బహ్రెయిన్‌లో చెత్త నిర్వహణ చట్టంలో మార్పులు..!!

- November 26, 2026 , by Maagulf
బహ్రెయిన్‌లో చెత్త నిర్వహణ చట్టంలో మార్పులు..!!

మనామా: బహ్రెయిన్‌లో ప్రజా పరిశుభ్రత చట్టానికి మార్పులు తీసుకురావడంపై మున్సిపాలిటీల వ్యవహారాలు, వ్యవసాయ మంత్రిత్వ శాఖ సమీక్ష చేపట్టింది. కొత్త ప్రతిపాదనల ప్రకారం షాపింగ్ మాల్స్, హోటళ్లు తమ వద్ద ఉత్పత్తి అయ్యే చెత్తను వేర్వేరుగా విభజించి, లైసెన్స్ పొందిన సంస్థల ద్వారా సేకరించేలా నిబంధనలు తీసుకురావాలని యోచిస్తోంది. 

అయితే, ఇళ్లలో నివసించే కుటుంబాలకు చెత్తను వేరు చేయడం తప్పనిసరి చేయబోమని, అదనపు రుసుములు కూడా విధించబోమని మంత్రిత్వ శాఖలోని పబ్లిక్ క్లీన్లీనెస్ డైరెక్టర్ ఇంజినీర్ అమ్మర్ యాసర్ అలీ అబ్దుల్ కరీమ్ స్పష్టం చేశారు. నార్తర్న్ మున్సిపల్ కౌన్సిల్‌కు సమర్పించిన ప్రతిపాదనల ప్రకారం వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు చెత్తను ఉత్పత్తి అయ్యే ప్రదేశంలోనే వేర్వేరుగా విభజించడం తప్పనిసరి చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. దీని ద్వారా ల్యాండ్‌ఫిల్స్‌కు చేరే చెత్త పరిమాణాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నిబంధనలను దశలవారీగా అమలు చేయాలని భావిస్తున్నారు. 

2019 నాటి పబ్లిక్ క్లీన్లీనెస్ లా నంబర్ 10ను సమీక్షించడానికి నిర్వహించిన అధ్యయనంలో చెత్త విభజన తప్పనిసరి చేసే నిబంధనలు, రీసైక్లింగ్ లక్ష్యాలు, ప్యాకేజింగ్ వ్యర్థాలపై తయారీదారుల బాధ్యతలు, నిర్మాణ రంగ వ్యర్థాల నిర్వహణకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు లేవని గుర్తించారు. ఈ సందర్భంగా యూఏఈలో వ్యాపార సంస్థల నుంచి చెత్త బరువు ఆధారంగా రుసుములు వసూలు చేస్తున్న విధానాన్ని, సౌదీ అరేబియాలో షాపింగ్ మాల్స్, హోటళ్లు తమ లైసెన్సుల పునరుద్ధరణకు ముందు గుర్తింపు పొందిన చెత్త సేకరణ సంస్థలతో ఒప్పందాలు కలిగి ఉండాలనే నిబంధనను అబ్దుల్ కరీమ్ ఉదహరించారు. అయితే, బహ్రెయిన్‌లో ఈ మార్పులపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. 

కాగా, ఈ ప్రతిపాదనలను తదుపరి పరిశీలన కోసం నార్తర్న్ మున్సిపల్ కౌన్సిల్ ఆర్థిక, న్యాయ కమిటీకి పంపించనున్నారు. కౌన్సిల్ సభ్యుల నుంచి లిఖితపూర్వక అభిప్రాయాలను కూడా సేకరించనున్నట్టు అబ్దుల్ కరీమ్ వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com