అమరావతిలో ఐటీ రంగానికి వూపు
- February 18, 2017
ఐటీ అంటే తెలుగువారికి గుర్తొచ్చేది హైదరాబాద్.. అక్కడ హైటెక్ సిటీ. ఎంతో మంది యువత అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్‌కు ఐటీ కళ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. విశాఖతో పాటు విజయవాడలోనూ ఐటీ హబ్‌లు ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది.
ఇందుకు ప్రవాసాంధ్రులు సహకారం అందిస్తున్నారు. నవ్యాంధ్రలో విజయవాడను ఐటీ రాజధానిగా చేయడానికి తెలుగునేలపై పుట్టి పెరిగి.. సాంకేతిక విద్యనభ్యసించి.. విదేశాలకు వెళ్లి ఐటీ రంగంలో దిగ్గజాలుగా ఎదిగిన వారు ముందుకొచ్చారు. సొంతగడ్డపై సంస్థలను నెలకొల్పి.. ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఇక్కడ తొలి అడుగువేశారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఎన్‌ఆర్‌టీ ప్రోత్సాహం అందించాయి. ఐటీ కంపెనీలను నెలకొల్పేందుకు అవసరమైన మౌలికవసతులు, భవన సదుపాయాన్ని విజయవాడలోని ఆటోనగర్‌లో ఏర్పాటు చేశాయి. ఐటీ సర్వ్ టెక్‌పార్క్ పేరుతో నెలకొల్పిన నాలుగంతస్తుల భవనంలో ఒకేసారి ఎనిమిది కంపెనీలు శుక్రవారం తమ శాఖలను ప్రారంభించాయి. వీటిని స్థాపించిన ప్రవాసాంధ్రులు తమ కుటుంబాలతో సహా తరలివచ్చి.. సొంతగూటికి చేరామన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు.
విజయవాడలో ఐటీ సంస్థలను నెలకొల్పాలనే భావన చాలామందిలో ఉన్నప్పటికీ.. సరైన మౌలికవసతులు లేవు. ఎవరైనా వచ్చి.. ఇక్కడ కంపెనీని ప్రారంభించాలంటే తొలుత ప్లగ్ అండ్ ప్లే కార్యాలయాలు అందుబాటులో ఉండాలి. అప్పుడే వారు నగరానికి వచ్చీ రాగానే తమ పనిని ప్రారంభించుకునేందుకు అవకాశం ఉంటుంది. తాత్కాలికంగా పనిని ప్రారంభించాక.. కొంతకాలానికి అన్నీ సమకూర్చుకోవడం ఐటీ కంపెనీలకు అనువుగా ఉంటుంది. అయితే.. ఇక్కడ ఇంకా ప్లగ్‌అండ్‌ప్లే పద్ధతిలో కార్యాలయాలను అద్దెకు ఇచ్చే సంస్కృతి విస్తరించలేదు. హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలకు రాత్రికి రాత్రి వంద మంది సిబ్బందితో పనిని ప్రారంభించాలన్నా.. కార్యాలయాలు కుప్పలుతెప్పలుగా దొరుకుతాయి. కంప్యూటర్ల దగ్గర నుంచి అంతర్జాలం, సౌకర్యాలు అన్నీ రెడీమేడ్‌గా దొరుకుతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి కార్యాలయాల కోసం భవనాలను సిద్ధం చేసే ప్రైవేటు భవన యజమానులకు సైతం పుష్కలంగా రాయితీలను ప్రకటించింది. దీంతో విజయవాడలో ఆ పరిస్థితి ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలో ఒకేసారి ఎనిమిది పెద్ద సంస్థలు తమ కార్యాలయాలను స్థాపించడమంటే.. ఐటీ రంగానికి వూపు వచ్చినట్టే. ఒక్కో సంస్థ ప్రారంభంలోనే కనీసం వంద మంది సిబ్బందితో పనిని ప్రారంభించనున్నట్టు ప్రకటించాయి. దీంతో మరికొన్ని సంస్థలు సైతం ధైర్యం చేసి ముందడుగు వేసేందుకు అవకాశం ఏర్పడింది. త్వరలో ఆరోగ్యరంగానికి సంబంధించిన ఫైకేర్, ఫ్రైం ఎరా, ఆర్‌సీఆర్‌ఎంఎస్, సర్జికేర్ వంటి బీపీవో సంస్థలు విజయవాడ సమీపంలో తమ శాఖలు ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి.
