తెలుగు రాష్ట్రాల్లో కరువు తీరా వానలు

- September 14, 2016 , by Maagulf
తెలుగు రాష్ట్రాల్లో కరువు తీరా వానలు

తెలుగు రాష్ట్రాల్లో కరువు తీరావానలు కరుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో తెలంగాణ, కోస్తాంధ్ర తడిసి ముద్దవుతున్నాయి. తెలంగాణ పది జిల్లాల్లోనూ ముసురు పట్టింది. నల్గొండ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. మెదక్ జిల్లాలోని నారాయణ్ ఖేడ్, తోగుట, జహీరాబాద్ మండలాల్లో పలు చెరువులు అలుగు పోస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు మిగితా జిల్లాలోనూ ఉదయం నుంచి జల్లులు పడుతూనే ఉన్నాయి. వరద నీటితో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి. రహదారులన్నీ గుంతలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షంతో గణేశ్ నిమజ్జనాలకు ఆటంకం కల్గుతోంది. 

ఆంధ్రప్రదేశ్‌లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాలో కుండపోతగా వర్షం కురిసింది. పల్నాడు ప్రాంతంలో వరద బీభత్సం స్పష్టించింది. మాచర్ల డివిజన్‌లో చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. వాగులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పులిచింతల ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 24 గంటల్లోనే డ్యాంలోకి ఏకంగా 5 టీఎంసీల నీరు చేరింది. ప్రస్తుతం పులిచింతల నీటి మట్టం 22 టీఎంసీలకు చేరింది. డ్యాంలో 30 టీఎంసీలు నిల్వ చేయాలని నిర్ణయించిన అధికారులు... నల్గొండ జిల్లాలో 4, గుంటూరు జిల్లాలోని 5 ముంపు గ్రామాలు ఖాళీ చేయించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారులు అంచనా వేస్తున్నారు. కృష్ణా డెల్టా ఆయకట్టుకు  కొన్ని నీళ్లు దిగువకు విడుదల చేస్తున్నారు. జెన్‌కో అధికారులు విద్యుత్ ఉత్పత్తికి సన్నాహాలు చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు ద్వారా 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉండగా, 30 మెగావాట్ల ఉత్పత్తికి పనులు పూర్తయ్యాయి.  
ఉభయ గోదావరి జిల్లాలో మధ్యాహ్నాం భారీ వర్షం కురిసింది. ఉదయం ఎండ తీవ్రత అధికంగా ఉండగా..మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కోనసీమలోని ముమ్మిడివరం, పి గన్నవరం, రాజోలు తదితర ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. 
రాజమండ్రిలో గంటపాటు కుండపోతగా వర్షం కురవడంతో జనజీవనం స్థంభించింది. వరద నీరు చేరడంతో లోతటు ప్రాంతాలన్నీ జలమలమయ్యాయి. కంబాల చెరువు వద్ద హైటెక్ బస్టాండ్ పూర్తిగా జలదిగ్భందంలో చిక్కుకుంది. పంటలు ఎండిపోతున్న సమయంలో కురిసిన వర్షం పంటలకు ఎంతో మేలు చేస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
అల్పపీడన ప్రభావంతో రాగల రెండు, మూడు రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర కోస్తాంధ్ర, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని చెప్పారు. కోస్తాంధ్రలో రెండ్రోజుల పాటు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. తెలంగాణలోనూ రెండ్రోజల వరకు .. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని వివరించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com