ఒమన్‌లో చూడదగ్గ పర్యాటక ప్రాంతాలు..!!
- November 26, 2026
మస్కట్: ఒమన్‌లో వింటర్ పర్యాటకానికి అనువైన సమయం. చల్లని వాతావరణం, పచ్చని లోయలు, పర్వత ప్రాంతాలు, అందమైన సముద్ర తీరాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. నేషనల్ డే సెలవులు, ఆ తర్వాత వారాంతం కలవడంతో పౌరులు, ప్రవాసులకు వరుసగా నాలుగు రోజుల విరామం లభించింది. ఈ సెలవులను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపేందుకు మస్కట్ నుంచి కొన్ని గంటల ప్రయాణ దూరంలోనే అనేక అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. జలపాతాలు, సహజ నీటి కొలనులు, చారిత్రక కోటలు, సంప్రదాయ గ్రామాలు, ఎడారి ప్రాంతాలు, బీచ్‌లు ఇలా అన్ని వయసుల వారికి అనువైన ప్రదేశాలు ఒమన్‌లో అనేకం ఉన్నాయి.
కొన్ని ముఖ్యమైన ప్రాంతాల వివరాలు..
వాడీ బనీ ఖాలిద్ (Wadi Bani Khalid)
మస్కట్ నుంచి ప్రయాణ సమయం: 2.5 నుంచి 3 గంటలు.
అల్ షర్కియా నార్త్ గవర్నరేట్‌లో ఉన్న ఈ ప్రాంతం ఒమన్‌లోని అత్యంత అందమైన సహజ ప్రదేశాల్లో ఒకటి. నీలిరంగు నీటి కొలనులు, ప్రవహించే నీటి కాలువలు, ఖర్జూర చెట్లు, చుట్టూ పర్వతాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. కుటుంబాలతో పాటు పిల్లలు, వృద్ధులు కూడా ప్రధాన కొలనుల వరకు సులభంగా చేరుకోవచ్చు. అయితే కొన్ని కొలనులు లోతుగా ఉంటాయి కాబట్టి పిల్లల విషయంలో జాగ్రత్త అవసరం.
వాడీ షబ్ (Wadi Shab)
మస్కట్ నుంచి ప్రయాణ సమయం: 1.5 నుంచి 2 గంటలు.
సాహసయాత్రలను ఇష్టపడేవారికి ఇది మంచి ఎంపిక. పడవలో చిన్న ప్రయాణం అనంతరం కాలినడకన లోయలోకి వెళ్లాలి. ఎత్తైన సున్నపురాయి కొండలు, పచ్చని తోటలు, మంచినీటి కొలనులు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలు. లోపల గుహలో దాగి ఉన్న జలపాతాన్ని చేరుకోవాలంటే ఈత కొట్టాల్సి ఉంటుంది. చిన్న పిల్లలు, వృద్ధులకు మొత్తం ట్రెక్కింగ్ కష్టంగా ఉండవచ్చు.
వాడీ దైఖా డ్యామ్ (Wadi Dayqah Dam)
మస్కట్ నుంచి ప్రయాణ సమయం: 1 నుంచి 1.5 గంటలు.
ఖురియాత్ ప్రాంతంలోని పర్వతాల మధ్య ఉన్న ఈ డ్యామ్ కుటుంబ విహారానికి అనువైన ప్రదేశం. విశాలమైన జలాశయం, చుట్టూ పర్వతాలు అద్భుతమైన దృశ్యాలను అందిస్తాయి. ఎక్కువగా నడవాల్సిన అవసరం లేకుండా ప్రకృతిని ఆస్వాదించవచ్చు. అయితే జలాశయంలో ఈత కొట్టకూడదు.
బిమ్మా సింక్‌హోల్ (Bimmah Sinkhole)
మస్కట్ నుంచి ప్రయాణ సమయం: 1 నుంచి 1.5 గంటలు.
ఖురియాత్, తివీ మధ్య ఉన్న ఈ సహజ సున్నపురాయి గుంతలో నీలం, ఆకుపచ్చ రంగుల్లో కనిపించే నీరు ప్రత్యేక ఆకర్షణ. చుట్టూ పార్కు, నీటి దగ్గరకు వెళ్లేందుకు మెట్లు ఉన్నాయి. ఈత కొట్టకపోయినా పై నుంచి ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. ఫిన్స్ బీచ్ లేదా వాడీ షబ్ వెళ్లే మార్గంలో దీనిని సందర్శించవచ్చు.
