నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం

- June 04, 2017 , by Maagulf
నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం

భావితరాలకు రక్ష పర్యావరణ పరిరక్షణ 
 *********************************************************************************************
ఐక్యరాజ్యసమితి మొదటిసారిగా పర్యా వరణానికి సంబంధించిన సమావేశాన్ని 1972 జూన్‌ 5-16తేదీలలో స్టాక్‌హాంలో నిర్వహించింది. నాటి నుండి ప్రతి ఏడాది జూన్‌ 5వ తేదీని 'పర్యావరణ దినం'గా పాటిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 1972వ సంవత్సరం నుండి ఐక్యరాజ సమితి జనరల్‌ అసెంబ్లీచే జరుపబడుతోంది. 1973లో తొలి సమావేశం ప్రారంభమైంది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం జూన్‌ 5వ తేదీన ఏదైనా ఒక నిర్ణీత నగరంలో పర్యావరణంపై అంతర్జాతీయ సమా వేశం జరుగుతుంది. 1972లో ఐక్యరాజ్యసమితిచే ప్రారంభించబడిన పర్యావరణ పథకం ఆయా వేదికలను ఉపయోగించుకుని పర్యావరణానికి సంబంధించి ప్రపంచంలోని పలు దేశాలలోగల రాజకీయనాయకులు, పార్టీలు, సేవా సంస్థలు ప్రజ లలో అవగాహన పెంచి పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాయి. 2011 జూన్‌5వ తేదీన మనదేశంలోని న్యూఢిల్లీ ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి వేదిక అయినది. 1973 సంవత్సరం నుండి క్రమం తప్పకుండా ప్రపంచ పర్యావరణ దినోత్సవాలు యు.ఎన్‌. ఆధ్వ ర్యంలో జరుగుతున్నాయి. 1974 సంవత్సరంలో 'ఓన్లీ వన్‌ ఎర్త్‌' ఇతివృత్తంతో ఈ కార్యక్రమం ఏర్పాటుచేశారు. అయితే 1987 సంవత్సరం నుండి పలు దేశాల్లో ఈ పర్యావరణ దినోత్సవాలు ఏర్పాటు చేయడం ప్రారంభమయింది. 1987 సంవ త్సరంలో కెన్యాలోని నైరోబిలో'ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ షల్టర్‌ : మోర్‌ దేన్‌ ఎ రూఫ్‌' అనే ఇతివృత్తంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరగ్గా, 1988 సంవత్సరంలో థారులాండ్‌లోని బ్యాంకాక్‌లో 'వెన్‌ పీపుల్‌ పుట్‌ ద ఎన్విరాన్‌మెంట్‌ ఫస్ట్‌, డెవలప్‌ మెంట్‌ లాస్ట్‌', అనే ఇతివృత్తంతో జరిగింది. 1989లో 'గ్లోబల్‌ వార్మింగ్‌, గ్లోబల్‌ వార్నింగ్‌' అని బెల్జియంలోని బ్రసెల్స్‌లో, 1990లో మెక్సికోలోని మెక్సికో సిటీలో 'చిల్డ్రన్‌ అండ్‌ ద ఎన్విరాన్‌మెంట్‌' అని, 1991లో 'క్లయిమేట్‌ ఛేంజ్‌. నీడ్‌ ఫర్‌ గ్లోబల్‌ పార్టనర్‌షిప్‌' స్వీడన్‌లోని స్టాక్‌హాంలో, 1992లో బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో 'ఓన్లీ వన్‌ ఎర్త్‌, కేర్‌ అండ్‌ షేర్‌' అని, 1993 సంవత్సరం 'ప్రవర్టీ అండ్‌ ద ఎన్విరాన్‌మెంట్‌ వన్‌ ఎర్త్‌ వన్‌ ఫ్యామిలీ' చైనాలోని బీజింగ్‌లోను, 1994 సంవత్సరంలో బ్రిటన్‌లోని లండన్‌లో'వన్‌ ఎర్త్‌ వన్‌ ఫ్యామిలీ' అని, 1995లో దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో 'వురు ద పీపుల్స్‌ : యునైటెడ్‌ ఫర్‌ ద గ్లోబల్‌ ఎన్విరాన్‌ మెంట్‌', 1996లో