ట్రంప్‌ సై అంటే.. అణుదాడులకు సిద్ధమే అంటున్న కమాండర్‌ అడ్మిరల్‌ స్కాట్‌ స్విఫ్ట్‌

- July 29, 2017 , by Maagulf
ట్రంప్‌ సై అంటే.. అణుదాడులకు సిద్ధమే అంటున్న కమాండర్‌ అడ్మిరల్‌ స్కాట్‌ స్విఫ్ట్‌

అమెరికా ఫసిఫిక్‌ మహా సముద్ర నౌకాదళ కమాండర్‌ అడ్మిరల్‌ స్కాట్‌ స్విఫ్ట్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనాపై అణు దాడులకు సిద్ధమేనని ప్రకటించారు. అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశాలు జారీ చేస్తే.. వచ్చే వారంలోనే అణుదాడులు చేయనున్నట్లు చెప్పారు. ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్సిటీ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌ ఆదేశాలు జారీచేస్తే చైనాపై వచ్చేవారంలో అణుదాడులు చేస్తారా? అని వేసిన ప్రశ్నకు ఆయన అవును అని బదులిచ్చారు. అమెరికా మిలటరీలో ప్రతిఒక్కరూ రాజ్యాంగాన్ని కాపాడతామని, ఇతర దేశాల నుంచి పొంచి ఉన్న ముప్పు నుంచి ప్రజలను సంరక్షిస్తామని ప్రమాణం చేస్తారని అన్నారు.
ఇప్పటికే పసిఫిక్‌ మహా సముద్రంలో అంతర్భాగమైన దక్షిణ చైనా సముద్రం తమదేనని వాదిస్తూ చైనా నౌకల సంచారం కొనసాగిస్తూ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో స్విఫ్ట్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఇటీవల జిబోటిలో సైనిక స్థావరం ఏర్పాటుచేయడం ద్వారా చైనా హిందూమహా సముద్ర ప్రాంత దేశాలతో కయ్యానికి కాలుదువ్వేవిధంగా వ్యవహరించింది. ఈ పరిణామం ఆయా దేశాల్లో చిచ్చుపెడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల ఆస్ట్రేలియాతో కలిసి అమెరికా పెద్దఎత్తున సంయుక్త మిలటరీ విన్యాసాలు నిర్వహించింది. ఈ విన్యాసాల ద్వారా తమ బలాన్ని చైనాతో సహా శత్రుదేశాలకు అమెరికా, ఆస్ట్రేలియా చాటిచెప్పాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com