నాజర్ చేతిలో శరత్ కుమార్ పరాజయం

- October 19, 2015 , by Maagulf
నాజర్ చేతిలో శరత్ కుమార్ పరాజయం

ఎప్పుడూ ప్రశాంతంగా జరిగే సినీ నట సంఘాల ఎన్నికలు ఇటీవల సాధారణ ఎన్నికల్లానే మారిపోతున్నాయి. మొన్నటికి మొన్న మా ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్ ప్యానల్, జయసుధ ప్యానల్ మధ్య అసెంబ్లీ ఎన్నికలను మించిన ఎత్తులు-పైఎత్తులు సాగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలోనూ సేమ్ సీన్ రిపీటైంది. కొన్నిరోజులుగా తమిళ సినీ ఇండస్ట్రీలో ఈ ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న శరత్ కుమార్ పై విశాల్ ప్యానల్ నాజర్ ను పోటీకి దింపడంతో వార్ ఆసక్తికరంగా తయారైంది. ఆ తరువాత ఒక ప్యానెల్ పై మరో ప్యానల్ ఆరోపణలతో సినీరాజకీయాలు వేడెక్కాయి. శరత్ కుమార్ అవినీతికి పాల్పడ్డారని విశాల్ టీమ్ ఆరోపణలు గుప్పించింది. అనూహ్యంగా తమిళ సినీ రాజకీయాల్లో అడుగుపెట్టి విశాల్ కొద్దికాలంలోనే అందరి మద్దతు సంపాదించగలిగాడు. అత్యంత రసవత్తరంగా.. సస్పెన్స్ గా జరిగిన ఈ ఎన్నికల్లో చివరకు శరత్ కుమార్ ప్యానెల్ పై విశాల్ ప్యానెల్ విజయం సాధించింది. నడిగర్ సంఘం అధ్యక్షుడిగా నాజర్, ప్రధాన కార్యదర్శిగా విశాల్ ఎన్నికయ్యారు. నాజర్ చేతిలో ప్రస్తుత అధ్యక్షుడు శరత్ కుమార్ ఓడిపోయాడు. నాజర్‌కు 1334 ఓట్లు,శరత్‌కుమార్‌కు 1231 ఓట్లు వచ్చాయి. ప్రధాన కార్యదర్శి పదవికి జరిగిన పోటీలో రాధారవిపై విశాల్ ఘన విజయం సాధించాడు. విశాల్‌కు 1445 ఓట్లు, రాధారవికి 1138 ఓట్లు వచ్చాయి. పోలింగ్ సందర్భంగా కొద్దిపాటి హింస కూడా జరిగింది. విశాల్‌పై కొందరు దాడికి దిగడంతో ఆయన చేతికి గాయమైంది. పోలీసుల జోక్యంతో మొత్తానికి ఎన్నికలు ప్రశాంతంగా సాగాయి. విశాల్ తమిళ నటుడైనా అతడు మన తెలుగోడే.. ఆయన తండ్రి జీకె రెడ్డి అనేత తెలుగు, తమిళ చిత్రాలు నిర్మించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com