నిజామాబాద్, జగిత్యాల లో గల్ఫ్ కార్మికుల ఛలో కలెక్టరేట్
- April 21, 2017
టిఆర్ఎస్ ఎన్నికల ప్రణాళిక-2014 లో ఇచ్చిన హామీ ప్రకారం గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషిచేయాలి కోరుతూ గల్ఫ్ నుండి వాపస్ వచ్చిన కార్మికులు చలో కలెక్టరేట్ లో భాగంగా శుక్రవారం (21.04.2017) నాడు నిజామాబాద్, జగిత్యాల జిలా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించారు. నవ తెలంగాణ సమాజం అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గల్ఫ్ రిటర్నీలు, గల్ఫ్ ఎన్నారైలు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించి, గల్ఫ్ ప్రవాసీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. డా.ఎల్లాల శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ గల్ఫ్ ఉద్యమ సమితి సభ్యులు జగిత్యాల జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. దేశాభివృద్ధిలో భాగస్వాములైన గల్ఫ్ ప్రవాసీ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.
* * * * * *
తేది: 21.04.2017
శ్రీయుత గౌరవనీయులైన
జిల్లా కలెక్టర్ గారికి
ఆర్యా !
విషయం: టిఆర్ఎస్ ఎన్నికల ప్రణాళిక-2014 (పేజీ నెం.22) లో ఇచ్చిన హామీ ప్రకారం గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషిచేయాలి
తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 10 లక్షల మంది కార్మికులము గల్ఫ్ దేశాలయిన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఇ), ఓమాన్, కువైట్, ఖతార్, బహరేన్ తో పాటు సింగపూర్, మలేసియా తదితర దేశాలలో నివసిస్తున్నాము. టిఆర్ఎస్ ఎన్నికల ప్రణాళిక-2014 (పేజీ నెం.22) లో ఇచ్చిన హామీ ప్రకారం గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చేస్తుందని 2 జూన్ 2014 నుండి ఈనాటివరకు గత 34 నెలలుగా ఎదిరి చూస్తున్నాము.
ఉన్న ఊరును, కన్న తల్లిని, మా కుటుంబాలను వదిలి సుదూర దేశాల్లో ఒంటరిగా జీవిస్తున్నాము. తెలంగాణ వలసజీవులం మా చెమటచుక్కల ద్వారా ఆర్జించిన విదేశీ మారకద్రవ్యాన్ని ప్రతినెలా ఒక వెయ్యికోట్ల రూపాయల పంపిస్తున్నాము, దీని ద్వారా భారత ప్రభుత్వం గల్ఫ్ దేశాలనుండి ఇంధనాలను (పెట్రోలియం) ను కొనుగోలు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక పన్నుల ద్వారా నెలకు 50 కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నది. మా పేద కార్మికులను గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేసి, మా శ్రమశక్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎగుమతి-దిగుమతి వ్యాపారం చేస్తున్నాయి. మా పేదకార్మికుల రక్తాన్ని, స్వేదాన్ని ఇంధనాలుగా ఉపయోగించుకుంటున్న ప్రభుత్వాలు మా సంక్షేమాన్ని విస్మరించాయి.
తెలంగాణ ఎన్నారై (ప్రవాసీ విధానం) రూపకల్పనకు తేది: 27.07.2016 న తెలంగాణ ఎన్నారై మంత్రి కేటీఆర్ ప్రవాసి సంఘాలు, నిపుణులతో సమావేశం జరిపి 9 నెలలు కావస్తున్నది, ఎలాంటి ఫలితం లేదు.
తెలంగాణ గల్ఫ్ కార్మికుల ముఖ్యమైన కొన్ని డిమాండ్లు
* ప్రతి సంవత్సరం బడ్జెట్ లో గల్ఫ్ ప్రవాసీల సంక్షేమానికి రూ. 100 కోట్లు కేటాయించాలి
* తెలంగాణ రాష్ట్రం లో ప్రత్యేకంగా ప్రవాసి సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చెయాలి
* సచివాలయంలో ఉన్న ఎన్నారై సెల్ ను అందరికీ అందుబాటులో ఉండే విధంగా బయట ఏర్పాటు చేయాలి
* గల్ఫ్ కు వలసవెళ్లిన వారి పేర్లను రేషన్ కార్డుల నుంచి తొలగించవద్దు
* కేరళ తరహాలో ప్రవాసీల రక్షణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టాలి. విదేశాలకు వెళ్ళే కార్మికులకు జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలి.
