బహ్రెయిన్‌లో పెట్రోల్ నాణ్యతపై వాహనదారుల్లో డౌట్స్..!!

- November 25, 2026 , by Maagulf
బహ్రెయిన్‌లో పెట్రోల్ నాణ్యతపై వాహనదారుల్లో డౌట్స్..!!

మనామా: బహ్రెయిన్‌లో పెట్రోల్ నాణ్యతపై వాహనదారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే బహ్రెయిన్‌లో కొనుగోలు చేస్తున్న పెట్రోల్ త్వరగా అయిపోతోందని, ఎక్కువ డబ్బు చెల్లిస్తున్నప్పటికీ మైలేజీ తగ్గుతోందని పలువురు వాహనదారులు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ అంశాన్ని ఎంపీ మొహమ్మద్ అల్ ఒలైవీ పార్లమెంట్‌లో ప్రస్తావించారు.

బహ్రెయిన్‌లో విక్రయిస్తున్న అన్ని రకాల ఇంధనాల నాణ్యతను స్వతంత్ర ప్రయోగశాలల్లో పరీక్షించాలని ఆయన ప్రతిపాదించారు. ఇప్పటికే ఎనిమిది మందికి పైగా వాహనదారుల నుంచి ఇలాంటి ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. బహ్రెయిన్‌ నుంచి కువైట్‌కు వారానికి రెండు నుంచి నాలుగు సార్లు సరుకులు రవాణా చేసే డ్రైవర్లు ఈ సమస్యను తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. వీరు ఒక్కోసారి 400 నుంచి 450 కిలోమీటర్లు ప్రయాణిస్తుంటారు. బహ్రెయిన్‌లో పెట్రోల్‌ నింపుకున్న వాహనాల్లో కువైట్‌ సరిహద్దుకు చేరుకునేలోపే ఇంధనం అయిపోతోందని, అదే వాహనంలో కువైట్‌లో పెట్రోల్‌ నింపుకుంటే తిరిగి ఇంటికి చేరుకున్న తర్వాత కూడా మరో రెండు నుంచి మూడు రోజుల ప్రయాణానికి సరిపడా ఇంధనం మిగులుతోందని వివరించారు.

ఒకే కారు, ఒకే డ్రైవర్‌, ఒకే దూరం ప్రయాణించినప్పటికీ ఇంధన వినియోగంలో తేడా కనిపిస్తోందని ఎంపీ పేర్కొన్నారు. తనకు కూడా ఇదే అనుభవం ఎదురైందని అల్ ఒలైవీ తెలిపారు. గతంలో ఒకసారి ఫుల్ ట్యాంక్ పెట్రోల్‌తో ఎనిమిది నుంచి పది రోజులు ప్రయాణించేవాడినని, ప్రస్తుతం ఆ ఇంధనం ఆరు నుంచి ఏడు రోజుల్లోనే అయిపోతోందని చెప్పారు. గతంలో ఫుల్ ట్యాంక్‌కు BD12 ఖర్చయ్యేదని, ప్రస్తుతం BD18 నుంచి BD19 వరకు చెల్లించాల్సి వస్తోందని వెల్లడించారు.

బహ్రెయిన్‌లో విక్రయిస్తున్న జయ్యిద్ 91, ముమ్తాజ్ 95 పెట్రోల్‌లో ఆక్టేన్ స్థాయిలు మారాయేమోనని కొందరు వాహనదారులు అనుమానిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ప్రయోగశాల ఆధారాలు వెల్లడికాలేదు. గతంతో పోలిస్తే పెట్రోల్ వాసన కూడా తగ్గిపోయిందని ఎంపీ వ్యాఖ్యానించారు. జయ్యిద్, ముమ్తాజ్, సూపర్ పెట్రోల్‌తో పాటు డీజిల్ నాణ్యతను కూడా ప్రభుత్వ శాఖల ప్రమేయం లేకుండా స్వతంత్ర సంస్థతో పరీక్షించాలని ఆయన ప్రతిపాదించారు. పరీక్షలు నిర్వహించే విషయంలో సంబంధిత మంత్రిత్వ శాఖే నిర్ణయాధికారిగా ఉండకూడదని, నిష్పక్షపాతంగా వ్యవహరించే స్వతంత్ర సంస్థకు బాధ్యతలు అప్పగించాలని అల్ ఒలైవీ పేర్కొన్నారు.

అయితే, పెట్రోల్ నాణ్యతపై వ్యక్తమవుతున్న ఈ అనుమానాలకు సంబంధించి స్వతంత్ర పరీక్షల ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com