నఖల్ కోట, ఐన్ అల్ థవారా (Nakhal Fort and Ain Al Thawarah)
మస్కట్ నుంచి ప్రయాణ సమయం: 1 నుంచి 1.5 గంటలు.
పశ్చిమ అల్ హజర్ పర్వతాల మధ్య రాతి కొండపై నిర్మించిన నఖల్ కోట ఒమన్ చారిత్రక కట్టడాల్లో ప్రత్యేకమైనది. కోటలోని బురుజులు, సంప్రదాయ గదులు, ఇరుకైన మార్గాలు, ఎత్తైన ప్రాంతాల నుంచి కనిపించే ప్రకృతి దృశ్యాలు ఆకట్టుకుంటాయి. కోటకు సమీపంలో ఉన్న ఐన్ అల్ థవారా సహజ వేడి నీటి బుగ్గను కూడా సందర్శించవచ్చు.
నిజ్వా కోట, సౌక్ (Nizwa Fort and Souq)
మస్కట్ నుంచి ప్రయాణ సమయం: 1.5 నుంచి 2 గంటలు.
17వ శతాబ్దంలో నిర్మించిన నిజ్వా కోట ఒమన్ చరిత్రకు ప్రతీకగా నిలుస్తోంది. భారీ వృత్తాకార బురుజు, సంప్రదాయ నిర్మాణశైలి, చారిత్రక ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. పక్కనే ఉన్న నిజ్వా సౌక్‌లో వెండి ఆభరణాలు, మట్టి పాత్రలు, హస్తకళా వస్తువులు, ఖర్జూరాలు, ఒమానీ హల్వా కొనుగోలు చేయవచ్చు. శుక్రవారం ఉదయం వెళ్లేవారు సంప్రదాయ పశువుల మార్కెట్‌ను కూడా చూడవచ్చు.
బహ్లా కోట, జబ్రీన్ కోట (Bahla Fort and Jabreen Castle)
మస్కట్ నుంచి ప్రయాణ సమయం: 2 నుంచి 2.5 గంటలు.
యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన బహ్లా కోట ఒమన్ చారిత్రక వైభవాన్ని చాటుతుంది. మట్టి నిర్మాణశైలి, విస్తారమైన రక్షణ గోడలు ప్రత్యేక ఆకర్షణలు. సమీపంలోని జబ్రీన్ కోటలో అందమైన పైకప్పులు, చెక్క తలుపులు, అలంకరణలు, ప్రాంగణాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. బహ్లాలో సంప్రదాయ కుండల తయారీని కూడా చూడవచ్చు.
మిస్ఫత్ అల్ అబ్రియీన్ (Misfat Al Abriyeen)
మస్కట్ నుంచి ప్రయాణ సమయం: 2 నుంచి 2.5 గంటలు.
అల్ హమ్రా సమీపంలోని పర్వత ప్రాంతంలో ఉన్న ఈ సంప్రదాయ గ్రామం ఎంతో అందంగా ఉంటుంది. రాతి ఇళ్లు, ఇరుకైన వీధులు, మెట్ల మార్గాలు, పచ్చని వ్యవసాయ తోటలు, పురాతన ఫలాజ్ నీటిపారుదల వ్యవస్థలు ప్రత్యేకత. కొన్ని పాత ఇళ్లను హెరిటేజ్ వసతి గృహాలు, కేఫ్‌లుగా మార్చారు. ఇక్కడ నడిచేందుకు సౌకర్యవంతమైన షూస్ ధరించడం మంచిది.
వకన్ గ్రామం (Wakan Village)
మస్కట్ నుంచి ప్రయాణ సమయం: 1.5 నుంచి 2 గంటలు.
పశ్చిమ అల్ హజర్ పర్వతాల్లో ఎత్తైన ప్రాంతంలో ఉన్న వకన్ గ్రామం ప్రకృతి ప్రేమికులకు మంచి గమ్యస్థానం. వ్యవసాయ మెట్ల తోటలు, పండ్ల చెట్లు, రాతి మార్గాలు, పర్వత దృశ్యాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలు. చివరి దశలో రహదారి ఇరుకుగా, ఏటవాలుగా ఉంటుంది. కాబట్టి ఫోర్ వీల్ డ్రైవ్ వాహనంలో వెళ్లడం మంచిది. చలి నుంచి రక్షణకు వెచ్చని దుస్తులు తీసుకెళ్లాలి.
