బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..!!

- November 20, 2026 , by Maagulf
బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..!!
మనామా: బహ్రెయిన్‌లోని ఇండియన్ స్కూల్ (ISB) 2026 వార్షిక సర్వసభ్య సమావేశం (AGM), 2026–2029 కాలానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నికలు డిసెంబర్ 11న నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలు ఇసా టౌన్ క్యాంపస్‌లో జరగనున్నాయి. ఎగ్జిక్యూటివ్ కమిటీలోని ఏడు స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు.
 
స్కూల్ గౌరవ కార్యదర్శి వి. రాజపాండియన్, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు దిలీప్ కుమార్ మురళీధర్ భాటియా, అనీష్ అజిక్కల్ శ్రీధరన్, మొహమ్మద్ గౌస్ మొహమ్మద్ సలీమ్ ఈ వివరాలను ప్రకటించారు. 2026 సెప్టెంబర్ 25న జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఆమోదించిన కొత్త రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు నిర్వహించనున్నారు.
 
నవంబర్ 22 నుంచి నవంబర్ 29 వరకు పాఠశాల కార్యాలయంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నామినేషన్ ఫారాలు అందుబాటులో ఉంటాయి. సెలవు రోజుల్లోనూ ఫారాలు పొందవచ్చు. నామినేషన్ల సమర్పణకు నవంబర్ 30 మధ్యాహ్నం 2 గంటల వరకు గడువు ఉంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు సీల్డ్ నామినేషన్ బాక్స్‌ను తెరుస్తారు. అర్హత పొందిన అభ్యర్థుల జాబితాను డిసెంబర్ 1న సాయంత్రం 6 గంటలకు ప్రకటిస్తారు. డిసెంబర్ 2న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అదే రోజు సాయంత్రం 7 గంటలకు తుది అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు.
 
అభ్యర్థులకు అర్హతలు
 
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ఇండియన్ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులై ఉండాలి. కనీసం రెండేళ్లుగా బహ్రెయిన్‌లో నివసిస్తూ ఉండాలి. ఎన్నికల సమయానికి కనీసం ఒక పిల్లవాడు పాఠశాలలో చదువుతూ ఉండాలి. మరో రెండేళ్లపాటు సభ్యత్వానికి అర్హత కలిగి ఉండాలి. భారత యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా గుర్తింపు పొందిన విదేశీ యూనివర్సిటీ నుంచి రెగ్యులర్ లేదా ఫుల్‌టైమ్ బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. డిగ్రీ సర్టిఫికెట్లను బహ్రెయిన్ ప్రభుత్వం ఆమోదించిన క్వాడ్రాబే (QuadraBay) సంస్థ ద్వారా పరిశీలిస్తారు. ఒక వ్యక్తి గరిష్ఠంగా రెండు పర్యాయాలు మాత్రమే ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యుడిగా కొనసాగవచ్చు.
 
ఓటు హక్కు ఎవరికి ఉంటుంది?
 
AGMలో పాల్గొనడానికి, ఓటు వేయడానికి తల్లిదండ్రులు తప్పనిసరిగా BD 5 వార్షిక సభ్యత్వ రుసుము చెల్లించి ఉండాలి. అంతేకాకుండా నవంబర్ 2026 వరకు తమ పిల్లలకు సంబంధించిన పాఠశాల ఫీజు బకాయిలన్నీ చెల్లించి ఉండాలి. అలాగే సమావేశానికి హాజరయ్యే సభ్యులు తమ మెంబర్‌షిప్ నంబర్‌తో పాటు చెల్లుబాటు అయ్యే CPR కార్డును తీసుకురావాలి. ఓటు వేయడానికి చెల్లుబాటు అయ్యే CPR, బహ్రెయిన్ డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఒరిజినల్ పాస్‌పోర్ట్‌లలో ఏదో ఒక ఫొటో గుర్తింపు పత్రం తప్పనిసరి. ఓటు హక్కు ప్రధానంగా తండ్రికి ఉంటుంది. ఆయన గైర్హాజరైనప్పుడు, సమ్మతి తెలిపినప్పుడు లేదా న్యాయస్థానం ఆదేశాల మేరకు తల్లి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.
 
పోలింగ్, ఓట్ల లెక్కింపు
 
డిసెంబర్ 11న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు AGM నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. రాత్రి 8:30 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలు ప్రకటిస్తారు. 2026 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ నివేదిక, ఖాతాల వివరాల ముసాయిదాను నవంబర్ 25న ఇసా టౌన్ క్యాంపస్ నోటీసు బోర్డులో ప్రదర్శిస్తారు. వాటి ప్రతులు కావాలనుకునే సభ్యులు నవంబర్ 29లోగా ప్రిన్సిపాల్‌కు లిఖితపూర్వకంగా దరఖాస్తు చేయాలి. సమావేశంలో ప్రవేశపెట్టాల్సిన తీర్మానాలు, ప్రతిపాదనలు, సవరణలను నవంబర్ 30లోగా గౌరవ కార్యదర్శికి రాతపూర్వకంగా అందజేయాలి.
 
తల్లిదండ్రుల కోసం ప్రత్యేక బస్సులు
 
ఎన్నికల్లో పాల్గొనే తల్లిదండ్రుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. డిసెంబర్ 11న ఉదయం 7 గంటలకు ముహర్రక్, రిఫా, మనామా, గుదైబియా, సల్మానియా, జుఫైర్ ప్రాంతాల నుంచి బస్సులు బయలుదేరుతాయి. తిరుగు ప్రయాణం మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుంది. రవాణా సదుపాయాల వివరాల కోసం ట్రాన్స్‌పోర్ట్ కోఆర్డినేటర్ సునీల్ కుమార్ (33660521), ఇస్మాయిల్ (36540443)ను సంప్రదించవచ్చని పాఠశాల ప్రస్తుత మేనేజింగ్ కమిటీ తన సర్క్యులర్‌లో పేర్కొంది.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com