దక్షిణాదిన పాగా వేయడానికి బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది

- April 07, 2017 , by Maagulf
దక్షిణాదిన పాగా వేయడానికి బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది

వరుస విజయాలతో బీజేపీ ఆనందోత్సాహాలలో మునిగితేలుతోంది. ఈ విజయ పరంపరను మరింత దృఢంగా కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. భవిష్యత్తులో దక్షిణాదిన పాగా వేయడానికి సానుకూల వాతావరణం వుందని, దీనికి ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలలో లభించిన విజయమే తార్కాణమని చాటుకుంటోంది. ఎలా గెలిచినా గెలుపు గెలుపే. అయితే ఈ గెలుపు బలమనుకోవాలా? వాపనుకోవాలా? రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మిత్రపక్షాల మధ్య బంధం బలపడుతుందా? బీటలు వారుతుందా? 
ఉత్తర భారతంలో పాగా వేసిన ఉత్సాహం ఇప్పుడు బీజేపీ శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మోదీ చేస్తున్న పనులకు మెజారిటీ ప్రజల ఆమోదం లభించిందని బలంగా విశ్వసిస్తున్నట్టు బాహ్య ప్రకటనలు ఆడంబరంగా చేస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్రలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం బలపరిచిన బీజేపీ అభ్యర్థి పీవీఎన మాధవ్‌ గెలిచారు. గడచిన రెండుసార్లు పట్టభద్రుల నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా శర్మ గెలిచారు. మొదటిసారి ఎన్నికల్లో సుమారు 23 వేల ఓట్లు సాధించి మొదటి ప్రాధాన్య ఓట్లతోనే ఆయన విజయం సాధించారు. రెండోసారి ఎన్నికల్లో 34 వేల ఓట్లు సాధించారు. అయితే మ్యాజిక్‌ ఫిగర్‌కు సుమారు మరో మూడు వేల ఓట్లు అవసరమయ్యాయి. వాటిని ద్వితీయ ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు క్రమంలో సునాయాసంగానే గెలుచుకున్నారు. ఆ రెండు ఎన్నికలూ సాదాసీదాగా, కేవలం పట్టభద్రుల ఎన్నికలలానే జరిగాయి. రాజకీయ పార్టీల ప్రభావం, ప్రచారం పెద్దఎత్తున సాగిన దాఖలాలు లేవు. 

