విశాఖకు మరో ఐటీ కిరీటం..‘బే-టెక్ సిటీ’ నిర్మాణానికి సీఎం ఆదేశం

- November 20, 2026 , by Maagulf
విశాఖకు మరో ఐటీ కిరీటం..‘బే-టెక్ సిటీ’ నిర్మాణానికి సీఎం ఆదేశం

అమరావతి: రాష్ట్ర సమగ్రాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్‌లో చేపట్టే యాంకర్ ప్రాజెక్టుకు ‘విశాఖ బే-టెక్ సిటీ’గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు ఖరారు చేశారు. హైదరాబాద్‌లోని సైబరాబాద్ మాదిరిగానే విశాఖకు అనుబంధంగా ఈ నూతన నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

మూడు ఆర్థిక ప్రాంతాలపై సమీక్ష..రూ.9,180 కోట్ల ప్రాజెక్టులు

తన క్యాంపు కార్యాలయంలో విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఎకనమిక్ రీజియన్ల అభివృద్ధి ప్రణాళికలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ మూడు ప్రాంతాల ప్రణాళికలు రాష్ట్రానికి మార్గదర్శక బ్లూప్రింట్‌గా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రాజెక్టుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు రూపొందించాలని, కేంద్ర ప్రభుత్వ ‘సిటీ ఎకనమిక్ రీజియన్ స్కీం’ కింద ప్రతిపాదించిన రూ. 9,180 కోట్ల విలువైన 60 ప్రాజెక్టులను వేగంగా అమల్లోకి తీసుకురావాలని నిర్దేశించారు.

ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు.. ప్రత్యేక పాలసీ పై సూచన

పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. విశాఖకు ఇరువైపులా ఉన్న విజయనగరం, అనకాపల్లి జిల్లాలలో ముందుగానే భూములను గుర్తించాలని చెప్పారు. భూమి లభ్యత తక్కువగా ఉన్న ఉభయ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఏపీఐఐసీతో సమన్వయం చేసుకుని ల్యాండ్ బ్యాంక్ సిద్ధం చేయాలని, అవసరమైతే కొత్త పాలసీని తీసుకురావాలని స్పష్టం చేశారు.

తిరుపతి సెమీకండక్టర్ లక్ష్యం..అమరావతి వృద్ధి చోదకాలు

తిరుపతి ఎకనమిక్ రీజియన్‌ను టెక్నాలజీ, పరిశ్రమలు, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సీఎం లక్ష్యాన్ని నిర్దేశించారు. తిరుపతిని ‘గ్లోబల్ సెమీకండక్టర్ల డిజైన్ క్యాపిటల్’గా అభివృద్ధి చేసేందుకు స్పష్టమైన రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలన్నారు. అమరావతి రీజియన్‌లో ఆక్వా, పామాయిల్ రంగాలు ఆర్థిక వృద్ధికి ప్రధాన చోదక శక్తులుగా ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు ఈ ప్రాంత అభివృద్ధికి కీలకంగా మారతాయని చెబుతూ, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులకు కనెక్టివిటీ పెంచితే వేగవంతమైన ప్రగతి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.

పర్యాటక రంగానికి ఊతం..మాస్టర్ ప్లాన్‌కు ఆదేశం

రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాల అభివృద్ధి పైనా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు. అరకు, లంబసింగి వంటి ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పర్యాటకులను విశేషంగా ఆకర్షించాలని సూచించారు. సూర్యలంక, ఓడరేవు, గండికోట వంటి ప్రాంతాలలో పర్యాటక వసతులు, అభివృద్ధికి సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com