టర్కీలోగల ఇస్తాంబుల్‌లో 'ఆవర్‌ ఎర్త్‌, ఆవర్‌ హాబిటాట్‌, అవర్‌ హోమ్‌' అని, 1997లో రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియాలోని సియోల్‌లో 'ఫర్‌ లైఫ్‌ ఆన్‌ ఎర్త్‌', , 1998 సంవత్సరం రష్యాలోని మాస్కోలో'ఫర్‌ లైఫ్‌ ఆన్‌ ఎర్త్‌- సేవ్‌ ఆవర్‌ సీస్‌' అని, 1999 సంవత్సరంలో జపాన్‌లో టోక్యోలో 'ఆవర్‌ ఎర్త్‌- ఆవర్‌ ఫ్యూచర్‌- జస్ట్‌ సేవ్‌ ఇట్‌' అని 2000 సంవత్సరం ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో'ద ఎన్విరాన్‌మెంట్‌ మిలీనియమ్‌- టైమ్‌ టు యాక్ట్‌' అని, 2001లో 'కనెక్ట్‌ విత్‌ ద వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ ఆఫ్‌ లైఫ్‌' ఇటలీలోని టొరినొ, క్యూబాలోని హవానా లలోనూ జరిగాయి. 2002 సంవత్సరంలో చైనా లోని షింజైన్‌ 'గివ్‌ ఎర్త్‌ ఎ ఛాన్స్‌' అని, 2003లో 'వాటర్‌-టూ బిలియన్‌ పీపుల్‌ ఆర్‌ డైయింగ్‌ ఫర్‌ ఇట్‌' లెబనాన్‌లోగల బీరుట్‌లో, 2004 సంవత్సరం స్పెయిన్‌లోని బార్సిలోనాలో 'వాంటెడ్‌! సీస్‌ అండ్‌ ఓషన్స్‌- డెడ్‌ ఆర్‌ ఎలైవ్‌?', 2005 సంవత్సరంలో 'గ్రీన్‌ సిటీస్‌- ప్లాన్‌ ఫర్‌ ద ప్లానెట్‌'అని అమెరికాలో గల శాన్‌ ఫ్రాన్సిస్కోలో, 2006లో అల్జీరియాలోగల అల్జీర్స్‌లో 'డిజర్ట్స్‌ అండ్‌ డిజర్టిఫికేషన్‌ - డోంట్‌ డిజర్ట్‌ డ్రైలాండ్స్‌' అని, 2007లో 'మెల్టింగ్‌ ఐస్‌- ఎ హాట్‌ టాపిక్‌?' అని నార్వేలోగల ట్రొమ్‌సొలో, 2008 'కిక్‌ ద హాబిట్‌-టువర్డ్స్‌ ఎ లొ కార్బన్‌ ఎకానమీ' ఇతివృత్తంతో న్యూజిలాండ్‌లో విల్లిం గ్టన్‌లో, 2009 సంవత్సరంలో 'యువర్‌ ప్లానెట్‌ నీడ్స్‌ యు- యునైట్‌ టు కంబాట్‌ క్లయిమేట్‌ ఛేంజ్‌' ఇతివృత్తంతో మెక్సికోని మెక్సికో సిటీలో, 2010 రువాండాలోగల కిగాలిలో 'మెనీ స్పీసిస్‌. వన్‌ ప్లానెట్‌. వన్‌ ఫ్యూచర్‌' ఇతివృత్తంతో జరుగగా, ప్రస్తుతం 2011 సంవత్సరంలో భారత్‌లోని న్యూఢిల్లీలో జరిగింది. 2011 సంవత్సరానికి పర్యావరణ పరిరక్షణకు సంబంధించి 'నేచర్‌ ఎట్‌ యువర్‌ సర్వీస్‌' ఇతివృత్తంగా నిర్ణయించారు.  ప్రకృతిని పరిరక్షించడమంటే మనల్ని మనం రక్షించుకోవడమేకాదు, భావితరాలకు ఆరోగ్యకర మైన జీవితాలను ఇవ్వడం కూడా. నేడు ఎడారు లుగా మారిన పలు ప్రాంతాలు ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడేవని పలువురు శాస్త్రజ్ఞులు గతంలో చాలా సార్లుతెలిపారు. అప్పుడు కొన్ని పొరపాట్లు, తెలియనితనం, దానికి కారణం కావచ్చు. అయితే సాంకేతికంగా విజ్ఞానపరంగా బాగా అభివృద్ధి చెందినా నేడు ఆ పరిస్థితిని మిగిలిన ప్రాంతాలకు రాకుండా చూసుకోవలసిన బాధ్యత అందరిమీద ఉంది. ప్రకృతిలో ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉంది. ఉదాహరణకు నీరు కాలుష్యమైతే దానివల్ల భూమి నిస్సారమవుతుంది. నిస్సారమైన భూమిలో ఏవిధమైన చెట్లు మనలేవు కనుక నేల బీడుపడిపోతుంది. మనిషికి ప్రాణాధార మైన ఆక్సిజన్‌ను చెట్లు వదిలి కార్బన్‌డై ఆక్సైడ్‌ను పీల్చుకుంటాయి. చెట్లే లేనికారణంగా ఆ ప్రభావం మనిషి ఆయుర్దాయంపై పడి క్రమంగా ప్రాంతాలు ఎడారిగా మారిపోతే, మనిషి జీవనకాలం తగ్గి చివరకు అనారోగ్యాల బారిన పడి మరణానికి చేరువవుతాడు.  