మెగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ బర్త్‌డే స్పెషల్
- September 14, 2017
నాలుగు దశాబ్ధాలకు పైగా ఇండస్ట్రీలో ఎన్నో విజయాలు అందుకుని ఒన్ అండ్ ఓన్లీ మెగా ప్రొడ్యూసర్ గా అవతరించిన వైజయంతీ మూవీస్ అధినేతగా.. తెలుగులో భారీ చిత్రాల నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అశ్వనీదత్ పుట్టిన రోజు ఇవాళ.
చలసాని అశ్వనీదత్ ది విజయవాడ. ఎన్టీఆర్, జంధ్యాల చదివిన కాలేజ్ లోనే చదివాడు. దీంతో సహజంగానే తనకూ సినిమా అంటే అమితమైన ఆసక్తి ఏర్పడింది. అందుకే చదువు కాగానే వెంటనే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిపోయాడు. అనుభవం లేకపోయినా కేవలం ఉత్సాహమే పెట్టుబడిగా పరిశ్రమలోకి ప్రవేశించాడు. జంధ్యాల సలహాతో తొలుత కొందరు మిత్రులతో కలిసి ఓ సీత కథ అనే సినిమా నిర్మించాడు..
అశ్వనీదత్ కు ఎన్టీఆర్ అంటే మహాఇష్టం. ఓ రకంగా ఇండస్ట్రీలోకి రావడానికీ ఆ ఇష్టమే కారణం. అందుకే తను సినిమా తీస్తే ఫస్ట్ ఎన్టీఆర్ తోనే అని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయాన్ని అమలుపరచడమే కాదు.. ఏకంగా తన బ్యానర్ కు పెద్దాయన చేతులమీదుగా నామకరణం చేయించుకున్నాడు. ఆ బ్యానర్ లోగోలో శంఖం పట్టుకున్న కృష్ణుడి గెటప్ లో ఎన్టీఆర్ ను చిత్రించుకున్నాడు. మొత్తంగా తన బ్యానర్ లో ఫస్ట్ మూవీ ఎన్టీఆర్ తోనే చేశాడు. అదే కె బాపయ్య దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఎదురులేని మనిషి..
ఎదురులేని మనిషి హిట్ కావడంతో అదే టీమ్ తో రెండో సినిమా అనౌన్స్ చేశారు. అడవి రాముడు సక్సస్ ఫుల్ జంట ఎన్.టి.ఆర్, జయప్రదలతో తీసిన యుగపురుషుడు మ్యూజికల్ గా కూడా పెద్ద హిట్టు కొట్టింది. అశ్వనీదత్ కు స్టార్ ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపును తెచ్చింది ఈ చిత్రం. కారణాలేవైనా అశ్వనీదత్ నిర్మాణంలో ఎన్.టి.ఆర్ చేసిన చివరి చిత్రం కూడా యుగపురుషుడే.
తర్వాత ఇండస్ట్రీలోని మరో అగ్రనటుడు అక్కినేని నాగేశ్వర్రావు..మాస్ లో ఎన్.టి.ఆర్ తర్వాత స్ఠానంలో ఉన్న కృష్ణతో కలిపి గురుశిష్యులు అనే మల్టీస్టారర్ తీశాడు. ఈ భారీ ప్రాజెక్ట్ కూ బాపయ్యే డైరక్టరు. గురుశిష్యులు కూడా మంచి విజయాన్నే సాధించింది. ఈ బ్యానర్ లో దర్శకుడు బాపయ్యకు కూడా ఇదే చివరి సినిమా.
అశ్వనీదత్ కాంబినేషన్ క్రేజ్‌ను క్యాచ్ చేయడంలో ఎక్స్ పర్ట్.. అందుకే కృష్ణ, కృష్ణంరాజులతో ఓ భారీ మల్టీస్టారర్ కు శ్రీకారం చుట్టాడు. ఈ సారి రాఘవేంద్రరావు దర్శకుడు. సినిమా పేరు అడవి సింహాలు. ఇది నిర్మాణపరంగా ఓ సెన్సేషన్. ఆ తర్వాత కృష్ణ, రాఘవేంద్రరావులతో అగ్నిపర్వతం తీశారు. అగ్నిపర్వతం కృష్ణ ఇమేజ్ ను ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ కు కృష్ణ మేనరిజం తోడై సూపర్ డూపర్ హిట్ అయింది. 1986లొ విడుదలైన బ్రహ్మరుద్రులు తరవాత వచ్చిన సినిమాలు అశ్వనీదత్ ను టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరుగా నిలబట్టాయి.