విశాఖ: ఈసారి ఎన్నికలు అందుకు పూర్తి భిన్నంగా సాగాయి. సీనియర్‌ బీజేపీ నేత పీవీ చలపతిరావు కుమారుడిగా, సంఘ్‌ పరివార్‌ కార్యకర్తగా, మితభాషిగా, విషయ అవగాహన వున్న విద్యావేత్తగా మాధవ్‌పై చాలా మందిలో సానుకూల దృక్పథం వుంది. బహుశా ఆ సానుకూలతే ఓటర్లపై ఎంతో కొంత పడింది. ఈ విషయాన్ని బీజేపీ శ్రేణులు అంతర్గత సంభాషణలలో అంగీకరిస్తున్నాయి. దీనికితోడు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే నుంచి సర్పంచ వరకూ ప్రజాప్రతినిధులు తరతమ భేదాలు లేకుండా పనిచేసిన తీరు ఇక్కడ ప్రస్థావించుకోవలసిందే. ఇంతా చెమటోడిస్తే వచ్చిన మెజారిటీ గొప్పదేమీ కాదన్న విషయాన్ని పరిశీలకులు అంటున్నాన్నారు. పోలైన ఓట్లలో చెల్లని ఓట్లు సుమారు పదకొండు వేలు వున్నాయి. వీటిలో అత్యధికం మావంటే, మావని ఇరు పక్షాలూ చెప్పుకుంటున్నాయి. నిజానిజాలు ఓటరుకే తెలియాలి. కేవలం గణాంకాలు మాత్రమే నిజాలకు ప్రతిరూపాలని, భారతదేశం వంటి ప్రజాస్వామిక దేశాలలో గెలుపోటములు మెజారిటీ ప్రజల అభిప్రాయ ప్రకటన వేదికలు కావన్న రాజనీతిజ్ఞుల అభిప్రాయమూ పరిగణనలోకి తీసుకోవాల్సిందే. వాదప్రతివాదనలను, గణాంకాల విశ్లేషణలనూ పక్కనపెడితే...గడచిన మూడేళ్ల కాలంలో పాలక పక్షాలపైన వ్యతిరేకత పెరుగుతోందన్న వాస్తవాన్ని అంతర్గత సమావేశాలలో అంగీకరిస్తున్న ఆయా పార్టీలు బహిరంగంగా దిద్దుబాటు చర్యలు చేపడుతున్న దాఖలాలు లేవు. చేతికి వచ్చిన అధికారాన్ని అడ్డగోలుగా ఉపయోగిస్తున్న సందర్భాలు క్రమేపీ పెరుగుతున్నాయి. అధికార పార్టీ చొక్కా వేసుకుని ఏమైనా చేయవచ్చునన్న అభిప్రాయం తలకెక్కిన సంఘటనలు అక్కడో ఇక్కడో తరచూ నమోదువుతూనే వున్నాయి. వీటికితోడు ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దగా చేసిందేమీ లేదన్న భావన ఈ ప్రాంత ప్రజలలో ఎంతో కొంత నాటుకునే వుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కానీ, బీజేపీలో మాధవ్‌ కాకుండా మరే అభ్యర్థి అయినా కానీ పోటీ చేసి వుంటే ఫలితాలు తారుమారయ్యేవన్నది పరిశీలకుల మాట. ఈ మాటను వ్యతిరేకించడానికి అటు బీజేపీ, ఇటు టీడీపీ సిద్ధంగా లేవు. అయితే పార్టీ ప్రభావం నామమాత్రమేననీ, పోటీలో వున్న వ్యక్తి వ్యక్తిగత చరిత్ర బలంగా పనిచేసిందన్న అభిప్రాయాన్ని ఆయా పార్టీల నేతలెవ్వరూ బహిరంగంగా అంగీకరించడానికి సిద్ధంగా లేరు. బహుశా అదే రాజకీయమన్న అభిప్రాయం ఇంకా బలంగా వుండడమే కారణం కావచ్చు. ఊరిస్తూ వస్తున్న మహా విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలకు ఇదే మంచి తరుణమని ఇరు పార్టీలలోని చోటామోటా నుంచి అగ్ర నేతల వరకూ భావిస్తున్నారు. ఇంకా ఎక్కువకాలం ప్రజా ప్రతినిధేలు లేకుండా స్థానిక సంస్థలను అధికారుల అధికారంతో సాగదీయడం సరికాదన్న అభిప్రాయాన్ని చెప్పడానికి వారు పెద్దగా ఇబ్బందేమీ పడడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు ఊపుతో జీవీఎంసీ ఎన్నికల్లో గట్టెక్కేయవచ్చునని కలలు కంటున్నారు. అయితే వేసవిలో నీటి ఎద్దడి, డ్వాక్రా మహిళల రుణభారం, నగర కాలుష్యంపై ఇప్పటికీ ఊరట లేని వైనం, సరికొత్తగా కలిసి వచ్చిన గ్రామాలలో కనిపించని కనీస వసతి సౌకర్యాలు కలగలసి తమకు వ్యతిరేకంగా పనిచేస్తాయేమో అన్న భయం మరో వైపు ముఖ్యనేతలను వెంటాడుతోంది. వీటన్నిం టికీ మించి కార్పొరేషనలో సగం సీట్లను తమకు కేటాయించాలన్న డిమాండ్‌తో పాటు మేయర్‌ లేక డిప్యూటీ మేయర్‌ పదవులలో ఒకటి తమకు కేటా యించాలన్న బీజేపీ డిమాండ్‌ను ఎలా ఎదుర్కో వాలన్న సమస్యా తలనొప్పిగా మారుతుందన్న భావనలో టీడీపీ నేతలు వున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలకు అధిక ప్రాధాన్యమిస్తున్న క్రమంలో బీజేపీతో సర్దుబాట్లు తమ పార్టీ ఉనికికి చేటు తెచ్చే అవకాశాలున్నాయంటూ వాపోతున్న సందర్భాలూ కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ అభ్యర్థి మాధవ్‌ గెలుపు ఆనందాన్ని ఇస్తున్నా... దీనిని తమ బలమని కమలనాథులు జబ్బలు చరుచు కోవడం జీర్ణం కావడం లేదని తమ్ముళ్లు వాపోతు న్నారు. ఏదేమైనా... దిగితే కానీ లోతు తెలియదనీ, వాపెవరిది? బలుపెవరిది తెలియాలన్నా, బంధాలు బీటలు వారుతాయా? బలపడతాయా? అన్నది నిగ్గుతేలాలన్నా కార్పొరేషన్ ఎన్నికల ప్రకటన వరకూ వేచి చూడాల్సిందేనేమో?

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com