ఉద్యమ నాయకుడి నుంచి ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు ప్రయాణం

- July 17, 2017 , by Maagulf
ఉద్యమ నాయకుడి నుంచి ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు ప్రయాణం

తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టు, ఆపై తెలుపు చొక్కా.. పెదాలపై ఎప్పుడూ తొణికిసలాడే చిరునవ్వు... తన దగ్గరకు ఎవరొచ్చినా ఆప్యాయంగా పలకరించే తత్వం. గ్రామీణ ప్రాంతంలో పుట్టి జాతీయ నేతగా ఎదిగిన ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలుగు ఖ్యాతిని ప్రపంచ నలుదిశలా వ్యాపింపజేశారు. విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్న ఆయన చదువుకున్న విశ్వవిద్యాలయానికే చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అక్కడి నుంచి ప్రారంభమైన వెంకయ్య ప్రస్థానం బీజేపీ జాతీయ అధ్యక్ష స్థాయికి చేరింది. కేంద్ర, రాష్ట్రస్థాయిల్లో ఎన్నో పదవులు చేపట్టిన వెంకయ్య మోదీ కేబినెట్‌లో కీలక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 
నెల్లూరు జిల్లా చౌటపాలెం 1949 జులై 1న వెంకయ్య నాయుడు జన్మించారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల పట్ల మక్కువ చూపే వారు. వీఆర్ కళాశాలలో డిగ్రీచదివాక, విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్సిటీలో లా డిగ్రీ చేశారు. 1972-73లో ఆంధ్రా యూనివర్సిటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యూనియన్ చైర్మన్ల మహాసభ విజయవాడలో ఏర్పాటు చేశారు. క్షేత్ర సంఘర్షణ సమితి విద్యార్థి విభాగం చైర్మన్‌గా ఎన్నికయ్యారు. జై ఆంధ్రా ఉద్యమంలో జై ఆంధ్రా ఫ్రంట్ తరపున ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ప్రచార విభాగం చైర్మన్‌గా పనిచేశారు. 1973-74లో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శిగా పని చేశారు. 1976లో ఎమర్జన్సీలో మీసా చట్టం కింద పదిహేడున్నర నెలలు పాటు జైలు జీవితం గడిపారు. అదే సంవత్సరంలో రాష్ట్ర జనతా అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1977లో ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేశారు. 1978లో ఉదయగిరి అసెంబ్లీకి పోటీ చేసి జిల్లాలో ఏకైక జనతా పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. 1978 నుంచి 1983 వరకు శాసన సభలో బీజేపీ శాసన పక్ష నాయకుడిగా ఉన్నారు. అప్పుడు వివిధ సమస్యలపై పోరాడి అసెంబ్లీ టైగర్‌గా పేరు తెచ్చుకున్నారు వెంకయ్య. 1980లో బీజేపీ ఆవిర్భావంతో బీజేవైఎం అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1983లో తిరిగి ఉదయగిరి నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1985లో ఆత్మకూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1989లో బాపట్ల నుంచి 1991లో హైదరాబాద్ పార్లమెంట్‌కు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1986లో ఉమ్మడి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. జన సంఘ్ పెట్టినప్పటి నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. 1998లో కర్నాటక నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు.2002 -04లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 1999 నుంచి 2004లో  దాకా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు కార్యదర్శిగానూ, బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కార్యదర్శిగానూ, బీజేపీ అధికార ప్రతినిధిగానూ బాధ్యతలు నిర్వహించారు. 
విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్న వెంకయ్య నాయుడు స్వయం శక్తితోనే ఇంత స్థాయికి ఎదిగారు. జై ఆంధ్రా ఉద్యమంలో వెంకయ్య చురుగ్గా పాల్గొన్నారు. మంచి వ్యక్తిగానూ, వక్తగాను.. గంటలపాటు ప్రసంగించగల వాగ్ధాటి ఆయన సొంతం. సభికులను క్షణం పాటు కూడా కదలనీయకుండా మాట్లాడగలిగే చతురత వాగ్దాటిని అలవరుచుకున్నారు. మహానేత నందమూరి తారక రామారావు వెంకయ్యను TDPలోకి రావాలని పలుమార్లు ఆహ్వానించినా.. సిద్ధాంతాలకు కట్టుబడి బీజేపీలోనే ఉన్న విలువలు గలిగిన నేత. NTR, ఇందిరాగాంధీల ప్రభంజనాలను తట్టుకుని నిలబడి తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బతికించిన నాయకుడిగా వెంకయ్యను కీర్తిస్తారు. దక్షిణ భారతదేశం నుంచి బీజేపీకి అత్యంత కీలక నేతగా ఎదిగారు. తమిళ, కర్నాటక రాష్ట్రాల్లోని రాజకీయ సంక్షోభాలను తన చతురతతో పరిష్కరించగలిగిన నేతగా నిరూపించుకున్నారు. దేశ వ్యాప్తంగా ఎక్కడ సంక్షోభం తలెత్తినా.. వెంకయ్య ఆలోచనలే కీలక పాత్ర పోషించాయి. మొన్నటి ప్రధాన అభ్యర్థిగా మోడీ నుంచి నిన్నటి రాష్ట్రపతి అభ్యర్థి కోవింద్‌ వరకూ ఎంపిక కమిటీల్లో అత్యంత కీలక పాత్ర పోషించారు.
దేశ రాజకీయాల్లో మాటల మాంత్రికుడుగా పేరు తెచ్చుకున్న తెలుగు తేజం ముప్పవరపు వెంకయ్య నాయుడు మోడీ కేబినేట్ లో పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్నారు. నెల్లూరు జిల్లాలోని చవట పాలెంకు చెందిన వెంకయ్య నాయుడు రాజస్థాన్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. కేంద్రంలో రెండోసారి మంత్రి పదవి అధిష్టించారు. వాజ్ పేయి ప్రభుత్వం లో గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా విశేష సేవలందించిన వెంకయ్య ఆ తర్వాత పదేళ్ల పాటు దేశ వ్యాప్తంగా ఊరూరూ తిరిగి బీజేపీ బలోపేతానికి అహర్నిషలు పాటుపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com