యండమూరి వీరేంద్రనాథ్ నవలను తీసుకుని అశ్వనీదత్ మళ్లీ కాంబినేషన్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని నాగార్జున, రాఘవేంద్రరావులతో శ్రీదేవి ఓ ప్రధాన పాత్రలో ఆఖరిపోరాటం తీశాడు. ఆఖరిపోరాటం నాగార్జునకు ఫస్ట్ కమర్షియల్ హిట్ గా నిలిచింది.
చిరంజీవి, శ్రీదేవి నటిస్తే చూడాలని జనం బలంగా అనుకుంటున్న దశలో రాఘవేంద్రజాలాన్ని యాడ్ చేసి ఓ విజువల్ వండర్ క్రియేట్ చేసి సూపర్ సక్సెస్ అందుకున్నారు. అదే రికార్టులు బద్దలు కొట్టిన జగదేకవీరుడు అతిలోకసుందరి.
జగదేకవీరుడు అతిలోకసుందరి, చూడాలని ఉంది తర్వాత చిరంజీవితో మూడో సినిమాకు శ్రీకారం చుట్టాడు అశ్వనీదత్. అయితే చిరంజీవిని ఇంకా కొత్తగా చూపించాలి. జనం కోరుకుంటున్నది సినిమాలో కనిపించాలి. అదే ఆయన తపన. అదే ఇంద్ర సినిమాగా తెరమీద ఆవిష్కృతం అయింది. సూపర్ హిట్ అయ్యింది. కానీ ఇంద్ర తర్వాత వచ్చిన ఏ ఫాక్షన్ మూవీ ఆ స్థాయి విజయం సాధించలేదు.
చిరంజీవితో హోమ్లీ కామెడీ కారక్టర్ చేయించి మళ్లీ కొత్త ఇమేజ్ కు ఆయన్ను టర్న్ చేద్దామనుకుని చేసిన సినిమా జై చిరంజీవ. ఎంతో ఇష్డపడి చేసిన ఆ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో విఫలమైంది. చిరంజీవి స్టార్డమ్ ముందు కామెడీ హైలెట్ కావడం పెద్ద మైనస్ అయితే కథలో కూడా పెద్ద పస లేదనే చెప్పుకోవచ్చు.
ఫామ్ లో ఉన్న హీరోలనే సరికొత్తగా చూపించే అశ్వనీదత్ చేతుల్లో కొత్త హీరోలను పెడితే ఇంకెంత కొత్తగా చూపిస్తాడో అనే నమ్మకం ఇండస్ట్రీలో చాలా మందికి ఉంది. ఆ నమ్మకంతోనే కృష్ణ, చిరంజీవి లాంటి హీరోలు తమ వారసుల్ని ఇండస్ట్రీకి పరిచయం చేసే పని దత్తుగారికే అప్పగించారు. ఇవాళ సూపర్ స్టార్ గా టాప్ హీరోగా వెలుగులోన్న మహేష్ బాబును రాజకుమారుడుతో.. మెగా పవర్ స్టార్ గా వెలుగుతోన్న రామ్ చరణ్ ను చిరుతతో ఇంటర్ డ్యూస్ చేసింది దత్ గారే.
మహేష్ బాబు, రామ్ చరణ్ లతో పాటు జూనియర్ ఎన్.టి.ఆర్ ను పరిచయం చేసింది కూడా ఒక రకంగా అశ్వనీదత్తే. మొదటి సినిమా ఉషాకిరణ్ మూవీస్ లోనే అయినా...అశ్వనీదత్ నిర్మాణ బాధ్యతలు వహించిన స్టూడెంట్ నంబర్ ఒన్ ఎన్.టి.ఆర్ ను ఆడియన్స్ కు దగ్గర చేసింది. మరో విషయం సెన్సేషనల్ డైరక్టర్ రాజమౌళిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా అశ్వనీదత్ కే దక్కుతుంది.
ప్రస్తుతం వైజయంతీ బ్యానర్ లోనే కొన్ని భారీ చిత్రాలకు రూపకల్పన చేస్తున్నారు అశ్వనీదత్. వీటిలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జగదేకవీరుడు అతిలోకసుందరికి సీక్వెల్ కూడా ఉంది. మరోసారి వైజయంతీ మూవీస్ సత్తా చాటాలనీ కోరుకుంటూ అశ్వనీదత్ కు మరోసారి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుదాం..
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







