సంజయ్‌ దత్‌ ప్రధాన పాత్రలో 'ది గుడ్‌ మహారాజ' ఫస్ట్‌లుక్‌

- August 30, 2017 , by Maagulf
సంజయ్‌ దత్‌ ప్రధాన పాత్రలో  'ది గుడ్‌ మహారాజ' ఫస్ట్‌లుక్‌

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'ది గుడ్‌ మహారాజ'. ఒమంగ్‌ కుమార్‌దర్శకుడు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఈరోజు విడుదల చేశారు. ఇందులో సంజయ్‌ మహారాజు గెటప్‌లో ఆకట్టుకుంటున్నారు.
ఈ సినిమాలో సంజయ్‌.. ఒకప్పటి బ్రిటీష్‌ ఇండియా ప్రాంతమైన నవానగర్‌కి చెందిన మహారాజా జామ్‌ సాహిబ్‌ దిగ్విజయ్‌ సింజి పాత్రలో నటిస్తున్నారు. గుజరాత్‌లో ఉన్న ఈ నవానగర్‌ను ఇప్పుడు అంతా జామ్‌నగర్‌గా పిలుస్తున్నారు. జామ్‌ సాహిబ్‌.. భారత మాజీ క్రికెటర్‌ కె.ఎస్‌ రంజిత్‌ సింజి మేనల్లుడు. జామ్‌ సాహిబ్‌ గుజరాత్‌లోని సరోదర్‌ ప్రాంతంలో జన్మించారు. 1919లో బ్రిటీష్‌ ఆర్మీలో లెఫ్ట్‌నెంట్‌గా పనిచేశారు.
1933లో కె.ఎస్‌ రంజిత్‌ సింజి చనిపోవడంతో నవానగర్‌ మహారాజుగా జామ్‌ సాహిబ్‌ బాధ్యతలు తీసుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఎందరో పోలాండ్‌ వాసులకి నవానగర్‌లో పునరావాసం కల్పించారు. ఇప్పటికీ పోలాండ్‌ వాసులు జామ్‌ సాహిబ్‌ను ఓ దైవంగా భావిస్తారు. పోలాండ్‌ రాజధాని వార్సాలో 'ది గుడ్‌ మహారాజ' పేరిట ఓ స్థూపాన్ని కూడా ఏర్పాటుచేశారు. సాహిబ్‌ 1937 నుంచి 1938 వరకు బీసీసీఐకి అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు.
ఇప్పుడు సాహిబ్‌ జీవితాధారంగా ఈ చిత్రాన్ని ఒమంగ్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్ని పోలాండ్‌లోని మహారాజ స్థూపం వద్ద చిత్రించాలనుకుంటున్నారు. ఇందుకోసం ఒమంగ్‌ కుమార్‌ పోలాండ్‌ ప్రభుత్వంతో చర్చలు కూడా జరిపినట్లు తెలిసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com