‘ఎయిటీస్‌ క్లబ్‌’ పేరుతో తెలుగు తమిళ కన్నడం సినీ యాక్టర్ల బృందం

- July 30, 2017 , by Maagulf
‘ఎయిటీస్‌ క్లబ్‌’ పేరుతో తెలుగు తమిళ కన్నడం సినీ యాక్టర్ల బృందం

శివ, స్వర్ణకమలం, ఖైదీ, సిరివెన్నెల... 1980ల్లో వచ్చిన ఇలాంటి ఆణిముత్యాల్లాంటి సినిమాల్ని అంత త్వరగా మరచిపోలేం. రాధిక, సుహాసిని, కమల్‌హాసన్‌, సుమన్‌... ఆ రోజుల్లో వెండితెరని వూపేసిన చాలామంది నటీనటుల్నీ సులువుగా మరచిపోలేం. మనలానే అప్పట్లో కలిసి నటించిన ఆ తరం హీరోహీరోయిన్లు కూడా ఇప్పటికీ ఒకరినొకరు మరచిపోలేకపోతున్నారు. అందుకే ‘ఎయిటీస్‌ క్లబ్‌’ పేరుతో వాళ్లంతా బృందంగా ఏర్పడి ప్రతి ఏడాదీ తప్పనిసరిగా కలుస్తూ ఆడీ పాడీ వేడుకలు చేసుకుంటున్నారు. చి రంజీవి, వెంకటేష్‌, రాధిక, సుహాసిని, రజనీకాంత్‌, సుమన్‌, రాధ, రమ్యకృష్ణ, మమ్ముట్టి, మోహన్‌లాల్‌, భానుచందర్‌... ఇలా 1980 తరవాత తమ సినిమాలతో దక్షిణాది చిత్ర పరిశ్రమలో టాప్‌ హీరోహీరోయిన్లుగా పేరు తెచ్చుకున్నవాళ్లు చాలామంది ఉన్నారు. వీళ్లలో కొందరు ఇప్పటికీ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇంకొందరు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మరికొందరైతే పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు.
కానీ అప్పట్లో కలిసి నటించిన చాలామంది నటీనటులు మాత్రం ఇప్పటికీ ఒకరికొకరు దూరం కాలేదు. వాళ్లంతా కలిసి ఎనిమిదేళ్ల క్రితం ‘ఎయిటీస్‌ క్లబ్‌’ పేరుతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏడాదికి ఓసారి కచ్చితంగా బృందంలోని సభ్యులంతా కలిసి సరదాగా గడపాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజుల్లో సినిమా పరిశ్రమల మధ్య ప్రాంతీయ భేదాలు చాలా తక్కువ.
రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, మోహన్‌లాల్‌, ఖుష్బూ, శరత్‌కుమార్‌, అర్జున్‌, శోభన... నిజానికి వీళ్లంతా ఇతర సినీ పరిశ్రమలకు చెందిన వాళ్లయినా, తెలుగు సినిమాల్లోనూ ఎక్కువగానే నటించేవారు. మన వాళ్లు కూడా అడపాదడపా ఇతర భాషల సినిమాల్లోనూ కనిపించారు. దాంతో ఒకరితో ఒకరికి మంచి సంబంధాలు కొనసాగేవి.
కానీ క్రమంగా వీళ్లందరి మధ్యా దూరం పెరగడం అప్పటి హీరోయిన్లు లిజీ, సుహాసినిలకు నచ్చలేదు. దాంతో ఇద్దరూ కలిసి తోటి నటీనటుల్ని ఒప్పించి ‘ఎయిటీస్‌ క్లబ్‌’ పేరుతో ఈ బృందాన్ని ఏర్పాటు చేసి ఏడాదికోసారి కచ్చితంగా కలవాలని నిర్ణయించుకున్నారు.

బృందంలో కేవలం తారలే ఉండాలనీ, వాళ్ల కుటుంబ సభ్యులు వేడుకలకు రాకూడదనీ రజనీకాంత్‌ షరతుపెట్టారు. ఇప్పటిదాకా వరసగా ఎనిమిదేళ్లపాటు వీళ్లంతా రకరకాల ప్రాంతాల్లో కలుసుకొని వేడుకలు చేసుకున్నారు.
అప్పటి జ్ఞాపకాల్ని తలచుకొని మురిసిపోయారు. అందమైన బహుమతుల్ని ఇచ్చిపుచ్చుకున్నారు. చాలామంది తమ చేతివంటనీ, ఇతర నైపుణ్యాల్నీ అందరికీ పరిచయం చేశారు. మొత్తంగా ఏటా దాదాపు 35మంది ప్రముఖ నటీనటులు ఆరేడు రోజుల పాటు ఒకే కుటుంబంలా గడుపుతున్నారు.
ఈ ఏడాది వీళ్లంతా తొలిసారి తమ వేడుకల్ని చైనాలో జరుపుకోవడం విశేషం.
ఒక్కోసారి ఒక్కోచోట 
మోహన్‌లాల్‌, సుహాసినీ, నైనా... ఇలా ఒక్కోసారి ఒక్కొక్కరు ఎయిటీస్‌ క్లబ్‌ వేడుకలకు ఆతిథ్యమిచ్చారు. ఏటా ఏదో ఒక థీమ్‌ పెట్టుకొని, దానికి తగ్గట్లుగా అందరూ ఒకే తరహా దుస్తులు వేసుకొని పార్టీలు చేసుకుంటున్నారు. ఓసారి చిరంజీవి ఎయిటీస్‌ క్లబ్‌ సభ్యుల చిన్నప్పటి ఫొటోలని సేకరించి, అంతా కలిసినప్పుడు ప్రదర్శన ఏర్పాటు చేశారు.
మరోసారి పార్టీలో పాల్గొన్నప్పుడు దిగిన ఫొటోలని ఫ్రేమ్‌ చేయించి మోహన్‌లాల్‌ అందరికీ పంచారు. ‘బయటి వేడుకల్లోలా లేనిపోని దర్పాన్నీ, తెచ్చిపెట్టుకున్న హుందాతనాన్నీ ఇక్కడ ప్రదర్శించాల్సిన అవసరం ఉండదు. మేము మాలానే ఉంటూ సరదాగా నిజాయతీగా ఇక్కడ గడపొచ్చు’ అంటారు సుహాసిని. మొత్తానికి దక్షిణాది అగ్ర నటీనటులనంతా ఒకే ఫ్రేములో చూస్తున్న సినీ అభిమానులు మాత్రం తెగ సంబరపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com