చంద్రబాబుతో భేటీ అయిన రాజమౌళి
- September 20, 2017
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రముఖ దర్శకుడు రాజమౌళి బుధవారం ఉదయం భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి నివాసంలో జరుగుతున్న ఈ సమావేశంలో రాజమౌళితో పాటు మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ అధికారులు కూడా పాల్గొన్నారు. ఏపీ రాజధానిలో నిర్మించబోయే అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు లండన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్ ఇచ్చిన డిజైన్లపై చర్చించారు. రాజధాని డిజైన్ల విషయంలో సహకారం అందిస్తామని సీఎం చంద్రబాబుకు ఈ సందర్భంగా రాజమౌళి తెలిపారు.
భేటీ అనంతరం రాజమౌళి మాట్లాడుతూ... రాజధాని డిజైన్లు ఎలా ఉండాలో సీఎం సూచించారు. మధ్యాహ్నం మరోసారి సీఎంను కలవనున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా నార్మన్ ఫోస్టర్ ఇచ్చిన డిజైన్లను తిరస్కరించిన ముఖ్యమంత్రి వెంటనే రాజమౌళిని కలసి సలహాలు తీసుకోవాలని మంత్రి నారాయణను ఆదేశించిన విషయం తెలిసిందే.
మరోవైపు టీవీ సీరియల్ మాదిరిగా సాగు..తున్న రాజధాని డిజైన్ల కోసం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) అధికారులు మళ్లీ లండన్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వీలైతే ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటివారంలో లండన్‌లోని నార్మన్ ఫోస్టర్ ప్రధాన కార్యాలయానికి వెళ్లాలని వారు భావిస్తున్నారు. తమతోపాటు దర్శకుడు రాజమౌళి, ఆయన అనుచరులను తీసుకెళ్లాలని చూస్తున్నారు. లండన్ వెళ్లడానికి తనకు ఇబ్బంది లేదని చెప్పిన రాజమౌళి దానికి ముందు సీఎంతో మాట్లాడి తన సినీ సెట్టింగ్‌ల అనుభవం డిజైన్ల రూపకల్పనకు ఏ మేరకు ఉపయోగపడుతుందో చర్చించినట్లు సమాచారం. అయినా ఆయన్ను లండన్ తీసుకెళ్లడానికి సీఆర్‌డీఏ అధికారులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే డిజైన్ల కోసం మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ అధికారులు మూడుసార్లు లండన్ వెళ్లారు. మూడు నెలల నుంచి వరుసగా లండన్ పర్యటనలు జరిపినా డిజైన్లు మాత్రం ఖరారు కాలేదు. వాస్తవానికి రాజధాని పేరుతో మూడేళ్ల నుంచి అదేపనిగా సీఆర్‌డీఏ అధికారులు విదేశీ యాత్రలు చేస్తూనే ఉన్నారు. 2015లో రాజధాని మాస్టర్‌ప్లాన్ల కోసం పలుమార్లు సింగపూర్‌లో పర్యటించారు. సీఎం చంద్రబాబే రెండుమార్లు సింగపూర్ వెళ్లగా అధికారుల బృందాలు నాలుగైదుసార్లు అక్కడికెళ్లి వచ్చాయి. 2016 ఆగస్టులో సీఆర్‌డీఏ అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి ‘బెస్ట్ ప్రాక్టీసెస్ స్టడీ టూర్’ పేరుతో ఆస్థానా, టోక్యో, పుత్రజయ, సింగపూర్ వంటి పలు నగరాలను సందర్శించారు. అదేనెలలో రవాణా రంగంపై అధ్యయనం కోసం లండన్ వెళ్లారు.
మళ్లీ సింగపూర్, చైనా, లండన్‌లలోనూ పలుసార్లు పర్యటించారు. ఈ ఏడాది ఇప్పటికే నాలుగుసార్లకుపైగా లండన్‌తో పాటు చైనాలో పర్యటన జరిపారు. ఇలా అదేపనిగా కోట్ల ఖర్చుతో విదేశీయాత్రలు చేస్తున్నా డిజైన్లు మాత్రం ఖరారవలేదు. ఈ నేపథ్యంలో మరలా లండన్ పర్యటనతో పాటు మళ్లీ రాజధాని కోసం ‘బెస్ట్ ప్రాక్టీసెస్ స్టడీ టూర్’ చేపట్టేందుకు సిద్ధమవుతుండడం గమనార్హం.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







