500 ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిటన్ విద్యాసంస్థ బెడ్‌ఫోర్డ్ స్కూల్ అమరావతికి రాక

- November 29, 2026 , by Maagulf
500 ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిటన్ విద్యాసంస్థ బెడ్‌ఫోర్డ్ స్కూల్ అమరావతికి రాక

అమరావతి: ప్రపంచస్థాయి విద్యా కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దాలన్న లక్ష్యంలో మరో కీలక అడుగు పడనుంది.  హైదరాబాద్ ఎడ్యుకేషనల్ అకాడమీ (HEA), మా లక్ష్మి గ్రూప్ భాగస్వామ్యంతో బ్రిటన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక బెడ్‌ఫోర్డ్ స్కూలు దేశంలో తన రెండో క్యాంపస్‌ను అమరావతిలో ఏర్పాటు చేయనుంది.

“దాదాపు ఐదు శతాబ్దాల విద్యా వారసత్వం కలిగిన సంస్థను అమరావతికి తీసుకురావడం కేవలం ఒక పాఠశాలను ఏర్పాటు చేయడం మాత్రమే కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ తరాలపై, మన రాజధాని నగరం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంపై పెట్టుబడి పెట్టడం” అని హైదరాబాద్ ఎడ్యుకేషనల్ అకాడమీ, మా లక్ష్మి గ్రూప్ చైర్మన్  హరీష్ చంద్ర ప్రసాద్ యార్లగడ్డ అన్నారు.

ఈ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఏర్పాటుకు ఆదివారం, 29 నవంబర్ 2026న భూమిపూజ నిర్వహించనున్నారు. ప్రపంచస్థాయి విద్యను అమరావతికి తీసుకురావాలన్న సంకల్పానికి ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టనుంది.

 2028 ఏప్రిల్ లో తరగతులు ప్రారంభించనున్న బెడ్‌ఫోర్డ్ స్కూల్ అమరావతి, 3 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులకు విద్య అందించనుంది. విద్యా ప్రమాణాలతో పాటు నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత, క్రీడలు, వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యతనిస్తూ సమగ్ర విద్యను అందించనుంది.

అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడం, మన విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యను స్థానికంగానే అందుబాటులోకి తీసుకురావడం మలక్ష్మి గ్రూప్ లక్ష్యమని యార్లగడ్డ తెలిపారు.

అమరావతిని అంతర్జాతీయ నగరంగా, విద్య, ఆవిష్కరణలు, పెట్టుబడులకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి, అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయమని హరీష్  పేర్కోన్నారు.

ఎనిమిది ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఈ క్యాంపస్ విద్యార్థులను కేవలం విద్యావంతులుగా మాత్రమే కాకుండా, బాధ్యతాయుతమైన, మానవతా విలువలు కలిగిన, ప్రపంచ దృక్పథం ఉన్న పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపుదిద్దుకోనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com