సముద్ర మార్గాల భద్రత దేశాల ఆర్థిక శ్రేయస్సుకు కీలకం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

- November 28, 2026 , by Maagulf
సముద్ర మార్గాల భద్రత దేశాల ఆర్థిక శ్రేయస్సుకు కీలకం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఎజిమల (కేరళ): నేటి పరస్పర అనుసంధానిత ప్రపంచంలో సముద్ర రంగానికి ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. కేరళలోని ఎజిమలలో ఉన్న ఇండియన్ నేవల్ అకాడమీలో నిర్వహించిన 2026 శరదృతువు (ఆటమ్ టర్మ్) పాసింగ్ అవుట్ పరేడ్‌ను రాష్ట్రపతి సమీక్షించారు.

ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న నావికాదళ అధికారులను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. అంతర్జాతీయ సముద్ర మార్గాల భద్రత ఆయా దేశాల ఆర్థిక సంక్షేమంతో పాటు ప్రజల రోజువారీ జీవితాలతో కూడా ముడిపడి ఉందని ఆమె పేర్కొన్నారు.

సముద్ర మార్గాల రక్షణ కేవలం నావికాదళానికి సంబంధించిన బాధ్యత మాత్రమే కాదని, దేశాల భద్రత, ఆర్థికాభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని వివరించారు.

సముద్రంలో విధులు నిర్వహించే సమయంలో తీర ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవితాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులకు సూచించారు. సముద్రంలో వారు అందించే సేవలు భూమిపై నివసించే ప్రజల భద్రత, శ్రేయస్సు, ఆర్థిక ప్రగతికి ప్రత్యక్షంగా దోహదపడతాయని గుర్తుంచుకోవాలని అన్నారు.

దేశ సముద్ర సరిహద్దుల రక్షణ, అంతర్జాతీయ సముద్ర వాణిజ్య మార్గాల భద్రత, దేశ ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణలో భారత నావికాదళం కీలక పాత్ర పోషిస్తోందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.

పాసింగ్ అవుట్ పరేడ్‌తో శిక్షణను పూర్తి చేసుకున్న నూతన నావికాదళ అధికారులు దేశ సేవలో తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com