మనిషి లేకపోయినా చెట్లు, నీరు, గాలి తదితరాలతో నిండి ఉన్న ప్రకృతికి ఏమీకాదు. కానీ ప్రకృతి లేకుంటే మానవ మనుగడే ప్రశ్నార్ధక మవుతుంది. అందుకే ప్రకృతిని సంరక్షించుకోవడం ప్రతి మనిషి బాధ్యత. దానికి ధనిక, పేద, పాలితులు, పాలకులు అన్న తారతమ్యం లేదు. అసలు మనిషి ప్రకృతికి చేసినదానికంటే దాని నుండి మనిషి లబ్ధిపొందుతున్నదే ఇదంతా. అందుకే ప్రకృతి పరిరక్షణ అందరి బాధ్యత.మానవజాతి మనుగడకు ప్రకృతి పరిరక్షణ చాలా ముఖ్యం. ప్రకృతిలో లభించే జల, వాయు, భూమి కాలుష్యం కాకుండా జాగ్రత్తగా చూసు కోవలసిన బాధ్యత మనిషిదే. ఎందుకంటే అవి లేకుంటే మానవ మనుగడే అసాధ్యం. అవి కాలుష్యమైతే మనిషికి మనుగడ లేదు. ఒకప్పుడు ఎక్కడ చూసినా పచ్చదనం కనువిందు చేసేది. జనాభా పెరిగింది అన్న కారణంతో పచ్చని చెట్లను నరికి వాటి స్థానంలో నివాసాలను ఏర్పాటుచేస్తు న్నారు. అలాగే కొన్ని అగ్రదేశాలు పారిశ్రామిక అభివృద్ధి పేరుతో పచ్చదనాన్ని తగ్గించేశాయి. వాటిని చూసి వర్ధమాన, అభివృద్ధి చెందుతున్న దేశాలు పారిశ్రామిక ప్రగతిని సాధించాలన్న థ్యేయంతో పచ్చదనంతో కళకళలాడే గ్రామాలను సైతం ఆక్రమించి పారిశ్రామిక వాడలుగా మార్చి పచ్చదనాన్ని కరువు చేస్తున్నారు. నేడు మండే ఎండల్లో ఒక క్షణం రహదారి ప్రక్కన చెట్టు నీడలో నిలబడాలంటే ఓ చిన్న చెట్టు కూడా కనిపించదు. కొన్ని చోట్ల పారిశ్రామిక కాలుష్యం వల్ల ఆయా ప్రాంతాల్లో కలుపుమొక్కలు కూడా మొలవని పరిస్థితి. దేశ ప్రగతికిపారిశ్రామిక ప్రగతి అవసరం. కానీ దానికై పర్యావరణాన్ని నాశనం చేసుకుంటే ఫలితం ఆ తరంవారే కాదు రాబోయే తరాలు సైతం ఆ దుష్ఫలితాలను అనుభవించవలసి ఉంటుంది. ఈ పారిశ్రామిక ప్రగతిమాటున మరో పర్యావరణ కాలుష్యం ఏర్పడుతోంది. అది నీటి కాలుష్యం. ఇది అధికశాతం పలు పరిశ్రమల వల్ల వస్తున్న, చేస్తున్న కాలుష్యమే. పరిశ్రమల్లో తయారయ్యే పలు వస్తువుల తయారీకి ఉపయోగించే వ్యర్ధాలను గ్రామాలు, పట్టణ ప్రాంతాలలోని తాగే  చెరువుల్లో, మంచినీరు పారే ప్రాంతాల్లో కలిసేలా ఏర్పాటుచేయడంతో ప్రజలఆరోగ్యాన్ని దెబ్బతీసే పలు అనారోగ్యాలకు ప్రధాన కారణంగా మారుతున్నాయి. దీనివల్ల అనారోగ్యంతో పాటు, జలకాలుష్యం కూడా పెరిగిపోతున్నది. ఇలా చేయడానికి కొందరు పెద్దల నిర్లక్ష్యంకారణం కాగా, మరికొందరి ధన వ్యామో హం ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. అలాగే వాయు కాలుష్యం. పరిశ్రమలు వదిలే పలు రసాయన వ్యర్ధాలు గాలిలో  కలిస్తే, వాటివల్ల వచ్చే పొగ తదితరాల వల్ల వాయు కాలుష్యం ఏర్పడి ఊపిరితిత్తులు తదితర అవయవాల అనారోగ్యానికి కారణమవుతున్నది.