బిర్కత్ అల్ మౌజ్ (Birkat Al Mouz)
మస్కట్ నుంచి ప్రయాణ సమయం: 1.5 నుంచి 2 గంటలు.
అల్ జబల్ అల్ అఖ్దర్ పర్వత పాదాల వద్ద ఉన్న ఈ గ్రామంలో పాత మట్టి ఇళ్లు, ఖర్జూర తోటలు, చారిత్రక నీటిపారుదల కాలువలు చూడవచ్చు. యునెస్కో గుర్తింపు పొందిన ఒమన్ సంప్రదాయ ఫలాజ్ నీటిపారుదల వ్యవస్థల్లో భాగమైన ఫలాజ్ అల్ ఖత్మీన్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. నిజ్వా పర్యటనతో కలిపి ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు.
అల్ జబల్ అల్ అఖ్దర్ (Al Jabal Al Akhdhar)
మస్కట్ నుంచి ప్రయాణ సమయం: 2 నుంచి 2.5 గంటలు.
సముద్ర మట్టానికి సుమారు 2,000 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వత ప్రాంతం శీతాకాల విహారానికి అనువైనది. లోతైన లోయలు, పచ్చని వ్యవసాయ తోటలు, సంప్రదాయ గ్రామాలు, పర్వత వ్యూ పాయింట్లు ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. అల్ ఐన్, అల్ అఖర్, అల్ షురైజా గ్రామాలను సందర్శించవచ్చు. ఈ ప్రాంతానికి వెళ్లేందుకు ఫోర్ వీల్ డ్రైవ్ వాహనం తప్పనిసరి. రాత్రి వేళ ఉష్ణోగ్రతలు బాగా తగ్గే అవకాశం ఉండటంతో వెచ్చని దుస్తులు తీసుకెళ్లాలి.
జబల్ షమ్స్ (Jabal Shams)
మస్కట్ నుంచి ప్రయాణ సమయం: 3 నుంచి 3.5 గంటలు.
ఒమన్‌లోనే అత్యంత ఎత్తైన పర్వతం ఉన్న ప్రాంతం జబల్ షమ్స్. ఇక్కడి భారీ లోయను ఒమన్ గ్రాండ్ క్యాన్యన్ అని పిలుస్తారు. పర్వత దృశ్యాలు, సూర్యోదయం, నక్షత్రాల వీక్షణకు ఇది అనువైన ప్రాంతం. రాత్రిపూట తీవ్రమైన చలి ఉండవచ్చు. చిన్న పిల్లలతో వెళ్లేవారు ప్రమాదకరమైన కొండ అంచులకు దూరంగా ఉండాలి. కొన్ని మార్గాల్లో ఫోర్ వీల్ డ్రైవ్ వాహనం ఉపయోగించడం మంచిది.
ఫిన్స్ బీచ్ (Fins Beach)
మస్కట్ నుంచి ప్రయాణ సమయం: 1.5 నుంచి 2 గంటలు.
తెల్లటి చిన్న రాళ్లు, స్వచ్ఛమైన సముద్ర జలాలు, అందమైన కొండలతో ఫిన్స్ బీచ్ ప్రత్యేక గుర్తింపు పొందింది. కుటుంబాలతో పిక్నిక్, క్యాంపింగ్, ఫొటోగ్రఫీకి అనువైన ప్రదేశం. వాడీ షబ్, బిమ్మా సింక్‌హోల్ సందర్శనతో కలిపి ఇక్కడికి వెళ్లవచ్చు. కొన్ని ప్రాంతాల్లో సౌకర్యాలు తక్కువగా ఉండటంతో తాగునీరు, ఆహారం వెంట తీసుకెళ్లాలి.
అల్ సిఫా బీచ్ (Al Sifah Beach)
మస్కట్ నుంచి ప్రయాణ సమయం: 1 నుంచి 1.5 గంటలు.
