కామారెడ్డి జిల్లాలో నేరాల నియంత్రణ పై తెలంగాణ డీజీపీ సమీక్ష..
- November 28, 2026
కామారెడ్డి: తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) శ్రీ సీవీ ఆనంద్ కొంత విరామం తర్వాత తిరిగి జిల్లాల పర్యటనలను ప్రారంభించారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాను సందర్శించి, జిల్లా పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు, సీనియర్ అధికారులు, జోనల్ ఐజీ, డీఐజీలతో పాటు నార్కోటిక్స్ ఈగల్, సైబర్ బ్యూరో, సీఐడీ, టీఎస్‌పార్క్ విభాగాలకు చెందిన అధికారులతో ఆయన సమావేశమయ్యారు. జిల్లాలో నేరాల పరిస్థితి, పోలీసుల పనితీరు, మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాలు, గ్యాంగుల కార్యకలాపాల పై సమగ్రంగా సమీక్షించారు.
ఎన్‌సీఎల్ ర్యాంకింగ్, పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల దర్యాప్తు, కేసుల్లో నిందితులకు శిక్షలు పడుతున్న తీరు వంటి అంశాలను పరిశీలించారు. విధుల్లో లోపాలను గుర్తించిన డీజీపీ, ఆశించిన స్థాయిలో పనితీరు కనబరచని ఎస్‌హెచ్‌ఓలు, ఎస్‌డీపీఓలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు మెరుగుపరచుకోవడానికి నిర్దిష్టమైన సూచనలు, దిద్దుబాటు చర్యలను వివరించారు.
ఆస్తి నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
జిల్లాలో మొత్తం నేరాల పరిస్థితి నియంత్రణలో ఉన్నప్పటికీ, ఆస్తి సంబంధిత నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సూచించారు. పగలు, రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను బలోపేతం చేయాలని, అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాల కదలికలపై నిఘా పెంచాలని, కేసులను వేగంగా ఛేదించాలని ఆదేశించారు.
ఆపరేషన్ కవచ్ ద్వారా జిల్లా పోలీసులు సాధించిన ఫలితాలను ఆయన అభినందించారు.
ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ చేయడంలో భాగంగా సంఘటనా స్థలంలోనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే విధానాన్ని ప్రోత్సహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. యువతలో సైబర్ నేరాలపై అవగాహన పెంచడంతో పాటు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై కఠినంగా వ్యవహరించాలని, రౌడీషీటర్ల కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు.
జిల్లా అధికారులు ప్రతిపాదించిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, మహిళా పోలీస్ స్టేషన్ల ఏర్పాటుతో పాటు ఇతర అవసరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని డీజీపీ హామీ ఇచ్చారు.
నిజామాబాద్‌తో ప్రత్యేక అనుబంధం
1996 నుంచి 1999 వరకు సుమారు మూడున్నరేళ్ల పాటు నిజామాబాద్ జిల్లా ఎస్పీగా పనిచేసిన అనుభవాన్ని డీజీపీ గుర్తుచేసుకున్నారు. అప్పట్లో నక్సల్స్ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు ఎంతో కృషి చేశారని, అనేక సవాళ్లు, ప్రమాదాలను ఎదుర్కొన్నారని తెలిపారు.
ప్రస్తుతం ఆ ప్రాంతం ప్రశాంతంగా ఉండటం ఆనందంగా ఉందని, గతంలో శాంతి స్థాపన కోసం పోలీసులు చేసిన కృషి తనకు ఇప్పటికీ గుర్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు.
అనంతరం మీడియా ప్రతినిధులతో, మాదకద్రవ్యాల వ్యసనం నుంచి బయటపడి పునరావాసం పొందుతున్న వారితో డీజీపీ మాట్లాడారు. కొత్తగా నిర్మించిన భారీ కలెక్టరేట్ భవనాన్ని సందర్శించి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌తో కలిసి టీ సేవించారు.
సాయంత్రం నిజామాబాద్‌కు చేరుకున్న ఆయన, పోలీస్ కమిషనర్ నివాసంలో ఏర్పాటు చేసిన విందు సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్‌తో పాటు పొరుగు జిల్లాల పోలీసు అధికారులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- కామారెడ్డి జిల్లాలో నేరాల నియంత్రణ పై తెలంగాణ డీజీపీ సమీక్ష..
- కువైట్‌లో మాదకద్రవ్యాల కేసులో రాజకుటుంబ సభ్యుడి అరెస్ట్..
- దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షో 2026ను సందర్శించిన షేక్ మహమ్మద్
- బహ్రెయిన్‌లో సిత్రా మురుగునీటి శుద్ధి కేంద్రం విస్తరణ..!!
- కువైట్‌లో మాదకద్రవ్యాలతో రూలింగ్ ఫ్యామిలీ మెంబర్ అరెస్ట్..!!
- ఖతార్–కెనడా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త దిశ..!!
- సౌదీపై దాడులను ఖండించిన పలు దేశాలు..!!
- యూఏఈ జాతీయ దినోత్సవం.. వాహనదారులకు శుభవార్త..!!
- విమానంలో సాంకేతిక లోపం.. మస్కట్‌కు మళ్లింపు..!!
- ఒమన్‌లో ‘గల్ఫ్ ఆట’ ఆవిర్భావం..ప్రవాస భారతీయుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం







