బీజేపీలో చేరిన ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ గవర్నర్
- January 18, 2017
ఆ వ్యూహం అనూహ్యం. మరి ఫలితం? అంతే ఘనంగా ఉంటుందా అన్నదే ప్రశ్న. యూపీలో బీజేపీ ప్రత్యర్థులు ఊహించని ఎత్తు వేసింది. మాజీ సీఎం N.D తివారీకి కాషాయ కండువా కప్పింది. కాంగ్రెస్ కురువృద్ధుడు కాషాయ దళంలో చేరడంతో కమలం వికసిస్తుందా. ఈ ఎత్తుగడ కమలనాథులకు ఏ మేరకు ప్రయోజనం కలిగిస్తుందనేదే ఇప్పుడు హాట్ టాపిక్. యూపీ కాంగ్రెస్లో కురువృద్ధుడు ND తివారీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కాషాయదళంలో చేరారు. ఆయన తనయుడు రోహిత్ శేఖర్ కూడా తండ్రితో పాటు బీజేపీలో చేరారు. మూడు సార్లు ఉత్తర్ ప్రదేశ్ కు, ఉత్తరాఖండ్ కు తొలి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్కు గవర్నర్ గానూ వ్యవహరించారు. చాలా కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. యూపీ, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనూహ్యంగా మరోసారి తెరపైకి వచ్చారు. ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా బీజేపీకి ఏ మేరకు లబ్ధి కలుగుతుందనే చర్చ మొదలైంది. యూపీ రాజకీయాలు సంక్లిష్టమైనవి. ఇప్పటికీ కులరాజకీయాలదే హవా. మొత్తం ఓటర్లలో సుమారు 23 శాతం బ్రాహ్మణులే. బలమైన బ్రాహ్మణ నేత తివారీ రాకతో ఆ వర్గం ఓటర్లు తమ వైపే మొగ్గు చూపుతారని బీజేపీ ఆశ. తివారీ చాలా కాలంగా ప్రజా జీవితానికి దూరంగా ఉన్నా, ఆ సామాజిక వర్గంలో పెద్ద మనిషిగా ఇప్పటికీ ఆయనకు పట్టు ఉందనేది కమలనాథుల అంచనా. ఇప్పటి వరకూ యూపీ బీజేపీలో బలమైన బ్రాహ్మణ నేత లేని లోటును ఇలా పూడ్చుకోవాలని ఆ పార్టీ నేతలు నిర్ణయానికి వచ్చారు. ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ను యూపీలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. అయితే ఆ నిర్ణయం వెనుక కులరాజకీయ వ్యూహం ఉంది. బ్రాహ్మణ ఓటు బ్యాంకుపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్, షీలాను తెరపైకి తెచ్చింది. అయితే, ఇప్పుడు సమాజ్ వాదీ పార్టీతో పొత్తు కుదిరితే ఇక షీలా సీఎం అభ్యర్థి అయ్యే అవకాశం లేదు. అయినా, తెరవెనక చక్రం తిప్పడంలో ఆమె ఇప్పటికే బిజీ బిజీగా ఉన్నారు. 91 ఏళ్ల తివారీ ఊరూరా తిరిగి ప్రచారం చేసే అవకాశం లేదు. ఆయన గొప్ప వ్యూహకర్త అని పేరు. బీజేపీ ఓటు బ్యాంకును బలోపేతం చేయడానికి ఆయన పన్నే వ్యూహాలు తమకు మేలు చేస్తాయంటున్నారు కమలనాథులు. ఇంట్లో కూర్చుని కూడా చక్రం తిప్పగలిగే తివారీ రాక, యూపీలో తమకు టర్నింగ్ పాయింట్ అనే బీజేపీ అంచనా నిజమవుతుందో లేదో వేచి చూడాల్సిందే.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