పర్వతాల మధ్య నుంచి సాగే రహదారి చివరన అందమైన సముద్ర తీరం కనిపిస్తుంది. ఇసుక తీరాలు, పర్వత నేపథ్యం, సముద్ర దృశ్యాలు కుటుంబ విహారానికి అనువుగా ఉంటాయి. సమీపంలో హోటళ్లు, రెస్టారెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. క్యాంపింగ్ చేసేవారు అలల ప్రభావానికి దూరంగా, అనుమతించిన ప్రాంతాల్లోనే ఉండాలి.
అల్ సవాది బీచ్ (Al Sawadi Beach)
మస్కట్ నుంచి ప్రయాణ సమయం: 45 నిమిషాల నుంచి 1 గంట.
బర్కా సమీపంలో ఉన్న ఈ బీచ్‌లో సముద్రం మధ్యలో కనిపించే రాతి దీవులు ప్రత్యేక ఆకర్షణ. సముద్ర తీరంలో నడక, ఫొటోగ్రఫీ, పడవ ప్రయాణాలకు అనువైన ప్రాంతం. మస్కట్‌కు దగ్గరగా ఉండటంతో చిన్న పిల్లలతో వెళ్లే కుటుంబాలకు మంచి ఎంపిక.
ఈతి / బందర్ అల్ ఖైరాన్ బీచ్ (Yiti / Bandar Al Khairan)
మస్కట్ నుంచి ప్రయాణ సమయం: 40 నిమిషాల నుంచి 1 గంట.
రాజధానికి దగ్గరగా ఉన్న ఈ ప్రాంతంలో ఇసుక తీరాలు, రాతి కొండలు, అందమైన సముద్ర దృశ్యాలు కనిపిస్తాయి. సాయంత్రం వేళ కుటుంబంతో కలిసి విహరించేందుకు అనువైన ప్రాంతం. అయితే అభివృద్ధి పనుల కారణంగా కొన్ని తీర ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో మార్పులు ఉండవచ్చు. ముందుగా స్థానిక సమాచారాన్ని తెలుసుకోవడం మంచిది.
అల్ షర్కియా సాండ్స్ (Al Sharqiyah Sands)
మస్కట్ నుంచి బిదియాకు ప్రయాణ సమయం: 2.5 నుంచి 3 గంటలు.
బంగారు రంగులో కనిపించే ఇసుక దిబ్బలు, ఎడారి క్యాంపులు ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణ. ఒంటె సవారీ, శాండ్బోర్డింగ్, సంప్రదాయ భోజనం, నక్షత్రాల వీక్షణ, రాత్రి బస వంటి అనుభవాలను పొందవచ్చు. ఎడారిలో డ్రైవింగ్‌పై అనుభవం లేనివారు సొంతంగా వెళ్లకుండా గుర్తింపు పొందిన ఎడారి క్యాంపుల ద్వారా రవాణా ఏర్పాటు చేసుకోవాలి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో చెత్త నిర్వహణ చట్టంలో మార్పులు..!!
- అరుణాచల్ సరిహద్దు పై భారత్-చైనా కీలక చర్చలు..10 రోజుల పాటు సమావేశాలు
- ఖతార్‌లో ఇండియన్ గ్రిల్ హౌస్ రెస్టారెంట్ మూసివేత..!!
- సౌదీలో 97 శాతానికి చేరిన ఆరోగ్య సేవల కవరేజీ..!!
- ఒమన్‌లో చూడదగ్గ పర్యాటక ప్రాంతాలు..!!
- ఏఐ, 3డీ టెక్నాలజీతో రోడ్డు ప్రమాదాల పునర్నిర్మాణం.. దుబాయ్ పోలీసుల వినూత్న ప్రయోగం
- రాస్ అల్ ఖైమా రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి..11 మంది భారతీయుల గుర్తింపు
- సౌదీ అరేబియాలోని జాజాన్ పోర్టుపై హౌతీ మిలిటెంట్ల దాడి.. స్వల్పంగా దెబ్బతిన్న నౌకాశ్రయం
- అజ్మాన్ ప్రభుత్వ ఉద్యోగులకు డిసెంబర్ 2 నుంచి 4 వరకు ఈద్ అల్ ఎతిహాద్ సెలవులు
- దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షో ప్రారంభించిన షేక్ మన్సూర్ బిన్ మహమ్మద్







