విల్లన్ లు గా మారుతున్న హీరోలు
- February 19, 2017
జగపతిబాబు, అరవింద్‌స్వామి... రానా, సూర్య, ఆది పినిశెట్టి, సుధీర్‌బాబు... ఒకప్పుడు హీరోలుగా రాణించి ఇప్పుడు విలన్లుగా పేరు తెచ్చుకుంటున్నవారు కొందరైతే, అటు హీరోలుగానూ ఇటు విలన్లుగా కూడా దుమ్మురేపుతున్నవారు ఇంకొందరు. విలనిజంలో హీరోయిజం చూపించడమే ప్రస్తుతం సినీ పరిశ్రమలో నడుస్తోన్న ట్రెండ్.
లెజెండ్... పేరున్న హీరో విలన్‌గా మారితే ఉండే కిక్కేంటో చూపించిన సినిమా. హీరోలు విలన్ పాత్రలు చెయ్యడం పెరిగిందీ ఆ సినిమాతోనే. ఇప్పుడైతే ఏకంగా అదో ట్రెండ్‌లా మారిపోయింది. ఇంతకుముందు సినిమాకు ప్రధాన బలం హీరో హీరోయిన్లే అనుకునేవారు.
కానీ ఈమధ్యకాలంలో ప్రేక్షకుడి దృష్టి కూడా మారింది. కథానాయకుడితో పాటు ప్రతినాయక పాత్ర చేసిన వారికి జనంలో ఉన్న పేరు, వారి స్టైల్, ప్రతిభ కూడా సినిమా విజయంలో ప్రధాన భూమిక వహిస్తుండటంతో దర్శకులూ విలన్ పాత్రధారులపైన ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. అందుకు తగ్గట్లే లెజెండ్, బాహుబలి దగ్గర్నుంచి ధృవ, సరైనోడు వరకూ హీరోలు విలన్లుగా చేసిన సినిమాలు చాలా వరకూ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంతో పాటు బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షాన్నీ కురిపించాయి. అవును, ముఖంలో క్రూరత్వం కనిపిస్తేనే విలన్ అనే పాత రోజులు పోయాయి మరి. అందుకే, కుటుంబ ప్రేమకథా చిత్రాలకు పెట్టింది పేరైన జగపతిబాబు స్టైల్ అతడిని పవర్‌ఫుల్ విలన్‌గానూ నిలిపింది. బాహుబలి సినిమాలో బాహుబలి పాత్రకు ఎంత పేరొచ్చిందో భల్లాలదేవుడి పాత్రకూ అంతే పేరొచ్చింది. ప్రతినాయకుడిగా అక్కడ రానా ఉండడమే దీనిక్కారణం అని సినిమా చూసినవారెవరైనా చెప్పగలరు. ఇక, రోజా, బొంబాయి... లాంటి సినిమాలతో అందాల హీరోగా పేరు తెచ్చుకున్న అరవింద్‌స్వామి చాలాకాలం తర్వాత మళ్లీ తెరమీద అదీ విలన్‌గా కనిపించాడు. అదే ‘ధృవ’ సినిమా. దీన్లో హీరో - రామ్‌చరణ్ అయినా సైంటిస్ట్ పాత్రలో ప్రతినాయకుడిగా కనిపించిన అరవింద్‌స్వామి కూడా హీరోతో సమానంగా సినిమా విజయంలో పాలు పంచుకున్నాడు. సైన్స్‌ఫిక్షన్ నేపథ్యంలో వచ్చిన ‘24’ చిత్రంలో అయితే ఇంకాస్త భిన్నంగా సూర్య హీరోగానూ విలన్‌గా కూడా నటించాడు. అందులో సూర్య చేసిన విలన్ పాత్రను మరొకరు చేస్తే ఆ సినిమాకు అంత పేరొచ్చేది కాదేమో అనిపిస్తుంది. తాజాగా విడుదలైన నానీ సినిమా ‘నేను లోకల్’లో నెగెటివ్ పాత్ర చేసిన నవీన్ చంద్ర కూడా అందాల రాక్షసి, త్రిపుర... లాంటి సినిమాల హీరో అని తెలిసిందే.
దేనికైనా రెడీ..!
ఇదివరకటిలా నేటి హీరోలు ఫలానాదే చేస్తాం అనుకోకుండా దమ్మున్న పాత్ర ఏదైనా నటించడానికి ఒప్పుకుంటున్నారు. తెలుగువారికి పరిచయం ఉన్న ఇతర భాషల హీరోల్ని సైతం మన సినిమాల్లోకి ప్రతినాయకులుగా తీసుకొస్తున్నారు. అలా తమిళంలో హీరోగా పేరుపొందిన ‘ఆది పినిశెట్టి’ సరైనోడు సినిమాతో తెలుగులో గ్లామరున్న విలన్‌గా మారి అలరించాడు. ఒకే ఒక్కడు, శ్రీ మంజునాథ, శ్రీ ఆంజనేయం... లాంటి సినిమాలతో టాలీవుడ్‌లో పేరుపొందిన తమిళ హీరో అర్జున్ కూడా త్వరలో రాబోతోన్న నితిన్ చిత్రంలో విలన్‌గా కనిపించబోతున్నాడట. కన్నడలో ఎంతో పేరున్న హీరో సుదీప్ కూడా ఇంతకుముందు ‘ఈగ’ సినిమాలో విలన్‌గా నటించి ఆ సినిమా హిట్ కావడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక, తెలుగులో ‘ప్రేమకథాచిత్రమ్’తో హీరోగా నిరూపించుకున్న సుధీర్‌బాబు ఏకంగా బాలీవుడ్ విలన్‌గా మారిపోయాడు. ఈమధ్య అక్కడ విడుదలైన వర్షం సినిమా రీమేక్ ‘బాఘీ’లో విలన్‌గా నటించి మంచి మార్కులే కొట్టేశాడు.
ఒకప్పుడు హీరోలుగా పేరుతెచ్చుకున్న సుమన్, సాయికుమార్ కూడా అటు విలన్‌గానూ ఇటు సహాయ నటులుగానూ రాణిస్తున్నారు. హీరోగా కొన్ని సినిమాలు చేసిన తారకరత్న కూడా ఈమధ్య వచ్చిన నారా రోహిత్ సినిమా ‘రాజా చెయ్యి వేస్తే’లో విలన్‌గా నటించాడు. హీరో రాజశేఖర్, నచ్చావులే హీరో తనీష్‌లు కూడా త్వరలో ప్రతినాయక పాత్రల్లో పరిచయమవుతున్నారన్నది సినీవర్గాల సమాచారం. ఈ లెక్కన... ముందు ముందు తెరమీద మరికొంతమంది హీరో విలన్లనూ చూడొచ్చన్నమాట.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







