబర్ 236854), భారతీయ ప్రవాసి మొహమ్మద్ ముస్లిం (టికెట్ నంబర్ 197099) ఉన్నారు.

డిసెంబర్ 3న Dh25 మిలియన్ల బంపర్ డ్రా

ఇదిలా ఉండగా, బిగ్ టికెట్ నవంబర్ ప్రమోషన్‌లో భాగంగా డిసెంబర్ 3న లైవ్ డ్రా నిర్వహించనున్నారు. ఇందులో విజేతకు Dh25 మిలియన్ల భారీ బహుమతి అందించనున్నారు. మరో ఐదుగురికి ఒక్కొక్కరికి Dh100,000 చొప్పున కన్సొలేషన్ బహుమతులు ఇవ్వనున్నారు. ఇంకా మూడు వారపు ఈ-డ్రాలు మిగిలి ఉన్నాయి. వీటిలో నలుగురికి ఒక్కొక్కరికి Dh25,000 చొప్పున గెలుచుకునే అవకాశం ఉంది.

అలాగే జనవరి 3న నిర్వహించే బిగ్ స్పిన్‌లో ఎంపికైన ముగ్గురు పాల్గొనేవారికి Dh1 మిలియన్ వరకు గెలుచుకునే అవకాశం కల్పించనున్నారు. కారు బహుమతుల్లో భాగంగా డిసెంబర్ 3న నిస్సాన్ పెట్రోల్, జనవరి 3న BMW M440i కారును అందించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com