అధ్యక్ష పదవికి విశాల్‌ నామినేషన్ దాఖలు...

- February 04, 2017 , by Maagulf
అధ్యక్ష పదవికి విశాల్‌ నామినేషన్ దాఖలు...

నామినేషన్ దాఖలు
మద్దతు తెలిపిన కమల్‌హాసన్
హామీలు నెరవేర్చకపోతే రాజీనామా చేస్తా: విశాల్‌
చెన్నై: త్వరలో జరుగనున్న తమిళ నిర్మాతల సంఘం ఎన్నికల్లో అధ్యక్ష పదవికి నటుడు, నిర్మాత విశాల్‌ పోటీ చేయబోతున్నారు. నిర్మాతల మండలి ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను కోర్టు ఉత్తర్వుల మేరకు ఎత్తివేయడంతో విశాల్‌ మరోసారి ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. శనివారం మధ్యాహ్నం అధ్యక్ష పదవికి విశాల్‌ నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో ఆయనకు మద్దతుగా నిర్మాతలు ప్రకాష్‌ రాజ్‌, పాండిరాజ్‌, మిష్కిన్, జ్ఞానవేల్‌రాజా, ఎస్‌ఆర్‌ ప్రభు, సీవీ కుమార్‌, ఎస్‌ఎస్‌ కుమరన్, ఆర్‌కే సురేష్‌ తదితరులు ఉన్నారు.
అలాగే విశ్వనటుడు కమల్‌హాసన్ కూడా విశాల్‌కు మద్దతు పలకడంతో మరోసారి సినీ ఎన్నికల్లో రాజకీయ వాతావరణం కనిపించే సూచనలు కన్పిస్తున్నాయి. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్టు విశాల్‌ దాఖలు చేసిన నామినేషన్ పత్రంలో కమల్‌హాసన్ సంతకం కూడా చేశారు. గతేడాది నడిగర్‌ సంఘం ఎన్నికల్లో విశాల్‌ ప్రధాన కార్యదర్శిగా బరిలోకి దిగి విజయభేరి మోగించిన విషయం తెలిసిందే. అదే తరహాలో నిర్మాతల మండలిలోనూ తన సత్తా చాటాలని విశాల్‌ ఎదురుచూస్తున్నారు. వచ్చే నెల 5వ తేదీన మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రాజేశ్వరన్ పర్యవేక్షణలో నిర్మాతల మండలి ఎన్నికలు చెన్నైలో జరుగనున్నాయి. కార్యవర్గంపై అసంతృప్తితో ఉన్న నిర్మాతలతో కలిసి విశాల్‌ ప్రత్యేక కూటమిని ఏర్పాటుచేసుకుంటున్నట్లు సమాచారం. 
దీంతో ప్రస్తుత అధ్యక్షుడు కలైపులి ఎస్‌.థాను, రాధాకృష్ణన్, విశాల్‌ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. విశాల్‌ వర్గం తరపున అధ్యక్ష పదవికి పోటీచేయనున్నట్టు ప్రకటించిన నటి ఖుష్బూ తాజా పరిణామాలతో రేసు నుంచి తప్పుకొన్నారు. ఆమె కార్యదర్శి లేదా కోశాధికారి పదవికి పోటీ చేసే అవకాశం ఉంది. ఇక నామినేషన్ దాఖలు అనంతరం విశాల్‌ మాట్లాడుతూ... నిర్మాతల మండలి ఎన్నికల్లో తమ జట్టు తప్పనిసరిగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గెలిచిన తరువాత ఎన్నికల హామీలను నెరవేర్చకపోతే పదవికి వెంటనే రాజీనామా చేస్తాం. అవసరమైతే రాజీనామా లేఖ ఇప్పుడే ఇస్తాం. సమర్థవంతులైన మంచి నిర్మాతలే సినీ పరిశ్రమను అభివృద్ధి పథంలో నడిపించగలరన్నారు. రెండేళ్లుగా బయట నుంచే గొంతు విప్పినా ఏమీ జరగలేదని, అందుకే నిర్మాతల మండలి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని విశాల్‌ చెప్పారు. నిర్మాతల సంక్షేమానికి అందరం కలిసి కృషిచేస్తామని, పైరసీ వంటి సమస్య నిర్మూలనకు కృషి చేస్తామని విశాల్‌ జట్టు సభ్యులు ప్రకాష్‌రాజ్‌, గౌతమ్‌మేనన తదితరులు పేర్కొన్నారు. కాగా, ఎన్నికల్లో ఎవరు ఏయే పదవులకు పోటీ చేస్తారో త్వరలో వెల్లడించనున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com