ఉద్యోగుల భద్రతకూ పెద్దపీట
ఐటీ కంపెనీలంటే మహిళా ఉద్యోగులు ఉంటారు. 24 గంటలూ షిఫ్టులు ఉంటాయి. ఈ నేపథ్యంలో విజయవాడలో ఎలాంటి ఇబ్బందీ లేకుండా వారంతా విధులు నిర్వర్తించేందుకు వీలుగా భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. దీనిపై పోలీసు విభాగం దృష్టిసారించింది. విజయవాడ నగర పోలీసు కమిషనర్ గౌతమ్‌సవాంగ్ ఐటీ సంస్థల యజమానులతో శుక్రవారం సమావేశమయ్యారు. పోలీసులు, సంస్థల నిర్వాహకులు కలిసి ఎలా ముందుకు సాగాలనే విషయంపై చర్చించారు. పలు రకాల సూచనలు చేశారు. ప్రధానంగా సాంకేతికత సహకారంతో ఉద్యోగులకు భద్రత, భరోసా కల్పించాలనే కోణంలో సమాలోచన చేశారు. వచ్చే ప్రతి ఉద్యోగికి భద్రత కల్పించడమే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతామని పోలీసులు పేర్కొంటున్నారు.
ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన పనిలేకుండా..
రాష్ట్ర ప్రభుత్వం అమెరికాలో 600 కంపెనీలతో కూడిన ఐటీ సర్వ్ అలయన్స్‌లో గతంలో సమావేశం ఏర్పాటు చేసి ఏపీలోని అవకాశాలపై వివరించింది. సుమారు 130 కంపెనీల ప్రతినిధులు ముందుకొచ్చి రాష్ట్రంలో తమ శాఖల ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. దీనిలో భాగంగానే ప్రస్తుతం విజయవాడలో ఎనిమిది కంపెనీలను నెలకొల్పారు. ప్రస్తుతం.. ఆటోనగర్‌లోని ఐటీ సర్వ్ టెక్‌పార్క్‌లో యాక్సెల్, ఎడ్‌బ్రి, ఎం.ఎస్.ఆర్.కాస్మోస్, అడాప్ట్ టాలెంట్, అడ్వాన్స్ సాఫ్ట్, జోల్ట్, విన్‌టెక్, పేటీఎం కంపెనీలు తమ శాఖలను ప్రారంభించాయి. వీటిలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, సాంకేతిక శిక్షణ సంస్థలతో పాటూ పలు రకాల ఐటీ సేవలు అందించే సంస్థలు ఉన్నాయి. స్థానిక ప్రతిభను ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఈ కంపెనీల సీఈవోలు పేర్కొన్నారు. సంస్థలను ఏర్పాటు చేసేందుకు అనువైన సమయం కోసం వేచి చూశామని, ప్రభుత్వ ప్రోత్సాహం లభించడంతో వెంటనే ప్రారంభించామని వారు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఐటీ రంగానికి సంబంధించిన సంస్థలు లేకపోవడంతో ఇక్కడి యువత హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడే సంస్థలు ప్రారంభమవ్వడంతో ఇక ఉపాధి అవకాశాల కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం ఉండదు. కనీసం వెతికిచూసినా.. పేరున్న ఒక్క సాఫ్ట్‌వేర్ సంస్థ కూడా ఇంతవరకూ విజయవాడ పరిసర ప్రాంతాలలో ఏర్పాటు కాలేదు. తాజాగా ఒకేసారి ఎనిమిది సంస్థలు ఒకేసారి వంద మంది చొప్పున ఉద్యోగులతో ఇక్కడికి రావడం శుభపరిణామం.
మానవ వనరులను సిద్ధం చేస్తూ..
ఐటీ సంస్థలకు మౌలిక వసతులు ఎంత అవసరమో.. మానవ వనరులు కూడా అంతే అవసరం. విజయవాడలో ఐటీ సంస్థల ప్రారంభంతో పాటూ పక్కనే ఉన్న గన్నవరం, మంగళగిరి ప్రాంతాల్లోనూ మరికొన్ని సంస్థల ఏర్పాటుకు మేథాటవర్స్ లాంటి భవనాలను ఎంపిక చేశారు. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఐటీ వూపు ప్రారంభమైన నేపథ్యంలో మానవ వనరులను తయారు చేసే అంశం కూడా కీలకంగా మారింది. ప్రభుత్వం, ఏపీఎన్‌ఆర్‌టీలు ప్రస్తుతం ఈ అంశంపైనా దృష్టిసారించాయి. ఐటీ కంపెనీలకు శిక్షణను ఇచ్చే 18 రకాల సంస్థలను మంగళగిరిలో ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా యువతకు ఇక్కడ శిక్షణ ఇస్తారు. ఇప్పటివరకూ ఈ శిక్షణ కోసం బెంగళూరుకు వెళ్లాల్సి వచ్చేది. ఇంజినీరింగ్ కళాశాలల నుంచి బయటకు వస్తున్న విద్యార్థులను ఎంపిక చేసి కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఏర్పాటైన ఎనిమిది కంపెనీల కోసం కూడా ఈ విధంగానే ఉద్యోగులను సమకూర్చారు.