వీటికి తోడు కొత్త సౌకర్యాలు, కొత్త వస్తువుల తయారీ పేరుతో మరో పర్యావరణ సమస్య ఏర్పడింది. ఉదాహరణకు ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులు, సంచులు. నేడు అన్నిదేశాల్లో కూడా ఈ సంచులను వాడు తున్నారు. సౌకర్యాల పేరుతో అభివృద్ధి చెందిన దేశాలు ఇటువంటి వస్తువులను రూపొందించి కొంతకాలం ఉపయోగించి అవతల పారవేయడం చేస్తారు. అవి భూమిలో కలిసిపోక నదీ, సముద్ర జలాల్లోకి ప్రవేశించి  లేదా డ్రైనేజీల్లో కూరుకు పోయి ప్రవాహ వ్యవస్థ దెబ్బతినడానికి కారణమవు తున్నాయి. అవేే మనదేశంలో ఎన్నోసార్లు పశువుల మరణానికి కూడా కారణమవుతున్నాయి. ఇవి ఇప్పుడు పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి కనుక వాటిని నిషేధించాయి చాలా దేశాలు. మరికొన్ని దేశాలు నిషేధించే పనిలో ఉన్నాయి. పారిశ్రామిక ప్రగతి కనుగుణంగా వాతావరణ కాలుష్యం కూడా పెరుగుతూ వస్తున్నది. జల, వాయు, భూ కాలుష్యాలు మనుషుల జీవితాలను దుర్భరం చేస్తున్నాయి. పర్యావరణానికి ఆరోగ్యానికి అవినాభావ సంబంధమున్నది. ఐ.రా.స ఈ దినోత్స వం సందర్భంగా ప్రతి ఏటా ఒక లక్ష్యాన్ని నిర్దేశించు కుని ఆ దిశగా పర్యావరణ ప్రగతికోసం కృషి చేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా 10లక్షలకు పైగా ఆదివాసీ తెగలు, ప్రజలు అడవులపై, ఆహార, వాణిజ్య పంట లపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. పారిశ్రామికీకరణ పేరుతో అడవు లను నరకటం, పంట పొలాలను సైతం వ్యాపారాల పేరుతో ఇతర అవసరాలకు ఉపయోగించడం వల్ల ఆహార సమస్యతోపాటు, ప్రత్యక్షంగా లక్షల కుటుంబాలు జీవనోపాధి కోల్పోడానికి కారణమవుతున్నది. ఇటువంటి కారణాలకు చదువుకున్న, మేధావులని చెప్పుకునే వారే కారణం కావడం విచారించదగ్గ విషయం. ఇలా చేయడంపై ఎంతోమంది తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్రత్యక్ష నిరసనను తెలుపుతున్నారు. అలాగే గతంలో సముద్ర జలాలు కలుషితం కావడం వల్ల తాబేళ్ళు, పలురకాల చేపలు వంటి సముద్ర జీవరాశులు లక్షల సంఖ్యలో మరణించిన విషయం తెలిసిందే. ఇటువంటి సంఘటనలను బట్టి ప్రగతి పేరుతో ప్రకృతిని నాశనం చేయడం ఎంతవరకు సమంజసం అన్నది అందరూ ఆలోచించాల్సిన విషయం. అడవితల్లి బిడ్డలుగా చెప్పుకునే ఎన్నో తెగలు నేటికీ అడవులను, అక్కడి సాధుజంతువులను కాపాడుతూ వాటికోసం ప్రభుత్వాలతో సైతం పోరాడుతున్నాయి. దీనికై స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వాలు, పారిశ్రామిక వేత్తలు కలిస్తే వారితో సామాన్యులు చేయి కలిపి ముందుకు సాగేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అందుకోసం పర్యావరణ పరిరక్షణను ఓ దీక్షగా స్వీకరించాలి. అందుకోసం పరిసరాల పరిశుభ్రత, చెట్ల పెంపకం, నీటిని జాగ్రత్తగా వాడుకోవడం, ప్లాస్టిక్‌ వంటి హానికారక పదార్ధాల తయారీని మానుకోవడం, లేదా నిషేధించడం చేయాలి. పాఠశాలల్లో చదివే చిన్నారులకు సైతం పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది. ఎవరికి తోచిన రీతిలో వారు ప్రకృతిని సంరక్షించాలి. అది ప్రకృతి కోసం కాదు. మనందరి కోసం. భావితరాల కోసం. మనిషి మనుగడకోసం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com