బహ్రెయిన్ పార్లమెంట్‌లో ఆహార భద్రతపై చర్చ..!!

- November 25, 2026 , by Maagulf
బహ్రెయిన్ పార్లమెంట్‌లో ఆహార భద్రతపై చర్చ..!!

మనామా: ఇరాన్ దాడుల నేపథ్యంలో దేశంలో ఆహారం, తాగునీరు, ఇంధన సరఫరాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని బహ్రెయిన్ పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. కీలక వాణిజ్య మార్గాలకు ఆటంకం ఏర్పడితే ప్రత్యామ్నాయ సరఫరా వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయా అనే అంశంపై సమీక్ష జరపాలని సూచించారు. పార్లమెంట్‌లో కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించారు. 

ఈ సందర్భంగా ఆహార, నీటి భద్రతతో పాటు ఇంధన స్థిరత్వానికి సంబంధించిన అంశాలను చట్టపరమైన ప్రాధాన్యతలుగా తీసుకోవాలని సభ్యులు నిర్ణయించారు. ఎంపీ అహ్మద్ అల్ సల్లూమ్ మాట్లాడుతూ.. గత కొన్ని నెలల పరిణామాలు సముద్ర రవాణాకు ఎదురయ్యే ముప్పు రోజువారీ వస్తువుల సరఫరాపై కూడా ప్రభావం చూపుతుందని స్పష్టం చేశాయన్నారు. ప్రధాన సరఫరా మార్గాలు నిలిచిపోతే ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా? నిత్యావసర వస్తువుల సరఫరా కొనసాగించేందుకు ప్రణాళికలు సరిపోతాయా? అని ప్రశ్నించారు. 

అత్యవసర సరఫరా ఏర్పాట్లను ప్రభుత్వం సమీక్షించాలని, ఇంధన సామర్థ్యం, పర్యావరణ పరిరక్షణపై పురోగతిని పరిశీలించాలని కోరారు. కొత్త చట్టాల అవసరాన్ని కూడా గుర్తించాలన్నారు. మరో ఎంపీ హసన్ ఇబ్రహీం మాట్లాడుతూ.. ఆర్థిక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆహారం, నీరు, ఇంధన భద్రత దేశ భద్రతతో పాటు భవిష్యత్ తరాల కోసం వనరులను కాపాడటంలో కీలకమని పేర్కొన్నారు. ఇరాన్ దాడులు బహ్రెయిన్ ప్రజల్లో దేశ రక్షణ పట్ల సంకల్పాన్ని మరింత బలోపేతం చేశాయని అన్నారు.

ఎంపీ నజీబ్ అల్ కవారి మాట్లాడుతూ.. పార్లమెంట్ పనితీరును ఆమోదించిన చట్టాల సంఖ్యతో కాకుండా ప్రజలకు కలిగే ప్రయోజనాలతో అంచనా వేయాలని పేర్కొన్నారు. ఉద్యోగాలు, మెరుగైన ఆదాయాలు, గృహాలు, ప్రజా సేవల్లో అభివృద్ధి కనిపించాలని అన్నారు. ప్రభుత్వంతో నిర్మాణాత్మకంగా కలిసి పనిచేస్తూనే దాని పనితీరును పర్యవేక్షించే హక్కును పార్లమెంట్ కాపాడుకోవాలని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా కింగ్ ప్రసంగానికి ఇచ్చిన సమాధానంలో ఇరాన్ దాడులను పార్లమెంట్ తీవ్రంగా ఖండించింది. దేశ రక్షణ సంసిద్ధతను కొనసాగించాలని, అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛను పరిరక్షించాలని, ప్రాంతంలో శాశ్వత శాంతి నెలకొనాలని పిలుపునిచ్చింది.

దేశ రక్షణ, భద్రతా దళాల సేవలను కొనియాడిన పార్లమెంట్.. ప్రతి సంవత్సరం జూన్ 1న ‘ప్రతిజ్ఞ, విధేయత దినోత్సవం’గా ప్రభుత్వ సెలవుదినం ప్రకటించడాన్ని స్వాగతించింది. అలాగే 2027 సంవత్సరాన్ని ‘ఇసా బిన్ సల్మాన్ సంవత్సరం’గా ప్రకటించడాన్ని కూడా అభినందించింది. ఎంపీ అబ్దుల్లా అల్ రుమైహీ నేతృత్వంలోని 10 మంది సభ్యుల కమిటీ రూపొందించిన ఈ సమాధానాన్ని రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకు సమర్పించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com