యూఏఈలో 90 రోజుల ఆన్‌లైన్‌ విజిట్‌ వీసా

- September 27, 2015 , by Maagulf
యూఏఈలో 90 రోజుల ఆన్‌లైన్‌ విజిట్‌ వీసా

 పరిమిత కాలానికిగాను ఒకసారి లేదా పలుసార్లు యూఏఈలోకి అనుమతిస్తూ ఆన్‌లైన్‌ వీసా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. యూఏఈ పౌరుడు, నివాసితుడు లేదా ఇన్వెస్టర్‌ ద్వారా స్పాన్సర్‌ షిప్‌ పొంది, ఈ సర్వీసెస్‌ ద్వారా ఆన్‌లైన్‌లో విజిట్‌ వీసాను పొందే అవకాశం ఉంది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌, స్మార్ట్‌ ఫోన్‌ యాప్‌ ద్వారా కూడా ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. విజిటింగ్‌ వీసా ఇబ్బందుల్ని తొలగించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లుగా మేజర్‌ జనరల్‌ ఖలీఫా హరెబ్‌ అల్‌ ఖైలాలి చెప్పారు. ప్రవేశానుమతులు పూర్తిగా సురక్షితమైనవనీ, ఎలక్ట్రానిక్‌ పద్దతుల్లో ఇవ్వబడ్తాయనీ, అనుమతుల కోసం ఎక్కువ సమయం వేచి ఉండకుండా ఈ కొత్త విధానం ఉపకరిస్తుందన్నారు. స్మార్ట్‌ టెక్నాలజీ గురించి లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఫైసల్‌ మొహమ్మద్‌ అల్‌ షిమ్మరీ చెబుతూ ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేవారి సంఖ్యను 80 శాతం తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నామనీ, దానిలో భాగంగానే పౌరుల ప్రయాసలు తగ్గించేందుకు స్మార్ట్‌ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నామన్నారు. పౌరులు తమ సలహాల్ని ఇమెయిల్‌ ద్వారా కూడా పంపవచ్చన్నారు. ఆ సలహాల్ని, సూచనల్ని సంబంధిత కమిటీ పరిశీలిస్తుందని చెప్పారు. 90 రోజుల ఏక కాలానికి పొందాల్సిన వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవారు, ఈ ఫామ్‌ని నింపి, దానికి తనను స్పాన్సర్‌ చేస్తున్న వ్యక్తి పాస్‌పోర్ట్‌ని (తప్పనిసరిగా ఆరు నెలల వేలిడిటీ ఉండాలి) జతచేయాల్సి ఉంటుంది. స్పాన్సర్‌ కుటుంబ సభ్యుడే అయితే మ్యారేజ్‌ కాంట్రాక్ట్‌ సర్టిఫికెట్‌ని జత చేయాల్సి ఉంటుంది. 1000 దిర్హామ్‌ల బ్యాంక్‌ సెక్యూరిటీ డిపాజిట్‌ కూడా చేయాలి. హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ కాపీ, పాస్‌ పోర్ట్‌ కాపీ సైతం స్పాన్సర్‌ చేసే వ్యక్తివి జతచేయాలి. మరిన్ని వివరాలు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com