'లతా మంగేష్కర్' కు జన్మదిన శుభాకాంక్షలు
- September 27, 2016
లతా మంగేష్కర్... పాటల ప్రవాహానికి ప్రతీక. వినసొంపైన వేల అద్భుత పాటలకు కేరాఫ్. మధురమైన కంఠంతో ఏడున్నర దశాబ్దాల పాటు నిర్విరామంగా పాటలను ఆలపిస్తూ రికార్డులు సృష్టించిన అగ్ర గాయని. అత్యద్భుతమైన గానమధుర్యంతో ఆబాలగోపాలన్ని అలరించిన లతా మంగేష్కర్ పుట్టిన రోజు నేడు (బుధవారం).
- 1929లో జన్మించిన లతకు సంగీతంలో గురువు తండ్రి దీనానాథ్ మంగేష్కరే. 1942లో తండ్రి మరణించడంతో కుటుంబాన్ని పోషించడం కోసం నటిగా సినీ జీవితాన్ని ప్రారంభించారు. మొదటి సినిమా 'పహ్లా మంగళ గౌర్'. ఈ మరాఠి చిత్రంలో హీరోయిన్‌కి చెల్లిగా నటించారు.
అంతేకాదు ఇందులో రెండు పాటల్ని కూడా పాడారు. తర్వాత 'చిముక్లా సుసార్', 'గజేభావు', 'జీవన్ యాత్ర', 'మందిర్' చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. 1947లో వచ్చిన 'మజ్బూర్' చిత్రంతో పూర్తి స్థాయి నేపథ్యగాయనిగా మారారు.
- దేశ విభజన వల్ల అగ్ర గాయకులుగా పేరొందిన ఖుర్షీద్, నూర్జహాన్ పాకిస్థాన్‌కు వెళ్లిపోవడంతో లత పాటకు ప్రాధాన్యం పెరిగింది. 'అల్బేలా', 'ఛత్రపతి శివాజీ', 'అనార్కలీ', 'అందాజ్', 'బడీ బెహన్', 'బర్సాత్', 'ఆవారా', 'శ్రీ 420', 'దులారీ', 'మదర్ ఇండియా', 'దీవార్', 'దేవదాస్', 'చోరీ చోరీ', 'అదాలత్', 'జైలర్', 'మొహర్' వంటి చిత్రాలు స్టార్ గాయనిగా మార్చాయి.
- 1962లో లతపై విష ప్రయోగం జరిగింది. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి మూడు నెలల అనంతరం కోలుకున్నారు. ఆ తర్వాత ఆహర్శిశలు శ్రమించారు. ఆ శ్రమే 'భారతరత్న' వంటి అత్యున్నత పురస్కారాన్ని అందుకునేలా చేసింది. నాటి, నేటితరం సంగీత దర్శకు లందరి సినిమాల్లో వేల పాటలు పాడి గిన్నీస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోనూ స్థానం సొంతం చేసుకున్నారు. గాన కోకిలగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు.
- ఏడున్నర దశబ్దాల సినీ జీవితంలో వెయ్యికిపైగా చిత్రాల్లో 36 భాషల్లో 50 వేలకుపైగా పాటలు పాడి అలరించారు. ఆర్.డి.బర్మన్, లక్ష్మీకాంత్, ప్యారేలాల్, కళ్యాణ్ జీ, ఆనంద్ జీ, బప్పీల హరి, రాం లక్ష్మణ్ అనంతరం ఏ.ఆర్.రెహ్మాన్ వరకు లత గానంతో తమ సంగీత ప్రతిభను చాటుకున్నారు.
- 'మజ్బూర్' చిత్రంలో 'దిల్ మేరా తోడా' సాంగ్ లతకు మంచి బ్రేక్‌నివ్వగా, 'మహల్' చిత్రంలోని 'అయేగా ఆనేవాలా..' పాట మరింత పాపులర్ చేసింది. సంగీతదర్శకురాలిగా 'రామ్ రామ్ పహ్వానా', 'మరాఠా టితుక మెల్వవా', 'మోహిత్యంచి మంజుల', 'సాధి మనసే', 'తుంబడి మత' వంటి మరాఠీ చిత్రాలకు స్వరాలను సమకూర్చారు. 'వాదల్', 'జహంగీర్', 'కాంచన్', 'లేకిన్' వంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ హిందీ, మరాఠీ చిత్రాలను నిర్మించి నిర్మాతగా తన అభిరుచి చాటుకున్నారు.
- 1948 నుంచి 74 వరకు ముప్పై ఏండ్లలో 30వేల పాటలు పాడిన ఏకైక గాయనిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో స్థానం సొంతం చేసుకున్నారు. ఇండియన్ నైటింగేల్‌గా ఆబాల గోపాలాన్ని అలరించారు. తెలుగులో 'నిదుర పోరా తమ్ముడా..' (సంతానం), 'తెల్ల చీరకు..' (ఆఖరి పోరాటం) వంటి పాటలతో అలరించారు. 1959లో టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీ స్టోరీగా లతా మంగేష్కర్ గురించి వ్యాసాన్ని ప్రచురించి 'భారతీయ నేపథ్య గాయకుల రాణి'గా అభివర్ణించింది. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీత దర్శకత్వంలో రూపొందిన చిత్రాల్లో 712 పాటలు పాడారు. ఆ తర్వాత శంకర్ జైకిషన్ చిత్రాల్లో 452, ఆర్.డి.బర్మన్ చిత్రాల్లో 327 పాటలు పాడారు.
- 2001లో భారతరత్న, 1999లో పద్మ విభూషణ్, 1989లో దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం, 1969లో పద్మ భూషణ్, 60వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 'వన్ టైమ్ అవార్డు ఫర్ లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్' గౌరవాన్ని అందుకున్నారు. అలాగే 'లేకిన్', 'కోరా కాగజ్', 'పరిచరు' చిత్రాల్లో పాటలు పాడి ఉత్తమ గాయనిగా మూడు జాతీయ అవార్డులను అందుకున్నారు. అలాగే అనేక డాక్టరేట్లు అందుకున్నారు. 1963లో రిపబ్లిక్ డే సందర్భంగా ప్రధాని నెహ్రూ సమక్షంలో లతా పాడిన 'ఆయే మేరే వతన్..' అనే పాట విని ప్రధాని సైతం కంటతడిపెట్టారు. 1974లో లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో గాన ప్రదర్శన ఇచ్చి మొదటి భారతీయ గాయనిగా నిలిచారు. 1999లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు.
పాపులర్ పాటలు..
- 'యాద్ రక్ నా చాంద్', 'కబ్ తక్ కాటేగి జిందగీ కినారే', 'తేరా బినా సునా', 'దిల్ మేరా తోడా', 'దునియా బదల్‌గయి..', 'బర్సాత్ మే హమ్ మిలే', 'బేరీ బిందియా', 'రిమ్ జిమ్ రిమ్ జిమ్ సావన్ బర్సే బర్సే సావన్ ప్యాసా', 'జానేవాలే ఓ జానావాలే' వంటి ఎన్నో పాటలు శ్రోతల్ని అలరించాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







