బహ్రెయిన్‌లో భక్తిశ్రద్ధలతో ఛఠ్ పూజ..!!

- November 17, 2026 , by Maagulf
బహ్రెయిన్‌లో భక్తిశ్రద్ధలతో ఛఠ్ పూజ..!!

మనామా: బహ్రెయిన్‌లోని అస్రీ బీచ్‌లో భారతీయ ప్రవాసులు ఛఠ్ పూజ వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అరేబియా గల్ఫ్ సముద్ర తీరంలో సూర్యాస్తమయ సమయంలో నిర్వహించిన సంధ్యా అర్ఘ్య పూజలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

బిహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు చెందిన పలువురు భారతీయులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సముద్రపు నీటిలో నడుము లోతు వరకు నిలబడి వెదురు బుట్టల్లో తేక్వా, తాజా పండ్లు, చెరకు, దీపాలు ఉంచి అస్తమిస్తున్న సూర్యుడికి భక్తితో అర్ఘ్యం సమర్పించారు. ఛఠీ మాతను స్తుతిస్తూ ఆలపించిన సంప్రదాయ జానపద గీతాలతో బీచ్ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.

సూర్య భగవానుడు, ఛఠీ మాతకు అంకితం చేసిన ఈ పండుగలో పవిత్రత, క్రమశిక్షణ, భక్తి ప్రధానమైనవి. ఆరోగ్యం, సిరిసంపదలు, కుటుంబ సభ్యుల క్షేమం కోసం భక్తులు ఉపవాస దీక్షలు పాటిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్వదేశానికి దూరంగా ఉన్నప్పటికీ భారతీయులు తమ సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు.

బహ్రెయిన్‌లో స్వేచ్ఛగా, ఆనందంగా పండుగ జరుపుకునేందుకు సహకరించిన ఆ దేశ ప్రభుత్వానికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుక విజయవంతం కావడానికి కృషి చేసిన వాలంటీర్లు, సహకరించిన శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com