తొలుత మనవారిని రప్పించేలా..
- రవి మేమూరి, ప్రవాసాంధ్రుల వ్యవహారాలు, పెట్టుబడుల సలహాదారు
హైదరాబాద్, బెంగళూరు నగరాల స్థాయిలో ఐటీ సంస్థలను ఇక్కడికి రప్పించేందుకు అన్ని రకాలుగానూ ప్రయత్నాలు చేస్తున్నాం. పెద్ద కంపెనీలను ఒకేసారి ఇక్కడికి తెచ్చేందుకు పాకులాడడం కంటే.. విదేశాలకు వెళ్లి సంస్థలను నెలకొల్పిన మన వారిని తొలుత రప్పిస్తే బాగుంటుందని భావించాం. దానిలో భాగంగానే అమెరికాలోని ఐటీ సర్వ్ అలయన్స్‌తో మాట్లాడి దీనికోసం కొందరిని ఒప్పించాము. ఐటీ సంస్థలు ఇక్కడికి వచ్చేందుకు తొలుత మౌలికవసతులు ఏర్పాటు చేయాలి. అందుకే ఆటోనగర్‌లో భవనం తీర్చిదిద్దారు. ప్రభుత్వం సైతం అద్దెలో సగం రాయితీతో పాటూ పలు రకాల ప్రోత్సాహకాలు అందిస్తోంది.
ఇది తొలి అడుగు మాత్రమే..
- మురళి నన్నపనేని, ఏపీఎన్‌ఆర్‌టీ ప్రతినిధి
ఒకేసారి ఎనిమిది కంపెనీలు ఏర్పాటు చేయడం అనేది తొలి అడుగు మాత్రమే. త్వరలో మరో నాలుగు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా సంస్థలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. మన ప్రతిభ ఎక్కడెక్కడికో వెళ్లి ఉపాధిని వెతుక్కోవడం కాకుండా.. ఇక్కడే వారికి అవకాశాలను కల్పించాలనేది మా ప్రధాన లక్ష్యం. దాని కోసమే ఏపీఎన్‌ఆర్‌టీ ప్రయత్నాలు చేస్తోంది. అమరావతి ప్రాంతంలో ఎంతో తెలివితేటలు కలిగిన యువతరం ఉన్నారు. వారి మేధస్సు ఐటీ సంస్థలకు తప్పకుండా ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికి చిన్నస్థాయిలో ప్రారంభమైనా.. భవిష్యత్తులో ఐటీ రంగం వూపందుకునేందుకు ఇదే ప్రారంభం కానుంది.
కనీసం 300 మందికి..
- సారథి, బ్రిక్స్ సీఈవో
ఉత్తర అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాలలో మా ఐటీ సంస్థ గత 20 ఏళ్లుగా సేవలందిస్తోంది. హైదరాబాద్, బెంగళూరుల్లోనూ మా శాఖలున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పాం. డిజిటల్ ఇండియాను అందిపుచ్చుకోవడంలో భాగంగా విజయవాడలో నూతన శాఖను ప్రారంభించాం. ప్రస్తుతం వంద మందికి అవకాశం కల్పించాం. వచ్చే ఒకటి రెండేళ్లలో కనీసం 300 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది మా లక్ష్యం. ప్రభుత్వం అన్ని వసతులనూ కల్పించడంతో మేము వచ్చీ రాగానే సంస్థ పనిని ప్రారంభించుకునేందుకు వీలుగా ఉంది.
ఇక్కడి వారికి ఉద్యోగ అవకాశాలు..
- హేమంత్‌కుమార్, జోల్ట్ టెక్నాలజీస్ సీఈవో
అమెరికా కేంద్రంగా పనిచేస్తూ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌తో పాటూ సాంకేతిక శిక్షణను అందించే కంపెనీ మాది. ప్రస్తుతం విజయవాడలో నూతన శాఖను ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వం, ఏపీఎన్‌ఆర్‌టీ సహకారం వల్లే ఇంత త్వరగా సంస్థను నెలకొల్పగలిగాం. స్థానిక ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఇక్కడ సంస్థను ఏర్పాటు చేశాం. గతంలో ఇక్కడికి వద్దామన్నా.. సరైన వేదిక దొరకలేదు. ప్రస్తుతం అన్ని వసతులనూ ప్రభుత్వం కల్పించి ప్రోత్సహిస్తోంది. ఎంతమందికి వీలైతే అంత ఎక్కువ ఉపాధి అవకాశాలను కల్పిస్తాం.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









