యూఎన్‌ ఆరోపణలను ఖండించిన బహ్రెయిన్..!!

- November 23, 2026 , by Maagulf
యూఎన్‌ ఆరోపణలను ఖండించిన బహ్రెయిన్..!!

మనామా: ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌ (IRGC)తో సంబంధాలున్న వ్యక్తుల కేసులో న్యాయస్థానాల తీర్పులపై ఐక్యరాజ్యసమితి (UN) చేసిన ఆరోపణలను బహ్రెయిన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ కేసుకు సంబంధించి ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం (OHCHR) వెబ్‌సైట్‌లో పలువురు ప్రత్యేక ప్రతినిధులు విడుదల చేసిన ప్రకటన వాస్తవ పరిస్థితులను సరిగ్గా ప్రతిబింబించడం లేదని బహ్రెయిన్ విదేశాంగ శాఖ పేర్కొంది.

ఈ కేసులో న్యాయపరమైన విచారణలన్నీ దేశ చట్టాలకు అనుగుణంగానే జరిగాయని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. నేరాలకు సంబంధించిన బాధ్యతను మత విశ్వాసాలు లేదా అనుబంధాల ఆధారంగా కాకుండా.. ఆరోపించిన నేరాలు, వాటికి సంబంధించిన ఆధారాల ఆధారంగానే నిర్ణయిస్తామని బహ్రెయిన్ వెల్లడించింది. దేశంలోని ప్రతి ఒక్కరికీ తమ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించే హక్కు ఉందని పునరుద్ఘాటించింది.

మరోవైపు, ఈ ఆరోపణలపై బహ్రెయిన్ తన పూర్తి వివరణను సమర్పించేందుకు నిర్దేశించిన గడువు ముగియకముందే ఐక్యరాజ్యసమితి ప్రకటన విడుదల చేయడంపై విదేశాంగ శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. సంబంధిత బహ్రెయిన్ అధికారులతో తగిన చర్చలు జరపకుండానే ప్రకటన విడుదల చేశారని అభ్యంతరం తెలిపింది. ఐక్యరాజ్యసమితి ప్రత్యేక విధానాల నిర్వహణ మార్గదర్శకాల ప్రకారం, ఆరోపణలపై బహిరంగ ప్రకటన చేసే ముందు సంబంధిత దేశానికి స్పందించే అవకాశం కల్పించాల్సి ఉంటుందని గుర్తుచేసింది. చట్టబద్ధ పాలన, న్యాయవ్యవస్థ స్వతంత్రత, మానవ హక్కుల పరిరక్షణకు బహ్రెయిన్ కట్టుబడి ఉందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com