నష్ట జాతకులు

- October 20, 2015 , by Maagulf

ఏం తింటాడో ఎక్కడ పడుకుంటాడో తెలియదు 

మాసిన గెడ్డం మురికి బట్టలు అతని ఆకారం .. 

గూడు వదలిన ఒంటరి పక్షిలాటి జీవితం 

ఊరు ఊరoతా కలియ తిరుగుతాడు 

కనిపించిన వారికల్లా సలాం నమస్తే చెబుతూ 
వరుసలు మరువకుండా బావా బాపు మామ 
అంటూ ప్రేమగా పిలుస్తాడు... 

పళ్ళికిలిస్తూ అడ్డు తిరిగి మరీ వసూలు చేస్తాడు 
పదో ఇరవయ్యో .. 

గత జన్మ బాకీ ఉన్న జ్ఞాపకమేదో గుర్తు చేస్తూ ... 

పొద్దెక్కుతూ ఉంటే,, తన లేని గాయాలను 
తిరగ తోడుకుంటూ ..  

ఎవరెవరినో తిట్టుకుంటూ ఉన్మాది అయి ఊగి పోతుంటాడు .. 

మసకవుతున్నా కొద్ది ... తన ముద్దు ముద్దు  
మాటలతో పసివాడైపోతాడు ..  

తడబడుతున్న నడకలతో కొద్ది కొద్దిగా కనుమరుగవుతాడు 
మా ఊరి సూరీడు ... 

అయ్యో .. సూరీడంటే సూరీడే అతను "సారా" రక్కసితో 
గుండెనూ .. కాలేయాన్ని కాల్చుకు మండే అభాగ్య సూరీడు...  

బెల్టు షాపులో బే షరం గా త్రాగి తనకు తెలిసిన తత్వమేదో 
గొణుక్కుంటూ ఆరి పోయే దీపంలా వెళ్ళే .. 

ఇంటిల్లిపాదిని మరిచి అనాధలను చేసే మా ఊరి సూరీడు ,,

ఏటేట ఎలక్షన్ల కోసం ఎదిరి చూసే అల్ప సంతోషి అయిన 
సూరీడు ,,అతనికి జతగా ఇప్పుడు  .. 

ఊరు ఊరంతా వెలసిన నాగరిక సురాపాన సూరిల్లు ... ఊరూర
వేళ్ళూనుకున్న  వేల వేల సూరిల్లు...వారు 

ఏమీ తెలియని అమాయక బలి పశువుల్లా ,,,

సూర్య అస్తమయంతో వెళుతుంటారు... 

తెల్లారగట్ట బలవంతమైన జన్మకటి ఎత్తుతుంటారు.. కానీ 

అందులో ఎందరో కాదు కొందరే .. 

పాపం..మిగతా ఇంకెందరో తమ అర్దాంగుల తాళి తెంపి 

అర్దాయుస్షు తోనే కనుమరుగైపోతారు మా ఊరి సూరిల్లు 
వాళ్ళే ఊరూరి "సారాయి" సూరిల్లు... 

అకాల మృత్యువాత పడే నష్ట జాతక సూరిల్లు ,,

--జయ రెడ్డి బోడ (అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com