దుబాయ్‌లో దాదాపు Dh1 మిలియన్ దొంగతనం..దోపిడీ జరిగిందంటూ పోలీసులకు తప్పుడు ఫిర్యాదు!
- November 29, 2026
కంపెనీ సొమ్మును ఇద్దరు సహచరులతో కలిసి కాజేసిన ఉద్యోగి.. ముగ్గురికి ఏడాది జైలు, దేశ బహిష్కరణ
దుబాయ్: దాదాపు ఒక మిలియన్ దిర్హామ్‌ల (Dh958,407) కంపెనీ సొమ్మును ఇద్దరు సహచరులతో కలిసి కాజేసి, తన పై అనుమానం రాకుండా దోపిడీ జరిగిందంటూ పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసిన ఉద్యోగికి దుబాయ్ క్రిమినల్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. శిక్ష పూర్తయిన అనంతరం ముగ్గురినీ దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది.
వివరాల్లోకి వెళితే.. దుబాయ్‌లోని ఓ ఫుడ్ ట్రేడింగ్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగికి సంస్థ Dh200,000 విలువైన నగదు బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో Dh958,407 నగదు అదృశ్యమైంది. దీంతో తన వద్ద ఉన్న డబ్బును గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా దోచుకెళ్లారని సదరు ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అయితే, ఈ ఫిర్యాదుపై పోలీసులు చేపట్టిన దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మరో ఇద్దరితో కలిసి ఉద్యోగి ముందస్తు ప్రణాళిక ప్రకారం కంపెనీ సొమ్మును కాజేసినట్లు తేలింది. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు దోపిడీ జరిగినట్లు నాటకమాడి పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది.
ఈ కేసులో ఉద్యోగితో పాటు మరో ఇద్దరు సహచరులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కంపెనీ తరఫున అప్పగించిన నగదును ఉద్యోగి దుర్వినియోగం చేయగా, మిగిలిన ఇద్దరూ కుట్రలో భాగస్వాములై నేరానికి సహకరించినట్లు క్రిమినల్ కోర్టు నిర్ధారించింది. ఈ కేసులో గుర్తుతెలియని నాలుగో వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు కూడా రికార్డుల్లో పేర్కొన్నారు.
దీంతో ముగ్గురికీ ఏడాది జైలు శిక్ష విధించడంతో పాటు, ఒక్కొక్కరినీ దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది. అంతేకాకుండా కాజేసిన మొత్తం Dh958,407ను జరిమానాగా చెల్లించాలని తీర్పునిచ్చింది.
మరోవైపు, తమకు జరిగిన ఆర్థిక నష్టాన్ని తిరిగి పొందేందుకు బాధిత కంపెనీ దుబాయ్ సివిల్ కోర్టును ఆశ్రయించింది. కాజేసిన మొత్తం Dh958,407 తిరిగి చెల్లించడంతో పాటు అదనంగా Dh200,000 పరిహారం ఇవ్వాలని కోరింది. ఇందుకు సంబంధించిన క్రిమినల్ కోర్టు తీర్పు, ప్రాసిక్యూషన్ పత్రాలు, నేర నిర్ధారణ తుది తీర్పుగా మారినట్లు ధ్రువీకరించే పత్రాలను సమర్పించింది.
క్రిమినల్ కోర్టు ఇప్పటికే నిందితుల బాధ్యతను నిర్ధారించిన నేపథ్యంలో, కంపెనీకి జరిగిన ఆర్థిక నష్టాన్ని సివిల్ కోర్టు పరిశీలించింది. నగదు అందుబాటులో లేకపోవడం వల్ల పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని కోల్పోవడంతో పాటు, ఫిర్యాదు మరియు న్యాయపరమైన పోరాటానికి ఖర్చులు చేయాల్సి వచ్చిందని గుర్తించింది.
ఈ నేపథ్యంలో కంపెనీకి అదనంగా Dh30,000 పరిహారం చెల్లించాలని సివిల్ కోర్టు ఆదేశించింది. దీంతో అసలు సొమ్ము, పరిహారం కలిపి మొత్తం Dh988,407 కంపెనీకి చెల్లించాల్సి ఉంటుంది.
అయితే, సంస్థకు జరిగిన నైతిక లేదా ప్రతిష్ఠాపరమైన నష్టానికి పరిహారం ఇవ్వాలన్న విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. వ్యాపార ప్రతిష్ఠ దెబ్బతినడం లేదా వాణిజ్య కార్యకలాపాలు తగ్గిపోవడం వంటి నష్టాలను ఆధారాలతో నిరూపించినప్పుడే అలాంటి పరిహారం కోరవచ్చని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, సివిల్ కోర్టు తీర్పు తుది దశకు చేరిన తేదీ నుంచి కంపెనీకి పూర్తి మొత్తాన్ని చెల్లించే వరకు ఏటా 5 శాతం వడ్డీతో పాటు కోర్టు ఫీజులు, న్యాయపరమైన ఖర్చులను కూడా ముగ్గురు నిందితులు భరించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- అమరావతిలో బెడ్ఫోర్డ్ స్కూల్ రెండో అంతర్జాతీయ క్యాంపస్
- కువైట్‌లో ప్రవాసులకు బ్యాంకు రుణాలపై కొత్త ఆంక్షలు..!!
- అరేబియా ఎడారిలో ప్రాచీన మానవుల నివాస రహస్యాలు..!!
- దుబాయ్‌లో అపార్ట్మెంట్ CCTV ఫుటేజీని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయవచ్చా?
- ఆరోగ్య రంగంలో ఏఐ.. ఖతార్ లో కీలక కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..ప్రజలకు సివిల్ డిఫెన్స్ హెచ్చరికలు..!!
- పెంపుడు జంతువులను వదిలేస్తే BD5000 జరిమానా..!!
- నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌ను సమీక్షించిన తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్..
- దోహాలో బిర్లా పబ్లిక్ స్కూల్ 23వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు..
- షార్జాలో ట్రక్కు డ్రైవర్లకు భారీ జరిమానా హెచ్చరిక!







