'పెళ్లికి ముందు ప్రేమకథ' రివ్యూ

- June 17, 2017 , by Maagulf
'పెళ్లికి ముందు ప్రేమకథ' రివ్యూ

రివ్యూ        : పెళ్లికి ముందు ప్రేమకథ

తారాగణం        : చేతన్, సునైన, తాగుబోతు రమేష్, శివప్రసాద్, సత్య తదితరులు 
సంగీతం        : వినోద్ యాజమాన్య
సినిమాటోగ్రఫీ    : పి.సి. కన్నా
నిర్మాతలు        : సుధాకర్ పట్నం, అవినాష్ సలంద్ర
రచన, దర్శకత్వం    : మధు గోపు
విడుదల తేదీ        : 16.06.17
కొన్ని సినిమాలు టైటిల్స్ నుంచే ఆకట్టుకుంటాయి. అవి కొంత పెడర్థాల్లా కనిపించినా నిగూఢార్థాలూ ఎక్కువగానే ఉంటాయి కాబట్టే అవి అట్రాక్ట్ చేస్తాయి. ఈ పెళ్లికి ముందు ప్రేమకథ కూడా అలా ఆకట్టుకున్నదే. సినిమాలో స్టార్స్ లేకపోయినా టీజర్, ట్రైలర్స్ అండ్ సాంగ్స్ తో ప్రామిసింగ్ గా కనిపించింది. మరి రిలీజ్ కు ముందు ఇంట్రెస్ట్ పెంచిన పెళ్లికి ముందు ప్రేమకథ రిలీజ్ తర్వాత ఎలా ఉందో చూద్దాం..
కథ    : 
సంతోష్(చేతన్) అనే ఓ అందమైన కుర్రాడి కలలోకి ఓ ఊహాసుందరి తరచూ వస్తుంది.. రావడమే కాదు.. ఆ కలలో అతనికి ఓ ఫోన్ నెంబర్ కూడా ఇస్తుంది. ముందు పట్టించుకోకున్నా తర్వాత ఆ నెంబర్ ను ఫోన్ చేస్తాడు. ఆశ్చర్యంగా ఆ నెంబర్ తో నిజంగానే తన డ్రీమ్ గాళ్ ఉంటుంది.. తన పేరు అనూ(సునైన). ఆమెకు దగ్గరకావాలని చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఆఖరికి అవి ఫలించి కలిసే టైమ్ కు నీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి కాబట్టి.. నా మొహం చూపించకుండా కొన్నాళ్లు ‘స్కార్ఫ్’ తోనే కలుస్తానంటుంది. తను అలా చెప్పేసరిని నేను మాత్రం ఎందుకు మొహం చూపించాలని తనూ స్కార్ఫ్ తోనే వెళతాడు సంతోష్. కలవడానికి ముందే ఇద్దరూ పేర్లు కూడా మార్చి చెప్పుకుంటారు.. కానీ కొన్ని రోజుల్లోనే వీరు ఒకరి మొహం ఒకరు చూడకుండానే విడిపోతారు. కట్ చేస్తే ఓ పెళ్లిలో అనూను చూసిన సంతోష్ ఫస్ట్ లుక్ లోనే ప్రేమలో పడతాడు. అట్నుంచి తనూ ఒప్పుకోవడంతో పెళ్లి కూడా చేసుకుంటారు. మరి పెళ్లి తర్వాత వీరి పాత ప్రేమకథ గురించి తెలుసుకున్నారా.. అప్పుడు ముసుగు వేసుకుని కలుసుకుంది తామే అని ఈ జంట ఎలా తెలుసుకుంది అనేది మిగతా కథ. 

