గుజరాత్ లో అర్థరాత్రి హైడ్రామా... 46 మంది ఎమ్మెల్యేల తరలింపు
- July 28, 2017
24 గంటల్లో ఆరుగురు గుజరాత్ ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరడంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. మరింత మంది ఎమ్మెల్యేలు చేజారిపోకుండా... రాత్రికి రాత్రి మిగతా ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన కర్నాటకకు తరలించింది. శుక్రవారం రాత్రి 2:30 సమయంలో మొత్తం 46 మంది ఎమ్మెల్యేలు బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో దిగినట్టు సమాచారం. గుజరాత్ ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించి యోగ క్షేమాలు చూసుకునే బాధ్యత కర్నాటక మంత్రి డీకే శివకుమార్‌కు అప్పగించినట్టు చెబుతున్నారు. గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ఆయనే చక్కదిద్దిన అనుభవం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
అయితే 40 మంది బెంగళూరు వెళ్లారనీ.. మిగతావారంతా అహ్మదాబాద్‌లోనే ఉన్నట్టు అక్కడి పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బెంగళూరుకు తరలించిన ఎమ్మెల్యేలకు మళ్లీ తిరిగి ఆగస్టు 8 తర్వాతనే గుజరాత్ తీసుకెళ్లే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శక్తి సిన్హ గోహిల్, శైలేశ్ పార్మార్ వంటి సీనియర్ ఎమ్మెల్యేలను మాత్రం అహ్మదాబాద్‌లో ఉంచినట్టు కనిపిస్తోంది. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలుండగా... తాజా పరిణామాలతో కాంగ్రెస్ బలం 57 నుంచి 51 స్థానాలకు తగ్గిపోయింది.
వచ్చే నెల 8న గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి అహ్మద్‌పటేల్‌ను నామినేట్ చేయనున్నారు. ఆయన గెలవాలంటే 46 మంది సభ్యుల మద్దతు అవసరం. మరోవైపు బీజేపీ నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీలు పోటీ చేయనున్నారు. వీరితో పాటు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన బల్వంత్‌సిన్హ్ రాజ్‌పుత్‌ను కూడా బీజేపీ తమ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ రాజ్యసభ ఎన్నికల వరకు ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడినట్టు కనిపిస్తోంది.
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







