"కథా శీర్షిక "అసంపూర్ణ జీవితం"

- September 04, 2016 , by Maagulf

అది దుబాయి ఇంటర్ నేషనల్ విమానాశ్రయం,హైదరాబాద్ వెళ్ళే విమానం టేకాఫ్ కావడానికి మెల్లిగా కదులుతున్నది.  

అందరు "సీట్ బెల్ట్" పెట్టుకోవల్సిందిగా ఎయిర్ హోస్టెస్ సైగలు చేస్తూ హిందీలో, ఇంగ్లిష్ లో మృదువుగా చెబుతున్నది.  
పూర్తిగా వెనుకకు కాకుండా చివరి రెండు వరుసలకు ముందు విండో ప్రక్క సీట్ లో కుర్చుని బయటకు చూస్తున్నాడు 'నారాయణ గౌడ్'.
తన సుదీర్ఘ జీవన ప్రయాణంలో చివరకు తన గూడు తను చేరుకుంటున్నందుకు గట్టిగా నిట్టూర్పు విడిచి కళ్ళు మూసుకున్నాడు. 
మనసు ఒక ముప్పయి అయిదు సంవత్సరాల వెనక్కి వెళ్ళింది. 
కరీంనగర్ జిల్లాలోని ఓ పల్లె అంతా ఒక వేయి కుటుంబాలు ఉంటాయేమో తనకు తోడబుట్టిన ఇద్దరు చెల్లెళ్ళు. 
ఊహ తెలిసినప్పటి నుండి తాత తర్వాత నాన్న, తన గౌడ సంగం లోని పంచుకోగా.. వచ్చిన తమ పాలు(వంతు) ఈత చెట్లు తాటి చెట్లు కళ్ళు గీసుకొని అమ్ముకోవడం తనేమో వ్యవసాయ రైతులకు వాడుక బుంగలు (కళ్ళు ముంతలు)  సాయంత్రాలు ఇచ్చి రావడం. 
పొద్దున్న కాలీ కుండలు ఇంటికి తెచ్చి తండ్రికి సాయం చేస్తూ, తర్వాత బడికి వెళ్ళడం ఇలా నారాయణ బాల్యం నడుస్తుండగా,
ఒకరోజు తండ్రి తాటి చెట్టు పైనుండి పడి చనిపోవడం తరగని దుఃఖాన్ని మిగిల్చింది. 
చదువు ఆరవ తరగతి లోనే ఆగి పోయింది,కొద్ది రోజులు తన కుల వృత్తినే చేస్తూ కుటుంబ భారం మోసాడు. 
కానీ పెరిగిన నిత్యావసర ధరలు, ఇంటిమీద పెళ్లీడుకు వస్తున్న చెల్లెళ్ళు ,ఎప్పుడో కూలి పోవడానికి తయారుగా ఉన్న తన తాత నుండి సంక్రమించిన పాత మట్టి గోడల గూన ఇల్లు, ఇవన్ని నారాయణ గుండెను తొలుస్తున్న విషయాలు. 
"ఏం చేయాలో పాలు పోలేదు" 
అప్పుడే ఒక్కసారి తానూ మండలో కళ్ళు అమ్ముకుంటూ ఉండగా,
కళ్ళు తాగడానికి వచ్చిన గంగారెడ్డి హకీమ్ బాయి గల్ఫ్ ఏజెంట్ లతో పరిచయం అయింది. 
తర్వాత వాళ్ళు వచ్చిన ప్రతీ సారీ వారికి మంచి ఒక్క చెట్టు కళ్ళు పోయడం చేసి వారితో ప్రేమగా మాట్లాడి తన ఇబ్బందులు చెప్పుకుంటూ వారికి దగ్గరయ్యాడు. 
వారిని బతిమి లాడుకొని,తన వద్ద నీళ్ళు లేక బీడు ఉన్న తన నాన్న సంపాదించి ఇచ్చిన అర ఎకరం పొలం అమ్మేసాడు. 
అలా తన ఇరవై ఏళ్ళ వయసులో గల్ఫ్ చేరుకున్నాడు.
మొదట మూడేళ్ళు చాలి చాలని జీతంతో ఎర్రని ఎండలో ఒక పూట తింటూ ఒక పూట ఎండుతూ ఎన్నో కష్టాలు ఓర్చుకొన్నాడు.  
