ఇరాక్ లో సల్ఫర్ మస్టర్డ్ దాడులు

- October 22, 2015 , by Maagulf
ఇరాక్ లో సల్ఫర్ మస్టర్డ్ దాడులు

ఇరాక్ లో అమానుషాలకు ఒడిగడుతున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తాజాగా రసాయన దాడులకు సైతం తెగబడుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాక్ లోని కుర్దిష్ సేనలపై ఐఎస్ఐఎస్ గ్రూప్ నిషేధిత రసాయన ఆయుధ దాడులు జరుపుతున్నట్టు దౌత్యవర్గాలు భావిస్తున్నాయి. ఈ మేరకు సల్ఫర్ మస్టర్డ్ దాడులు జరిగాయా? లేదా? అన్నది ధ్రువీకరించాలని అవి అంతర్జాతీయ పర్యవేక్షకులను కోరాయి. ఐఎస్ ఉగ్రవాదులు ఇటీవల కుర్దిష్ బలగాలకు చెందిన 35 దళాలపై అజ్ఞాత దాడులు జరిపారు. ఈ దాడుల్లో పలువురు సైనికులకు విపరీతమైన గాయాలయ్యాయి. వీరి గాయాలను పరిశీలిస్తే.. ఇవి నిషేధిత రసాయన వాయువులతో చేసిన దాడులు అయి ఉంటాయని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రసాయన ఆయుధాలపై నిషేధం కోసం కృషిచేస్తున్న ఓపీసీడబ్ల్యూ సంస్థ బృందం ఇరాక్ లో పర్యటించి.. ఈ దాడులకు సంబంధించిన వాస్తవాలను వెలికితీసుకురానుంది. మరోవైపు వరుస వైమానిక దాడులతో బలహీనపడుతున్న ఐఎస్ఐఎస్ 14 ఏళ్ల బాలురను సైతం ఉగ్రవాద గోదాలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నది. తన అధీనంలో ఉన్న 14 ఏళ్లు, ఆ పైచిలుకు బాలురను సమీకరించేందుకు యత్నిస్తున్నది. ఇందులో భాగంగా ఉత్తర జిల్లాలోని రఖ్కా నగరంలో 14 ఏళ్ల పైచిలుకు అబ్బాయిలు తమ పేర్లను నమోదుచేయించుకోవాలని ఆ గ్రూప్ సర్క్యులర్ జారీ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com