విశ్లేషణ    : 
టైటిల్ ఆకట్టుకునేలా ఉంది. సినిమా కూడా అలాగే ఉంటుందనుకుని వెళితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా మాగ్జిమం ఈ కథ మెప్పిస్తుంది. సింపుల్ లవ్ స్టోరీని సర్ ప్రైజింగ్ ట్విస్ట్ తో ఇంటర్వెల్ వేసి.. ఆ తర్వాత మూడుముళ్ల బంధంతో కలిపి పాత ప్రేమకథను ముందుంచి.. ఇద్దరు ప్రేమికుల కన్ఫ్యూజనే ఈ సినిమా. అఫ్ కోర్స్.. ఆఖర్లో ఆ కన్ఫ్యూజన్ కు క్లారిటీ కూడా వస్తుందనుకోండి. కానీ ఈ కాలంలో ఇలాంటి ప్రేమికులుంటారా అనేదే ప్రశ్న. ఆ ప్రశ్నను పక్కనబెడితే..పెళ్లికి ముందు.. తర్వాతా ఈ ప్రేమకథ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇందులో నటించిన జంట బావుంది. బాగా నటించారు కూడా. దీంతో కొన్ని సీన్స్ లో డ్రా బ్యాక్  ఉన్నా వారి నటనతో వాటిని కవర్ చేశారు. కలలో కనిపించిన ఊహా సుందరి ఇలలోనూ ఉండటం.. ఆమె కోసం ఆరాటపడటం.. మనం పెళ్లి సందడి సినిమాలో చూశాం. కానీ అది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇందులో ఆ ఛాయలు కనిపించినా.. వీరి డ్రీమ్ గాళ్ ఈ కాలంలో ఉంటుంది. సాఫ్ట్ వేర్ ఎంప్లాయీ. అయినా హద్దులు తెలిసిన అమ్మాయి. అందుకే ఫోన్ లో పరిచయం కాగానే వెంటనే వాలిపోకుండా ముందు నీ గురించి తెలుసుకోవాలి. అందుకే స్కార్ఫ్ కట్టుకు వస్తానంటుంది. అదేమంటే.. ఒకవేళ నువ్వు మంచి వాడివి కాకపోతే తర్వాత నాపై యాసిడ్ పోస్తే.. నాగురించి నెగెటివ్ గా చెబితే ఎలా .. అందుకే ముందు జాగ్రత్త అంటుంది. ఇలాంటి జాగ్రత్తలు కొన్ని దర్శకుడు కూడా తీసుకుని ఉంటే సినిమా ఇంకా బావుండేదేమో.. ఎందుకంటే డ్రీమ్ గాళ్ కోసం వెయిట్ చేసి.. ఆమెను దక్కించుకున్న హీరో ఓ ‘‘గుళ్లో కక్కుర్తి’’ పడటం.. ఈ రోజు ఎలాగైనా ‘దీన్ని వదలకూడదు’ అనుకోవడం ఆ పాత్ర ఔచిత్యాన్ని దెబ్బతీస్తాయి. అఫ్ కోర్స్ అతను అలా బిహేవ్ చేసేసరికి హీరోయిన్నూ నువ్వూ అందర్లాంటివాడివే అంటూ అతన్ని చీదరించుకుని వెళ్లిపోతుంది. ఇది ఇంటర్వెల్ బ్యాంగ్. 
కట్ చేస్తే మనోడు ఓ పెళ్లిలో అనూను చూసి ప్రేమలో పడతాడు. అట్నుంచి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండటంతో అందరినీ మెప్పించి పెళ్లి చేసుకుంటారు. కానీ ఈలోగా నీ మాజీ లవర్ ను అంటూ అతని పాత లవర్ మళ్లీ స్కార్ఫ్ తో సీన్ లోకి వస్తుంది. మరి అప్పుడు హీరో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడనేదీ..ఈ చిక్కుముడి ఎలా వీడిందనే విషయాలు ప్రేక్షకుల్ని పెద్దగా పరీక్షించకుండానే.. అతని ఊహలకు అనుగుణంగా సాగుతూ ఎండ్ కార్డ్ వరకూ వెళ్లిపోతాయి. మధ్యలో శివ ప్రసాద్, తాగుబోతు రమేష్, సత్య, రాకేష్ లతో పాటు కొందరు జబర్దస్త్ మెంటాలిటీని వదలని కమెడియన్స్ చేసిన చీప్ కామెడీ కూడా ఉంంటుంది.. ఏదేమైనా పెళ్లికి ముందు ప్రేమకథ.. పెళ్లి తర్వాత ప్రేమకథా ఒక్కటే అని తెలుసుకున్న ఆ జంట హ్యాపీగా ఎండ్ కార్డ్ వేయడం బావుంది.. 
ఆర్టిస్టుల్లో చేతన్, సునైన తప్ప ఎవరూ ఆకట్టుకోలేదు. కమెడియన్స్ లో ఇన్స్ పెక్టర్ దయాగా తాగుబోతు రమేష్, డాన్ గా సత్య ఫర్వాలేదనిపిస్తారు. ఇతర పాత్రలేవీ పెద్దగా గుర్తుండేవి కాదు.. గుర్తుపెట్టుకునేంత సన్నివేశం కూడా లేదు..
టెక్నికల్ గా 
పెళ్లికి ముందు ప్రేమకథ టెక్నికల్ గా మ్యూజిక్ బావుంది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. డిఎస్ రావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ఈ మూవీ దర్శకుడు మధు గోపులో యూత్ పల్స్ తెలిసిన లక్షణాలు బాగా ఉన్నాయి. మొత్తంగా అన్ని ఎలిమెంట్స్ ఉన్న పెళ్లికి ముందు ప్రేమకథ వాచబుల్ మూవీగా వీకెండ్ లో ఫస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. 
ఫైనల్ గా    : ఆకట్టుకునే పెళ్లికి ముందు ప్రేమకథ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com