APNRI మినిస్టర్ కొల్లు రవీంద్ర తో ముఖాముఖి

- June 16, 2017 , by Maagulf
APNRI మినిస్టర్ కొల్లు రవీంద్ర తో ముఖాముఖి

APNRI మినిస్టర్ కొల్లు రవీంద్ర తో ముఖాముఖి

ప్ర) గల్ఫ్‌ దేశాల్లోని తెలుగువారిలో ఎక్కువమంది కార్మికులే. వారెదుర్కొంటున్న అనేక సమస్యలకు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున మీరు చూపాలనుకుంటున్న పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా? 


జ) ప్రజల వద్దకు పాలన అనే నినాదంతో గౌ.శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన మహత్తర పథకమే ఈ 'ఏపీఎన్ఆర్టీ'. నియమింపబడిన ఏపీఎన్ఆర్టీ కోఆర్డినేటర్స్ గల్ఫ్ లోని కార్మికుల అనేక సమస్యలను పరీక్షించి అక్కడి భారత రాయబార కార్యాలయంతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మరియు ఆంధ్ర సర్కారు కూడా సానుకూలంగా స్పందిస్తోంది. 


ప్ర) కేంద్ర ప్రభుత్వం గల్ఫ్‌ దేశాల్లోని భారత కార్మికుల పట్ల ప్రత్యేకమైన దృష్టిపెట్టింది. కేంద్రంతో, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ విషయమై ఎలాంటి సంప్రదింపులు జరుపుతోంది? 


జ) గత కొన్ని సంవత్సరాలుగా మీరు చూసినట్లయితే కార్మికుల సమస్యలు ఇంత వెలుగు చూసిన సందర్భాలు అతి తక్కువ. దీనికి కారణం గల్ఫ్ దేశాలకు భారత ప్రభుత్వంతో నేరుగా సంప్రదింపులు జరిపే ఒక వేదిక లేకపోవటమే. ఈ సమస్యను అర్ధం చేసుకున్న ఆంధ్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నారై సెల్, లైసెన్సుడ్ ఏజెంట్స్ నియామకం లాంటివి చేపట్టి భారత కార్మికుల పట్ల సానుకూలంగా స్పందిస్తోంది.


ప్ర) గల్ఫ్‌ దేశాలకు ఆదాయార్జన కోసమే ఎక్కువమంది కార్మికులు వెళుతుంటారు. దురదృష్టవశాత్తూ వారిలో చాలామంది ఏజెంట్ల చేతిలో మోసాలకు గురవుతున్నారు. అలాంటి మోసాలకు చెక్‌ పెట్టేందుకు మీరేమైనా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారా? 


జ) ఈనాడు ప్రపంచంలోని అన్ని దేశాలతో పోలిస్తే కార్మికుల సమస్యలు ఎక్కువగా గల్ఫ్ లో నమోదయ్యాయి. దీనికి ప్రధాన కారణం అవగాహనాలోపం. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 'ఆథరైజ్డ్ ఏజెంట్స్' ను నియమించటం జరిగింది. ఈ ఏజెంట్స్ ద్వారా గల్ఫ్ వెళ్లిన కార్మికులకు భరోసా ఇస్తుంది ఆంధ్ర ప్రభుత్వం. కార్మికుల్లో అవగాహన కల్పించే దిశగా గల్ఫ్ లో ప్రభుత్వం చే నియమింపబడిన ఏపీఎన్ఆర్టీ కోఆర్డినేటర్స్ తమవంతు కృషి చేస్తున్నారు.


ప్ర) రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్న గన్నవరం విమానాశ్రయం అంతర్జాతీయ హోదా దక్కించుకుంది. గల్ఫ్‌ దేశాలకు గన్నవరం నుంచి విమానాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? 


జ) రాజధాని పరిధి లో ఉన్న గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించి తెలుగు వారి ప్రయాణాన్ని మరింత సులువు చేసారు ముఖ్యమంత్రి శ్రీ.నారా చంద్రబాబు నాయుడు గారు. గల్ఫ్ కు అతిత్వరలో సర్వీసెస్ ప్రారంభమవనున్నాయి. అలాగే 'వీసా ఆన్ అరైవల్' ను కూడా ప్రవేశపెట్టాలనే సదుద్దేశ్యంతో గల్ఫ్ ప్రభుత్వంతో కేంద్ర మరియు ఆంధ్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నాయి. త్వరలో ఇది కార్యరూపం దాల్చుతుంది అని ఆశిద్దాము.


ప్ర) కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్న ఎన్నారైల కోసం ఎలాంటి ప్రత్యేక అవకాశాలు కల్పిస్తున్నారు? 


జ) విదేశాల్లో నివసిస్తున్న తెలుగు వారు తమ పుట్టిన గడ్డకు సహాయం అందిస్తున్నారు. వీరికి 'ఏపీఎన్ఆర్టీ' అనే విభాగం పేరున పలు సదుపాయాలు అందించటం జరుగుతోంది. ఏపీఎన్ఆర్టీ ద్వారా పొందనున్న సదుపాయాలేమిటో వెబ్సైటు నందు చూడగలరు. ఇవి మాత్రమే కాకుండా ఎన్నారై లకు ఎలాంటి అవసరమొచ్చినా ఆంధ్ర ప్రభుత్వం తక్షణమే సహాయం అందించటానికి సిద్ధంగా ఉంది. 


ప్ర) ఎన్నారై వ్యవహారాల శాఖను సమర్థవంతంగా నిర్వర్తించడంలో మీరు చూపుతున్న ప్రత్యేకమైన శ్రద్ధ ఏమిటి?


జ) నేడు ప్రపంచం అత్యాధునిక టెక్నాలజీ ని వాడి ఎంతో అభివృద్ధి చెందుతోంది. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు సమస్యలను ఏపీఎన్ఆర్టీ కోఆర్డినేటర్స్ ద్వారా తెలుసుకుంటూ త్వరగా పరిష్కరించే దిశగా పని చేస్తున్నాం. దీని ద్వారా తక్కువ వ్యవధిలో ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com