GTA 6 గేమ్‌పై యూఏఈ హెచ్చరిక..!!
- November 22, 2026
దుబాయ్: ప్రముఖ వీడియో గేమ్ ‘గ్రాండ్ తెఫ్ట్ ఆటో 6’ (GTA 6) విషయంలో యూఏఈ అధికారులు తల్లిదండ్రులను అప్రమత్తం చేశారు. ఈ గేమ్‌లో మాదకద్రవ్యాల వినియోగం, నేర కార్యకలాపాలకు సంబంధించిన సన్నివేశాలు ఉండటంతో పిల్లలు, యువతపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. యూఏఈ నేషనల్ యాంటీ నార్కోటిక్స్ అథారిటీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
గేమ్‌లో డ్రగ్స్ వినియోగం, చట్టవిరుద్ధ కార్యకలాపాలను చూపించే సన్నివేశాలు పిల్లల ఆలోచనా విధానం, ప్రవర్తనపై ప్రభావం చూపవచ్చని తెలిపింది. ఇలాంటి ప్రమాదకర ప్రవర్తన సాధారణమేననే భావన పిల్లల్లో ఏర్పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించింది. పిల్లలు ఆడే వీడియో గేమ్‌లపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని, వాటి వయోపరిమితులను తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు కోరారు. గేమ్‌లలో ఉండే అభ్యంతరకర అంశాలు, వాటి వల్ల కలిగే ప్రమాదాల గురించి పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు.
మరోవైపు, ఈ గేమ్ కంటెంట్‌పై యూఏఈలోని తల్లిదండ్రులు, ప్రజలు సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పాఠశాలలు కూడా తల్లిదండ్రులకు ప్రత్యేక సూచనలు జారీ చేశాయి. గేమ్‌కు ప్రజాదరణ ఉన్నప్పటికీ అది పిల్లల కోసం రూపొందించినది కాదని స్పష్టం చేశాయి. GTA 6లో తీవ్రమైన హింస, నేర కార్యకలాపాలు, అసభ్య పదజాలం, లైంగిక అంశాలు, మాదకద్రవ్యాల ప్రస్తావనలు ఉన్నాయని ఖలీజ్ టైమ్స్ పేర్కొంది. యూఏఈ నేషనల్ మీడియా అథారిటీ ఈ గేమ్‌కు 21+ వయోపరిమితి కేటాయించింది. దేశంలో వీడియో గేమ్‌లకు ఇచ్చే అత్యధిక వయోపరిమితి ఇదే కావడం గమనార్హం.
ఆన్లైన్ ద్వారా డ్రగ్స్ వలలో యువత
ఇటీవల డ్రగ్స్ ముఠాలు సోషల్ మీడియా, ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌లు, ఎలక్ట్రానిక్ చెల్లింపుల ద్వారా యువతను లక్ష్యంగా చేసుకుంటున్నాయని యూఏఈ అధికారులు హెచ్చరించారు. నేషనల్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ సలహాదారు డాక్టర్ అబ్దుల్లా అల్ ఖయాత్ నవంబర్ 12న దుబాయ్ పోలీస్ ఆఫీసర్స్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డ్రగ్స్ అక్రమ రవాణాదారులు యువతను ఆకర్షించేందుకు కొత్త మార్గాలను అనుసరిస్తున్నారని తెలిపారు.
డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ముందస్తు అవగాహన కల్పించడం ఇక అదనపు చర్య కాదని, అదే ప్రధాన రక్షణ మార్గమని పేర్కొన్నారు. ఆన్లైన్లో డ్రగ్స్ వినియోగం వైపు ఆకర్షించే ప్రయత్నాలను యువత గుర్తించేలా అవగాహన కల్పించడంతో పాటు, పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలను తల్లిదండ్రులు పర్యవేక్షించాలని సూచించారు. ఇంట్లో పిల్లలతో బహిరంగంగా మాట్లాడటం, వారికి సరైన మార్గనిర్దేశం చేయడం కూడా ముఖ్యమని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో ఇక పేపర్ సిక్‌లీవ్ సర్టిఫికెట్లకు సెలవు..!
- కువైట్‌లో 10 మంది అరెస్ట్, 6 వాహనాలు స్వాధీనం..!!
- ఇరాన్ దాడులపై UN కు బహ్రెయిన్ ఫిర్యాదు..!!
- GTA 6 గేమ్‌పై యూఏఈ హెచ్చరిక..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రైళ్ల కొత్త డిజైన్‌ను పరిశీలించిన షేక్ హమ్దాన్..
- తిరుమల శ్రీవారికి పారిశ్రామికవేత్త భారీ కానుక..
- ఇరాన్ వైమానిక దాడులను అడ్డుకున్న బహ్రెయిన్ రక్షణ వ్యవస్థలు
- షేక్ జాయెద్ రోడ్డు పై పరుగుల సందడి.. ఘనంగా దుబాయ్ రన్ 2026 ప్రారంభం
- మెక్సికోలో కార్టెల్ హింస..11 మంది మృతి
- కువైట్–అమెరికా ఆర్థిక సంబంధాల బలోపేతానికి చర్చలు..!!







