కష్టజీవులకు పన్ను వద్దు ప్రధానికి కెసిఆర్ అభ్యర్ధన
- April 24, 2017
వ్యవసాయ అనుబంధ వృత్తుల ద్వారా సమకూరే ఆదాయానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీని కోరారు. మినహాయింపు వల్ల వృత్తులను ఆధారం చేసుకొని జీవించే సామాన్యులకు మేలు జరుగుతుందని సీఎం వివరించారు. సోమవారమిక్కడ ప్రధాని నరేంద్రమోదీతో సీఎం కేసీఆర్ సుమారు గంటా 20 నిమిషాలు ఏకాంతంగా సమావేశమయ్యారు. ‘‘వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయానికి పన్ను మినహాయింపు అమల్లో ఉంది. గ్రామాల్లో వ్యవసాయ అనుబంధ వృత్తులను ఆధారం చేసుకొని ఎంతో మంది వెనకబడిన వర్గాల వారు జీవిస్తున్నారు. కష్టంతో కూడిన కళాత్మక వృత్తులు నిర్వహిస్తున్నారు. గొర్రెల కాపరులు, మత్స్యకారులు, నేత కార్మికులు, రజక నాయీ బ్రాహ్మణ వంటివారు వివిధ వృత్తులు నిర్వహిస్తున్నారు. వారికొచ్చే ఆదాయంపై పన్ను విధించడం సమంజసం కాదు. మినహాయింపు వల్ల ఆయా కులవృత్తులపై ఆధారపడిన వారికే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికీ తోడ్పడుతుంది. తెలంగాణలో గొర్రెలు, చేపల పెంపకాన్ని, ఇతర కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నాం. బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నాం. భవిష్యత్తులో కుల వృత్తుల ద్వారా రూ.వేల కోట్ల వ్యాపారం జరిగే అవకాశాలు ఉన్నాయి. కష్టజీవులపై పన్నులు విధించడం సమంజసం కాదు’’ అని సీఎం కేసీఆర్ ప్రధాని వద్ద ప్రస్తావించారు.
ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా జీఎస్టీ.. : జీఎస్టీ వల్ల రాష్ట్రాలకు నష్టం కలగకుండా, రాష్ట్ర ఆదాయంపై వ్యతిరేక ప్రభావం లేకుండా, ప్రయోజనాలకు భంగం కలగకుండా చూడాలని సీఎం కోరారు. రాష్ట్రాలకు నష్టం జరగకుండా జీఎస్టీని అమలు చేయడం ద్వారా దేశానికి మేలు జరుగుతుందని మోదీకి వివరించారు.
ముస్లిం రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూలులో చేర్చాలి: ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సామాజిక పరిస్థితి ఉంటుందనీ, అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రధానితో పేర్కొన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు రాజ్యాంగ భద్రత కల్పించే విషయంలో కేసీఆర్ ప్రధాని జోక్యాన్ని కోరారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యారంగంలో వెనకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతూ తీసుకొచ్చిన బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో చేర్చాలనీ, న్యాయపరమైన ఆటంకం తొలగుతుందని పేర్కొన్నారు. ‘‘ఎస్సీ, ఎస్టీల జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉన్నాయి. తెలంగాణలో ఎక్కువగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రిజర్వేషన్ల శాతం పెంచుతూ అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుకు కేంద్రం ఆమోదం కావాలి. రాష్ట్రాల పరిధిలోని విద్యా సంస్థల్లో, నియామకాల్లో రిజర్వేషన్ అంశాన్ని రాష్ట్రాలకే వదిలేయాలి’’ అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో చాలాకాలంగా ఉన్న ఎస్సీ వర్గీకరణ డిమాండుపై కేంద్రం వెంటనే స్పందించి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలి’’ అని కోరారు. విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా తెలంగాణలో శాసనసభ సీట్ల సంఖ్య పెంచాలని విన్నవించారు. హైకోర్టు విభజన వేగవంతం చేయాలన్నారు. కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిధులు విడుదల చేయాలనీ, సచివాలయ నిర్మాణం కోసం పరేడ్ గ్రౌండ్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి వినతులపై ప్రధాని నరేంద్రమోదీ సానుకూలంగా స్పందించారు. సుహృద్భావ వాతావరణంలో ప్రజా సమస్యల పరిష్కారం దిశగా చర్చలు జరిగాయని, సమావేశం ఫలప్రదంగా సాగిందని ముఖ్యమంత్రి తెలిపారు.
భూసేకరణ చట్టాన్ని ఆమోదించాలి..: తెలంగాణ శాసనసభ ఆమోదించిన కొత్త భూసేకరణ చట్టాన్ని ఆమోదించాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను సీఎం కేసీఆర్ కోరారు. సోమవారమిక్కడ తెరాస లోక్‌సభ పక్షనేత జితేందర్‌రెడ్డి, ఉపనేత వినోద్ కుమార్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ తదితరులతో కలిసి కేంద్రమంత్రితో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ చట్టం వల్ల భూ నిర్వాసితులకు తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయనీ, ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం అవుతుందని తెలిపారు. సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఉమ్మడి హైకోర్టును విభజించే ప్రక్రియపైనా సానుకూలంగా స్పందించారు.
నోటిఫికేషన్ జారీ చేయాలి: ఎంపీ వినోద్: తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు విషయంలో కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేసినట్లు తెరాస ఎంపీ వినోద్ తెలిపారు. ఎంపీలు బీబీ పాటిల్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిలో భవనాలు, సచివాలయం, శాసనసభ కూడా నిర్మించారనీ, ఈ నేపథ్యంలోనే హైకోర్టును విభజించాలని ప్రధాని దృష్టికి తీసుకెళ్లామన్నారు.
తాజా వార్తలు
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్‌లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!
- తొలి అంతర్జాతీయ విమాన సర్వీసును ప్రారంభించిన ముంబై నేవీ
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన మూడు ఇరానీ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్లో అమెరికా దాడులు.. ఏడుగురు సైనికులు మృతి
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్ కు వెళ్లొచ్చు







