'మనసు' కవి ,మన 'సుకవి' - ఆచార్య ఆత్రేయ వర్ధంతి
- September 13, 2015
వేదాంతం, తర్కం, మనసు నిలువెత్తు మనిషిగా సాక్షాత్కరిస్తే ..ఆయనే కిళాoబి వెంకట నరసింహాచార్యులు…' మనసు' కవి ,మన 'సుకవి' …ఆత్రేయ. అందరూ రాసినట్టుగా ఆయన మాటల్ని కలంతో కాకుండా.. హృదయంతో రాస్తారు. మనసు లోతుల్ని అన్వేషించి... బావోద్వేగాల్ని వెలికితీస్తారు. అందుకే ఆయన రాసిన సంభాషణలు ... ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో సజీవంగా ఉన్నాయి. సందర్భమేదైనా సరే .. సన్నివేశం ఎలాంటిదైనా సరే ఆత్రేయ కలం పడితే చాలు... మాటలు ఉద్వేగపు ఊటలూరి జన హ్రుదయాల్ని ఆర్ధ్రంగా తట్టి... అంచనాలకు అందని అనుభూతుల తీరాలకు తీసుకొని వెళతాయి. అందుకే ఆయన రాసిన మాటలు తెలుగు తెరపై వేదాలు గా భాసిల్లుతున్నాయి. ఆత్రేయ,1921 సంవత్సరం మే 7 న సూళ్లూరుపేటలోని మంగళం పాడులో జన్మించారు. 1950లో విడుదలైన 'దీక్ష' చిత్రంలో ఆయన గీత రచయితగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత సంభాషణల రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు చేశారు. ఇంద్రధనుస్సు రంగుల హంగులను ప్రేక్షకులకు అందించి, ఆనందభరితులను చేశారు. ఆత్రేయ తాత్విక ధోరణితో రాసిన సంభాషణలు జీవిత తత్వాన్ని గుట్టువిప్పుతాయి. 1400కిపైగా సినిమా పాటలు. వాటిల్లో 100కి పైగా మనసు పాటలే ఉన్నాయి. ఆత్రేయ రాయడం లేట్ చేసినా... ఎంతో మంది దర్శకులకు తమ సన్నివేశాలు పండాలంటే ఆయనే ఉండాలని ఫీలయ్యేవారు. అందుకే ఆత్రేయ జాప్యాన్ని హృదయ పూర్వకంగానే భరించే దర్శకనిర్మాతలు చాలా మంది ఉండేవారు. అలాంటి వాళ్ళలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ దర్శకులు ఆదుర్తి సుబ్బారావు, కె.యస్ .ప్రకాశరావు . వీరిద్దరికీ ఆత్రేయ దాదాపు అన్ని చిత్రాలకు అద్భుతమైన సంభాషణలు అందించారు. మౌనం మనసు భాష అంటూ మొదలుపెట్టి... ''మనిషికి మనసే తీరని శిక్ష.. దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష.'' అంటూ మాట్లాడి... మనసొక మధుకలశం..అంటూ ఎన్నో రకాల విశ్లేషణలు చేశారు ఆత్రేయ. ఆత్రేయుడు అంటే చంద్రుడు. వెన్నెలంత వేడిగా వెన్నెలంత చల్లగా తెలుగుజాతికి మనసైన పాటలందించిన మనసు కవి, మరిచిపోలేని మాటలందించిన మనసున్న కవి, ఈయన 13 సెప్టెంబర్ 1989 లో 68 సంవత్సరాల వయసులో, హైదరాబాదులో స్వగృహంలో మరణించారు. తెలుగు సినీ సాహిత్య చరిత్రలో ఆయన ఓ చెరిగిపోని తీపి గుర్తు. అరుదైన అక్షరయోగి, మాటల మహర్షి ఆచార్య ఆత్రేయ. ఈ సందర్బంగా ఆయనకు మరో సారి అక్షరనివాళి.
తాజా వార్తలు
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!









