పద్దతి మార్చుకుంటేనే చర్చలకు అగీకరిస్తాం

- December 01, 2016 , by Maagulf
పద్దతి మార్చుకుంటేనే చర్చలకు అగీకరిస్తాం

దేశ సరిహద్దుల్లో పదేపదే కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడుతూ భారత్‌లోకి సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పొరుగుదేశం పాకిస్థాన్‌ను భారత్‌ మరోసారి హెచ్చరించింది. సరిహద్దుల్లో కాల్పులకు దిగుతూ ఇది సరికొత్త సాధారణ స్థితి అన్నట్లుగా వ్యవహరించడాన్ని తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేసింది. ముందు పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని భారత్‌పైకి ఎగదోయడాన్ని నిలిపివేస్తేనే చర్చలు సాధ్యమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ ఓ ప్రకటనలో తేల్చి చెప్పారు. ద్వైపాక్షిక చర్చల కోసం పాక్‌ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని చెప్పిన ఆయన ..

చర్చల విషయంలో భారత్‌ ఎప్పుడూ సుముఖంగానే ఉందని కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చర్చలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేమని చెప్పారు. మరోవైపు నగ్రోటా దాడి ఘటనపై పూర్తి వివరాలు తెలిశాక తమ తదుపరి చర్యలు ఉంటాయని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ ఘటనను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని.. దేశ భద్రతకు ఏది అవసరమో అదే చేస్తామని స్పష్టం చేసింది. సార్క్‌ సమావేశాలను భారత్‌మాత్రమే రద్దు చేయించలేదని.. ప్రస్తుత పరిస్థితుల్లో సదస్సు నిర్వహించొద్దని అన్ని సభ్య దేశాలు ఏకాభ్రిపాయంతో నేపాల్‌కు లేఖ రాశాయని గుర్తు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com