యూఏఈలో ఆన్‌లైన్ సెల్లర్స్ కు కొత్త రూల్స్..!!

- November 23, 2026 , by Maagulf
యూఏఈలో ఆన్‌లైన్ సెల్లర్స్ కు కొత్త రూల్స్..!!

దుబాయ్: యూఏఈలో ఆన్‌లైన్ సెల్లర్స్ కు ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇకపై తమ ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా థర్డ్ పార్టీ సంస్థలు లేదా వ్యక్తులు విక్రయించే వస్తువులు, సేవలకు కూడా ఆన్‌లైన్ విక్రయదారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ మేరకు దేశ వినియోగదారుల రక్షణ నిబంధనల్లో కీలక సవరణలకు యూఏఈ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. క్యాబినెట్ రిజల్యూషన్ నంబర్ 166 ఆఫ్ 2026 ప్రకారం, ఫెడరల్ డిక్రీ-లా నంబర్ 14 ఆఫ్ 2023కు సంబంధించిన నిబంధనలను సవరించారు. 

సవరించిన ఆర్టికల్ 40 ప్రకారం.. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విక్రయించే వస్తువులు, సేవలకు కూడా వినియోగదారుల రక్షణ నిబంధనలు వర్తిస్తాయి. ఈ నిబంధనలు సంప్రదాయ విక్రయ మార్గాలకే పరిమితం కావని స్పష్టం చేశారు. ఒక సంస్థకు చెందిన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో మరో సంస్థ లేదా వ్యక్తి వస్తువులు విక్రయించినప్పటికీ, ఆ విక్రయాలకు సంబంధించి ప్లాట్‌ఫామ్ నిర్వహించే సరఫరాదారు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా జరిగే విక్రయాలకూ ఈ నిబంధనలు వర్తిస్తాయి.

వినియోగదారుల హక్కులకు రక్షణ

యూఏఈలో ఇప్పటికే అమల్లో ఉన్న ఫెడరల్ లా నంబర్ 15 ఆఫ్ 2020 ప్రకారం.. వ్యాపార సంస్థలు నాణ్యమైన వస్తువులు, సేవలు అందించాలి. సరైన ధరలను ప్రదర్శించడంతోపాటు ఉత్పత్తుల వివరాలను పారదర్శకంగా వెల్లడించాలి. వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని కూడా భద్రంగా ఉంచాలి. తప్పుడు ప్రకటనలు, నాణ్యత లేని ఉత్పత్తులు, అన్యాయమైన వ్యాపార పద్ధతుల నుంచి వినియోగదారులకు ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది. లోపభూయిష్ట వస్తువులు లేదా నాసిరకం సేవల వల్ల నష్టం జరిగితే పరిహారం కోరే హక్కు కూడా వినియోగదారులకు ఉంటుంది.

 జరిమానాలు

సవరించిన ఆర్టికల్ 41 ప్రకారం.. నిబంధనలను ఉల్లంఘించే సంస్థలకు విధించాల్సిన జరిమానాలు, ఇతర పరిపాలనా చర్యలను త్వరలో ఖరారు చేయనున్నారు. ఆర్థిక జరిమానాలతోపాటు ఉల్లంఘనల వివరాలను ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి ప్రతిపాదన మేరకు క్యాబినెట్ నిర్ణయించనుంది. కొత్త జరిమానాల విధానం అమల్లోకి వచ్చే వరకు, ప్రస్తుత ఉల్లంఘనలు, జరిమానాలకు సంబంధించిన నిబంధనలు కొనసాగుతాయి. అయితే కొత్త తీర్మానానికి విరుద్ధంగా ఉండకూడదు.

 ధరల నియంత్రణ

అసాధారణ పరిస్థితులు, సంక్షోభాల సమయంలో వస్తువులు, సేవల ధరలు అనూహ్యంగా పెరిగితే ప్రభుత్వం తాత్కాలిక చర్యలు తీసుకునే అధికారాన్ని కూడా సవరించిన నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అవసరమైతే నిర్దిష్ట వస్తువులు, సేవలకు ధరలను నిర్ణయించడం, వస్తువుల ఎగుమతులను నిషేధించడం, విక్రయాలకు కోటాలు విధించడం, ప్రత్యామ్నాయ మార్గాల్లో దిగుమతులు లేదా ఉత్పత్తిని ప్రోత్సహించడం వంటి చర్యలు తీసుకోవచ్చు.

ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా విక్రయించడం మాత్రం నిషేధం. అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని వినియోగదారులపై అన్యాయంగా విధించిన భారంగా పరిగణిస్తారు. వాణిజ్య రికార్డులు, ఇన్‌వాయిస్‌లు, అకౌంటింగ్ వివరాల ఆధారంగా అధికంగా వసూలు చేసిన మొత్తాన్ని అధికారులు అంచనా వేయవచ్చు. వినియోగదారులు ఆ మొత్తాన్ని తిరిగి పొందడంతోపాటు నష్టపరిహారం కూడా కోరవచ్చు.

ధరల పెరుగుదల అసాధారణమా కాదా అని నిర్ణయించేందుకు ద్రవ్యోల్బణం, గత ధరలు, పొరుగు దేశాల్లో ధరలు, మారకపు విలువలు, రవాణా, బీమా ఖర్చులు, ఇంధన ధరలు, వినియోగదారుల ఫిర్యాదులు, మార్కెట్‌లో పోటీ పరిస్థితులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ సవరణలతో యూఏఈలో ఈ-కామర్స్ వ్యాపారాలపై పర్యవేక్షణ మరింత పెరగనుంది. ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేసే వినియోగదారులకు అదనపు రక్షణ లభించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com