తిరుగుబాటుదారుడు కాదు...యువతకు ఆదర్శనీయుడు

- August 15, 2015 , by Maagulf
తిరుగుబాటుదారుడు కాదు...యువతకు ఆదర్శనీయుడు

 అడవిబిడ్డల్లో ఉద్యమ బీజాలు నాటిన పోరాట వీరుడు రెండేళ్లపాటు తెల్లదొరల కంటిమీద కునుకు లేకుండా చేసిన ధీరుడు గాంధీజీ, జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రశంసలు యువతకు ఆదర్శనీయుడన్న బాపూజీ స్వాతంత్య్ర సమరయోధునిగా గుర్తింపు కరువు.

భారతదేశంలో ఆంగ్లేయుల పాలనకు చరమగీతం పాడేందుకు విప్లవ జ్యోతిని వెలిగించిన స్వాతంత్య్ర సమరయోధుల్లో అగ్రగణ్యుడు... తెల్లదొరల బానిసత్వంలో మగ్గిపోతున్న అడవి బిడ్డల్లో ఉద్యమ బీజాలునాటిన పోరాట యోధుడు... స్వేచ్ఛ కోసం పరితపిస్తున్న గిరిజనుల్లో సమర శంఖాన్ని పూరించిన వీరుడు...బ్రిటీష్‌ పాలకుల దమనకాండను, దురాగతాలను అంతమొందించడానికి ఆయుధాలు చేతబూనిన ధీరుడు.... అల్లూరి సీతారామరాజు

       అల్లూరి సీతారామరాజు ధైర్యం, అంకిత భావం, వనరుల సమీకరణ వంటి లక్షణాలు స్వరాజ్య పోరాటంలో యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయంటూ మహాత్మాగాంధీ ప్రశంసించారు. 1929 జులై 18వ తేదీన వెలువడిన ‘యంగ్‌ ఇండియా’ పత్రికలో మహాత్మా గాంధీ రాసిన వ్యాసంలో అల్లూరి గురించి పైవిధంగా పేర్కొన్నారు. గాంధీజీ సర్కార్‌(ఆంధ్ర ప్రాంతం) పర్యటనకు వచ్చినప్పుడు కొంతమంది దేశ భక్తులు అల్లూరి చిత్రపటాన్ని అతనికి బహూకరించి అతని గురించి మహాత్మునికి చెప్పారు. ‘ది కాంగ్రెస్‌’ అనే తెలుగు పత్రిక ఎడిటర్‌ అన్నపూర్ణయ్యను అల్లూరికి సంబంధించిన పూర్తి వివరాలను గాంధీజీ అడిగి తెలుసుకున్నారట! అల్లూరి సీతారామరాజు ధైర్యం, త్యాగం, గొప్పతనం, నిరాడంబరత, సద్గుణం మెచ్చుకోదగినవని అన్నపూర్ణయ్య చెప్పిన విషయాలన్నీ నిజమైతే అల్లూరి తిరుగుబాటుదారుడు కాదని యువతకు గొప్ప ఆదర్శనీయుడని మహాత్మాగాంధీ ప్రశంసించారట! అతి తక్కువ మంది అనుచరులతో బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని గడగడలాడించిన ధైర్యశాలి అల్లూరి సీతారామరాజు అని, అటువంటి వారు కొందరే ఉంటారని జవహర్‌లాల్‌ నెహ్రూ, నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ వంటి మహానీయులు కూడా పేర్కొనడం గమనార్హం. 

 నర్సీపట్నం : బ్రిటీష్‌ పాలనలో దేశంలో అనేకమంది రాజులు, సంస్థానాధీశులు బ్రిటీష్‌ వారికి కప్పం చెల్లించేవారు. గిరిజన ప్రాంత ప్రజలు కూడా కప్పం కట్టాలంటూ బ్రిటీష్‌ పాలకులు వారిని హింసించేవారు. దాంతో అల్లూరి సీతారామరాజు మన్య ప్రాంతంలోని గిరిజనులను సంఘటితపరిచి బ్రిటీష్‌ వారిపై తిరుగుబాటు చేసి, వారి సైన్యాధిపతులైన ఇద్దరిని వధించి, తెల్లదొరలను గడగడలాడించారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా మల్లు దొర, గంటన్నదొర వంటి గిరిజన నేతల నేతృత్వంలో గిరిజనులతో ఆటవిక సైన్యాన్ని తయారుచేసి, బ్రిటీష్‌ పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. అల్లూరి నాయకత్వంలో గిరిజనులు బ్రిటీష్‌ వారితో పోరాడి జల్‌, జంగిల్‌, జమీన్‌లపై పూర్తి హక్కులు సాధించుకున్నారు.

 

ప్రముఖుల మన్ననలు అందుకున్న అల్లూరి

దేశ స్వాతంత్ర్యోదమ చరిత్రలో విప్లవ పోరాట యోధునిగా గుర్తింపు పొందిన అల్లూరి సీతారామరాజు... 1922 ఆగస్టు చివరి వారం నుంచి 1924 మే మొదటి వారం వరకూ కొనసాగించిన ఏజెన్సీ తిరుగుబాటు(పితూరీ)ను మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ వంటి ఎంతో మంది జాతీయోద్యయ నాయకులు ప్రశంసించారు. బ్రిటీష్‌ ప్రభుత్వం అల్లూరిని విప్లవ కారుడుగా ముద్ర వేసినప్పటికీ, గాంధీజీ సిద్ధాంతాలైన విదేశీ వస్త్ర బహిష్కరణ, స్వరాజ్య ఉద్యమం వంటివి సీతారామరాజును ఎంతో ప్రభావితం చేశాయి. 1921 నాటికి దేశంలో ఊపందుకున్న స్వరాజ్య ఉద్యమ స్ఫూర్తితోనే అల్లూరి సీతారామరాజు, అతని అనుచరులు ఎల్లప్పుడూ ఎర్ర రంగు ఖద్దరు వసా్త్రలనే ధరించేవారు. అల్లూరి తన రెండేళ్ల విప్లవ పోరాటంలో బ్రిటీష్‌ పాలకులపైనే తిరుగుబాటు చేశారు తప్ప వారి ప్రభుత్వంలో పని చేస్తున్న భారతీయులకు ఎటువంటి హాని తలపెట్టలేదు. 1922 సెప్టెంబరు 24వ తేదీన శరభన్నపాలెం సమీపంలోని దామనాపల్లి ఘాట్‌లో మాటువేసి బ్రిటీష్‌ సేనలపై అల్లూరి అనుచరులు దాడి చేసి, బ్రిటీష్‌ పోలీసు అధికారులైన స్కాట్‌ కవర్డ్‌, హైటర్‌ లను మాత్రమే కాల్చి చంపి, మిగతా సైనికులకు హాని చేయకపోవడమే ఇందుకు ఉదాహరణ. 1922 ఆగస్టు 22వ తేదీన అల్లూరి విప్లవ సేన చింతపల్లి పోలీసు స్టేషన్‌పై దాడిచేసి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్న తర్వాత అల్లూరితోపాటు అతని అనుచరులంతా ‘గాంధీజీకి జై’ అంటూ నినాదాలు చేశారు. 1923 డిసెంబరులో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ సమావేశానికి కూడా అల్లూరి హాజరైనట్టు చెబుతుంటారు.

 

--యం.వాసుదేవరావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com