* విదేశాల నుండి అనుకోకుండా తిరిగి వచ్చిన వలస కార్మికులకు పునరావాసం కల్పించాలి. పావలా వడ్డీకి రుణాలు ఇవ్వాలి. వీరి అనుభవాన్ని, వృత్తి నైపుణ్యాన్ని రాష్ట్ర అభివృద్ధికి వినియోగించుకోవాలి
* విదేశాలలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం రూ.3 లక్షల ఎక్స్ గ్రేషియా (మృత ధన సహాయం) చెల్లించాలి
* గల్ఫ్ తో పాటు సింగపూర్, మలేసియా తదితర దేశాలన్నిటిలో కలిపి తెలంగాణ ప్రవాసులు వివిధ కారణాలతో సంవత్సరానికి 200 కు పైగా చనిపోతున్నారు. వీరిలో కొందరికి అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2 జూన్ 2014 నుండి ఈనాటి వరకు గత 34 నెలల్లో సుమారు 500 మంది తెలంగాణ బిడ్డల మృతదేహాలు శవపేటికలలో హైదరాబాద్ ఏర్ పోర్ట్ కు చేరుకున్నాయి (ఆధారం: శంషాబాద్ ఏర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ వారు జారీ చేసిన ఎన్ఓసి ల ప్రకారం)
* విదేశాల నుండి వచ్చే మృతదేహాలను హైదరాబాద్ ఏర్ పోర్ట్ నుండి వారి స్వగ్రామాలకు తరలించడానికి తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పిస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు నిబంధనను సడలించి అందరికీ అంబులెన్సు ఇవ్వాలి.
* ఏర్ పోర్ట్ లో ఒక హెల్ప్ డెస్క్ (సహాయ కేంద్రం) ఏర్పాటు చేయాలి
* రాష్ట్రం నుండి విదేశాలకు వలస వెళ్ళిన వారి వివరాలను సేకరించడానికి సమగ్రమైన సర్వే నిర్వహించాలి. సర్వే ఖర్చును కేంద్రం సగం భరించడానికి సిద్ధంగా ఉన్నది. సర్వే లో వలసకు కారణాలు, సామాజిక, ఆర్ధిక కోణం, వలస వెళ్ళిన వారి సంఖ్య, వారి విద్యార్హతలు, సాంకేతిక పరిజ్ఞానం, వయస్సు, ఏయే దేశాలకు ఏయే జిల్లాలవారు వెళుతున్నారు అనే విషయాలు తెలుస్తాయి. ఈ సర్వే ఆధారంగా వారి సంక్షేమానికి తగిన ప్రణాళికలు వేయవచ్చు
* తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో విదేశీ వలసలపై అధ్యన కేంద్రాలను నెలకొల్పాలి
* విదేశాలకు వలస వెళ్ళే కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండేవిధంగా ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ప్రవాసి సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. వలస వెళ్ళే కార్మికులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చైతన్య సదస్సులు నిర్వహించాలి
* నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ (న్యాక్) కేంద్రాలను బలోపేతం చేయాలి. నైపుణ్య శిక్షణ కేంద్రాలను ప్రతి సబ్ డివిజన్ కేంద్రాలలో ఏర్పాటు చేయాలి
* మానవ అక్రమ రవాణాను అరికట్టాలి, రిక్రూటింగ్ వ్యవస్తపై నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలి. ఏజెంట్ల ను నియంత్రించాలి
* విదేశీ జైళ్లలో మగ్గుతున్న వారికి న్యాయ సహాయం చేసి, వారి విడుదలకు కృషి చేయాలి
* విదేశాల్లోని భారతీయుల కోసం తక్షణం స్పందించే ఆన్ లైన్ వ్యవస్థ 'మదద్' (కాన్సులార్ సర్వీసెస్ మేనేజ్మెంట్ సిస్టం) ప్రవాసి కుటుంబాలకు అందుబాటులోకి తీసుకరావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్రంలోని అన్ని 'మీ సేవా' కేంద్రాల ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వాలి
* భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ పెన్షన్ సిస్టం (ఎన్ పి ఎస్) లో ప్రవాస భారతీయులందరూ చేరవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అవగాహన సదస్సులు, ప్రచారం కార్యక్రమమాలు నిర్వహించాలి
* ప్రవాసులకు అవార్డులు ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్ర రెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వివిధరంగాలలో విశిష్టసేవలు అందించిన 62 మందికి రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. మొదటి వేడుకల్లో, రెండవ వేడుకల్లో కూడా ప్రవాస తెలంగాణీయుల్ని ప్రభుత్వం విస్మరించింది
జై... తెలంగాణ ! జై ... గల్ఫ్ ! జై... కెసిఆర్ ! జై... కేటీఆర్ !
ఇట్లు:
మీ విధేయులు

తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