ఒకసారి బలదీయ లో క్లీనర్లని తీసుకుంటున్నారని తెలిసి బలదీయ ఆఫీసు ముందు లైన్లు కట్టి కొన్ని రోజులు తిరగ్గా తిరగ్గా పనిలో పెట్టుకున్నారు. 
రోడ్లెంట కాగితాలు ఏరి వేయడం ఎనిమిది గంటలు డ్యూటీ. 
మిగతా సమయంలో నాలుగు గంటలు పెద్ద పెద్ద ఉద్యోగస్తుల వాళ్ళింట్లో గిన్నెలు మరియు ఇల్లు కడగడానికి వెళ్ళేవాడు. 
మొత్తం కలిపి నెలకు ఇండియా పాతిక వేలు పైనే సంపాదించే వాడు.  
మొదటిసారి పెద్దచెల్లెలు పెళ్ళికి డబ్బులు జమ అయ్యేవరకు ఆరు సంవత్సరాల వరకు తన ఊరు వెళ్ళలేదు. 
పెద్ద చెల్లెలు పెళ్లి చేసాక ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వెళ్ళడం చిన్న చెల్లి పెళ్లి చేయడం.
మరోసారి తానూ పెళ్లి చేసుకోవడం ఇంకోసారి తనకంటూ స్లాబ్ ఇల్లు కట్టుకోవడం.
"తనకూ ఒక కొడుకు కూతురు జన్మించడం"  
తాను ఇంటివద్ద లేక పిల్లలని సరియయిన స్కూల్ లో వేసి వారి ఆలనా పాలనా చూసే ఇంటి పెద్దగా తాను లేని లోటుతో, పది దాటకుండానే అటకెక్కిన వారి చదువులు.
తర్వాత వారికి పెళ్ళిళ్ళు చేయడం వారికి పిల్లలు మనుమలు మనమరాళ్ళు వారి మ్రొక్కులు ఖర్చులు,ఇలా చూస్తుండగానే సంవత్సరాలు గడిచి పోయి ముప్పయ్ అయిదేల్లాయ్యాయి. 
ఎందరో తనతో పర దేశం వచ్చిన వాళ్ళలో కొందరు అనారోగ్యంతో పర లోకం వెళ్ళిపోగా,
అందులో ముగ్గురు నలుగురు ఇంటికి దూరమైన భావనలోనో లేదా ఎంతకీ తీరని అప్పులతోనో బలవంతంగా అసువులు తీసుకుంటే, 
వారి "నిర్జీవ శరీరాలను" స్నేహితులందరూ కలిసి చందాలు వేసుకొని ఇంటికి పంపడం జరిగింది. 
ఇలా ఎన్నో బతుకు కథలను చూస్తూ కన్నీటి సముద్రాలను ఈదుతూ, ఇంకా అక్కడికి వెళ్లి ఏమి చెయ్యాలి తన జీవితం ఎలాగు నష్టపోయాను.
అని ఇకనైనా తనతో  పిల్లలకు లోటు రాకుండా చూద్దామని కాళ్ళు చేతులు సహకరించినన్ని రోజులు పని చేసి డబ్బులు సంపాదించుదాం అనుకుంటూ, గుండె రాయి చేసుకొని తానూ తన యవ్వనం అంతా గల్ఫ్ లోనే కరిగిపోయింది. 
కానీ ఇక్కడ అక్కడ తప్పని ప్రైవేట్ సంస్థల ఆధిపత్యం.
తక్కువ వేతనానికి వచ్చే నేపాల్,బంగ్లాదేశ్,శ్రీలంక లాంటి దేశాల నుండి పని మనుషుల తెచ్చుకోవడం,ఎక్కువ వేతనం తీసుకునే అందరి ఉద్యోగాలు తీసివేసి తమ తమ దేశాలకు పంపిస్తున్నారు గల్ఫ్ దేశాల నుండి.
కొత్త కాంట్రాక్టులు, తక్కువ జీతాలకు పని చేయించే 'మాన్ పవర్' కంపనీలకు అప్పగిస్తున్నారు. 
సరే లే ఇలా నన్న తనవారందరితో కలిసుండే అవకాశం కల్పించాడు దేవుడు అని మనసులో సంతోషించాడు నారాయణ.  
