చిన్న పిల్లలను దేవతలుగా మారుస్తున్న నేపాలీయులు

- September 28, 2017 , by Maagulf
చిన్న పిల్లలను దేవతలుగా  మారుస్తున్న నేపాలీయులు

కొన్ని దేశాలు, ప్రాంతాల్లో తరతరాలుగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ టెక్నాలజీ యుగంలో కూడా కాలం చెల్లిన ఆచార వ్యవహారాలకి పట్టం కడుతున్నారు. పెద్దల మూఢనమ్మకాలకు పిల్లలను బలి చేస్తుంటారు.  నేపాల్‌లోని హిందూ మత గురువులు మూడేళ్ల బాలికను తమ ఇష్ట దేవతగా ఎంపిక చేశారు. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉన్న చిన్నారులను కుమారీలుగా నియమించడం ఇక్కడ సంప్రదాయంగా వస్తోంది. ఈ చిన్నారిని నేపాలీయులు తమ ఆరాధ్య దైవమైన తలెజుగా భావిస్తారు. ఒకసారి దేవతగా ఎంపికైన బాలిక యుక్తవయస్సు వచ్చే వరకు మాత్రమే దేవత హోదాలో ఉంటుంది. 
దేవత ఎంపిక కూడా మామూలుగా ఉండదు.  మూడు వారాల పాటు కఠిన పరీక్షలు పెడతారు.  అందులో నెగ్గిన వారిని మాత్రమే దేవతగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఆ పరీక్షల్లో ముఖ్యమైనవి శరీరంపై ఎలాంటి గాయాలు ఉండకూడదు, నేత్రాలు, దంతాలలో ఎలాంటి లోపాలు ఉండకూడదు.  బలి ఇచ్చిన పశువుల మధ్య ఓ రాత్రి అంతా ధైర్యంగా ఉండాలి. మూడు రాజవంశాలైన కాఠ్మండు, పటాన్, భక్తపూర్‌ల నుంచి మాత్రమే ఈ దేవతల ఎంపిక జరుగుతుంది.  దేవతగా ఉన్నంతకాలం ఎరుపు రంగు దుస్తులను మాత్రమే ధరించాలి. త్రిష్టా శాక్య అనే చిన్నారి ఈ సారి దేవతగా ఎంపికైంది. అయితే ఈ సంప్రదాయాన్ని నిరసిస్తూ బాలల హక్కుల సంఘాలనుంచి విమర్శలు రావడం, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో దేవతలుగా ఎంపికైన బాలికలకు విద్యను అందిస్తున్నారు. నేపాలీ ప్రభుత్వ నేతలు కూడా ఈ చిన్నారి దేవతల ఆశీస్సులు తీసుకుంటున్నారంటే ఈ సంప్రదాయాన్ని వారు ఎంత బలంగా విశ్వసిస్తున్నారో అర్థమవుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com