లిబియాలో రష్యా నౌకపై డ్రోన్ దాడి అనుమానం.. బెంఘాజీ నౌకాశ్రయంలో భారీ పేలుడు

- November 22, 2026 , by Maagulf
లిబియాలో రష్యా నౌకపై డ్రోన్ దాడి అనుమానం.. బెంఘాజీ నౌకాశ్రయంలో భారీ పేలుడు

ట్రిపోలీ: లిబియాలోని బెంఘాజీ నౌకాశ్రయంలో నిలిపి ఉంచిన రష్యాకు చెందిన ఓ నౌకపై డ్రోన్ దాడి జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం జరిగిన ఈ ఘటనలో నౌకపై భారీ పేలుడు సంభవించినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తూర్పు లిబియా అధికారులు వెల్లడించారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, రష్యా నౌకను డ్రోన్లతో లక్ష్యంగా చేసుకుని దాడి చేసి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఈ దాడికి ఎవరు పాల్పడ్డారనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఏ సంస్థా బాధ్యత ప్రకటించలేదు.

సదరు నౌక రష్యాకు తిరిగి వెళ్తున్న సమయంలో ఇంధనం నింపుకోవడం, అవసరమైన సరఫరాలు తీసుకోవడం కోసం బెంఘాజీ నౌకాశ్రయంలో ఆగినట్లు అధికారులు తెలిపారు.

మొదట నౌకాదళ స్థావరంలోని ఆయుధాల నిల్వ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగినట్లు వార్తలు వచ్చినప్పటికీ, పేలుడు రష్యా నౌకలోనే సంభవించినట్లు తూర్పు లిబియా అధికారులు స్పష్టం చేశారు.

రష్యాతో కలిసి సంయుక్త దర్యాప్తు
ఈ ఘటనపై రష్యా అధికారులతో కలిసి సంయుక్త దర్యాప్తు చేపట్టనున్నట్లు లిబియాలోని తూర్పు ప్రాంత పరిపాలన ప్రకటించింది. మరోవైపు, ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన ట్రిపోలీ ప్రభుత్వం ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసింది.

అంతర్జాతీయ ఘర్షణలకు సంబంధించిన కార్యకలాపాల్లో పౌర నౌకాశ్రయాలు, ఇతర సదుపాయాలను ఉపయోగించడం వల్ల భద్రతాపరమైన ముప్పులు ఏర్పడతాయని హెచ్చరించింది. లిబియాను అంతర్జాతీయ సంఘర్షణలకు వేదికగా మార్చడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేసింది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం?
2022లో ఉక్రెయిన్‌పై రష్యా పూర్తిస్థాయి దండయాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఇరుదేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల ఉక్రెయిన్ బలగాలు రష్యా భూభాగంలోని ముందువరుస యుద్ధ ప్రాంతాలకు దూరంగా ఉన్న లక్ష్యాలపైనా డ్రోన్ దాడులను తీవ్రతరం చేశాయి.

శనివారం కూడా ఫిన్లాండ్ సమీపంలోని తూర్పు బాల్టిక్ సముద్రంలో రష్యాకు చెందిన ఓ కార్గో నౌకపై డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం. ఈ దాడి ఉక్రెయిన్ చేసినట్లు ఫిన్లాండ్ సరిహద్దు రక్షణ అధికారులు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, గత మార్చిలో లిబియా తీరానికి సమీపంలో రష్యాకు చెందిన ద్రవీకృత సహజ వాయువు (LNG) రవాణా నౌక దాడి అనంతరం మునిగిపోయింది. ఈ ఘటనకు ఉక్రెయిన్ కారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. పాశ్చాత్య దేశాల ఆంక్షలను తప్పించుకుంటూ రష్యా చమురు, గ్యాస్‌ను రవాణా చేసే నౌకలను 'షాడో ఫ్లీట్'గా పిలుస్తారు. ఇలాంటి నౌకలపై దాడులు జరిగిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి.

లిబియాలో కొనసాగుతున్న రాజకీయ అస్థిరత
2011లో దీర్ఘకాల రూలర్ ముఅమ్మర్ గడాఫీ అధికారం కోల్పోయిన తర్వాత నుంచి లిబియాలో హింస, రాజకీయ అస్థిరత కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశం రెండు ప్రత్యర్థి పరిపాలనల మధ్య విభజితమై ఉంది.

ట్రిపోలీ కేంద్రంగా ప్రధానమంత్రి అబ్దుల్ హమీద్ ద్బీబా నేతృత్వంలో ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన ప్రభుత్వం కొనసాగుతుండగా, తూర్పు లిబియాలో సైనిక కమాండర్ ఖలీఫా హఫ్తార్ మద్దతుతో మరో పరిపాలన కొనసాగుతోంది.

పేలుడు అనంతరం అగ్నిమాపక, పౌర రక్షణ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నాయి. పరిసర ప్రాంతాల ప్రజలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. అనంతరం మంటలను పూర్తిగా అదుపు చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com