ఇజ్రాయిల్లో ఐఎస్ ఉగ్రవాదల తొలి దాడి

- June 16, 2017 , by Maagulf
ఇజ్రాయిల్లో ఐఎస్  ఉగ్రవాదల తొలి దాడి

 తమ అరాచక చర్యలతో ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ.. తాజాగా మరోదాడికి పాల్పడింది. ఇజ్రాయిల్ రాజధాని జెరూసలెంలోని ఓల్డ్సిటీ శివారులో ఓ మహిళా పోలీస్ అధికారిని ముగ్గురు దుండగులు అతి దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. అనంతరం ముష్కరులను పోలీసులు కాల్పులు జరిపి హతమార్చారు. అయితే ఈ దాడి గురించి ఐఎస్ ఆన్లైన్లో పోస్టుచేసింది. ‘యూధులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడిలో ఓ మహిళా పోలీస్ను కత్తితో పొడిచి హతమార్చాం’ అని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. అయితే ఇది చివరి దాడి కాదని.. ఇంకా ఇలాంటి దాడులు చేస్తూనే ఉంటామని ఐఎస్ పేర్కొంది. కాగా.. ఇజ్రాయిల్లో ఐఎస్ దాడికి పాల్పడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
జెరూసలెంలోని అల్ ఆఖ్సా మసీదు సమీపంలో శుక్రవారం రాత్రి దాడి జరిగింది. ముగ్గురు ఆగంతకులు పోలీసులపై దాడి చేశారు. ఇందులో ఇద్దరు కాల్పులకు పాల్పడగా.. మూడో వ్యక్తి హదస్ మల్కా అనే మహిళా పోలీసును కత్తులతో పొడిచాడు. అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులకు పాల్పడి ముగ్గురు దుండగులను మట్టుబెట్టారు. తీవ్రంగా గాయపడిన హదస్ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయారు.
దాడికి పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుంది. అయితే దాడి చేసింది ఐఎస్ ఉగ్రవాదులు కాదని, పాలస్తీనాకు చెందిన సున్నీ-ఇస్లామిక్ ఆర్గనైజేషన్ హమస్ చెబుతోంది. స్థానిక తిరుగుబాటు దారులో కాల్పులకు పాల్పడినట్లు హమస్ పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com