ఇక తాను సంపాదించిన మూడెకరాల తోటలో తనకు వచ్చిన సర్వీసు డబ్బులతో మామిడి తోట పెట్టుకొని, ఒక మంచి బావి తవ్వించి, తోటకు నీళ్ళు పెడుతూ, నరాల బలహీనతతో మంచం పట్టిన భార్యను హైదరాబాద్ లో  మంచి హాస్పిటల్లో చూపించి జబ్బు నయం చేయించాలి శేష జీవితం మనశ్శాంతిగాగడుపుతూ మనుమలు మనుమరాళ్ళ పెళ్ళిళ్ళు గణంగా చెయ్యాలి అనుకుంటూ ఆలోచనల్లో ఉన్నాడు నారాయణ.  
అంతలోనే హైదరాబాద్ విమానాశ్రయంలో విమానం ల్యాండింగ్ అయింది అందరిలానే తానూ తన పెట్టె తీసుకొని లోనకు వెళ్లి కస్టమ్స్ చెకింగ్ పూర్తి చేసుకుని,
బయటకు వచ్చి, కొడుకు అల్లుడు వస్తామన్నారు వారికి కాల్ చెయ్యాలి అనుకుంటున్నాడు. 
అనుకుంటూ ఉండగానే 
"నాన మంచిగున్నవానే" అంటూ కొడుకు. 
"మామయ్య మంచిగా వచ్చినవా" అంటూ అల్లుడు. 
చెరో ప్రక్క చేరి అలుమ్కున్నారు (ఆలింగనం) చేసుకున్నారు. 
"హా అంతా మంచిదే బిడ్డ" అని కొడుకుతో,
" మంచిగానే అచ్చిన బాపు " అని అల్లునితో, 
 అని కండ్ల నీళ్ళు తీసుకున్నాడు నారాయణ. 
తర్వాత అందరు కలిసి కారు పార్కింగ్ కి వెళ్లి, వాళ్ళు కిరాయి కి తెచ్చిన తమ ఊరు టాక్సీ వద్దకు వెళ్ళారు. 
టాక్షీ డ్రైవర్ పిల్లగాడు బాస్కర్ని ఉద్దేశించి "మంచిగున్నవ బిడ్డ" అన్నాడు నారాయణ.
"మంచిగున్ననే బాపు" అని బాస్కర్ అన్నాడు. 
అందరు టాక్సీలో సామాను పెట్టి కూర్చున్నారు. 
టాక్సీ మెల్లిగా బయలు దేరింది. 
ఉదయం పూట ఉద్యోగాలకు వెళ్ళే వారితో రోడ్లన్నీ చాలా బిజీగా చాలా ఉన్నాయి.  
రాత్రికి నిద్ర లేదేమో అల్లుడు మరియు కొడుకు వెనక సీట్లో మాంచి నిద్ర తీస్తున్నారు.
ట్రాఫిక్ ని తట్టుకొని సిటీ బయటకు వచ్చే సరికి ఊపిరి తీసుకున్నట్లై భాస్కర్ బండి కొంచెం వేగం పెంచాడు. 
సివిల్ డిఫెన్సు దాటి షామీర్ పేట్ వైపుగా దూసుకెల్తుంది.
"ఎక్కడన్నా ఇడ్లీ బండి ఉంటే ఆపు నానా నాస్ట చేసి షుగర్ గోలీలు ఏసుకోవాలే" 
అన్నాడు డ్రైవర్ భాస్కర్ తో నారాయణ. 
"గట్లనే బాపు"  అన్నాడు బాస్కర్. 
అప్పుడే వేగంగా ఏదో స్టీల్ లోడుతో
"జుయ్యి మంటూ" ఒక ట్రక్కు దూసుకు వస్తుంది. 
"మెల్లగా నానా పక్కకువట్టు బండి లగాంచి  వత్తుంది ఎట్లనో" అని నారాయణ.
"ఏంగాదే బాపు బుగులు వడకు" అంటూ భాస్కర్.   
అనే సరికే, 
ధడిల్... ధడిల్ మంటూ..పెద్ద శబ్ధం.
సాయంత్రం అన్ని తెలుగు ఛానళ్లలలో.. కరీంనగర్ వైపు వెళ్తున్న కారుని,వేగంగా వస్తున్న లారీ గుద్దేసింది. 
కారు డ్రైవర్ మరియు దుబాయి నుండి వస్తున్న యాబై అయిదు సంవత్సరాల నారాయణ అనే వ్యక్తి అతని కొడుకు అక్కడికక్కడే మరణించారు. 
కాళ్ళు చేతులు విరిగిన నారాయణ అల్లుడు గాంధీ హాస్పిటల్లో చికిత్చ్స పొందుతున్నాడు.  
సమాప్తం. 

--జయ రెడ్డి బోడ(అబుదాబి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com