సైదాబాద్‌కు చెందిన వెంకటమ్మను వీసాతో దుబాయ్ తీసుకెళ్లారు...చిత్రహింసలు పెట్టారు

- July 17, 2017 , by Maagulf
సైదాబాద్‌కు చెందిన వెంకటమ్మను వీసాతో దుబాయ్ తీసుకెళ్లారు...చిత్రహింసలు పెట్టారు

విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం
నకిలీ కన్సెల్టెన్సీలతో నిరుద్యోగులకు గాలం
ఇద్దరి అరెస్టు.. పరారీలో ముగ్గురు
 విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని అమాయకులను మోసగిస్తున్న ఇద్దరు దళారులను సోమవారం అరెస్ట్‌ చేసినట్లు టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ బి.లింబారెడ్డి తెలిపారు. నగరంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన రాజు(46), మహ్మద్‌ షౌకత్ అలీ (40), నసీర్‌ స్నేహితులు. ముంబైకు చెందిన సలీం అక్కడే గోల్డెన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో కన్సల్టెన్సీ ఏర్పాటుచేశారు. దుబాయ్‌, సౌది ఆరేబియా దేశాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ ప్రచారం చేసేవాడు. ముగ్గురు స్నేహితులను సలీం ఏజెంట్లుగా నియమించకున్నాడు. వారి ద్వారా హైదరాబాద్‌, రంగారెడ్డి ప్రాంతాల్లో ప్రచారం చేయించాడు. పాస్‌పోర్ట్‌, వీసా ఖర్చుల కోసమంటూ ఒక్కొకరి నుంచి రూ. 90 వేల నుంచి రూ1.20 లక్ష వరకు వసూలు చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో సైదాబాద్‌కు చెందిన వెంకటమ్మ అనే మహిళను వర్క్‌ వీసాతో దుబాయ్‌ పంపించారు. అక్కడికి వెళ్లేముందు మంచి ఉద్యోగం, వసతి ఉండే విధంగా ఉద్యోగం ఇప్పిస్తామని పంపించారని, అక్కడికి వెళ్లిన తర్వాత రోజే చిత్రహింసలు పెడుతున్నారని తన భర్తకు ఫోన్‌ ద్వారా ఆమె సమాచారం అందించింది. వెంకటమ్మ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నకిలీ కన్సెల్టెన్సీ బాగోతం వెలుగులోకి వచ్చింది. రాజు, షౌకత్ అలీలను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి వారి వద్ద నుంచి 3 పాస్‌పోర్టులు, డాక్యుమెంట్స్‌ స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
మల్లెపల్లికి చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ ఖుద్దుస్‌, నసీర్‌, ముంబాయికి చెందిన సలీమ్‌ పరారీలో ఉన్నట్లు డీసీపీ లింబారెడ్డి పేర్కొన్నారు. నిందితులను సైదాబాద్‌ పోలీసులకు అప్పగించారు. టాస్క్‌ఫోర్స్‌ తనిఖీల్లో ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.మోహన్‌కుమార్‌, ఎస్సైలు ఎ.సుధాకర్‌, కె.శ్రీనివాస్‌, ఎస్‌.సైదాబాబు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com